Karimnagar : అమానుషం: కన్నపిల్లలను పోలీస్ స్టేషన్‌లో వదిలేసి వెళ్లిన తల్లిదండ్రులు!

కన్నప్రేమ కరువైందో.. లేక కసి పెరిగిందో తెలియదు కానీ, తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్ సాక్షిగా ఒక అమానుష ఘటన చోటుచేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లిదండ్రులే.. తమ ఇద్దరు చిన్నారులను పోలీస్ స్టేషన్‌లో వదిలిపెట్టి, ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.

New Update
kids

కన్నప్రేమ కరువైందో.. లేక కసి పెరిగిందో తెలియదు కానీ, కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్ సాక్షిగా ఒక అమానుష ఘటన చోటుచేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లిదండ్రులే.. తమ ఇద్దరు చిన్నారులను పోలీస్ స్టేషన్‌లో వదిలిపెట్టి, ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.

సుమారు ఎనిమిదేళ్ల క్రితం రవికుమార్, లలిత అనే యువతీ యువకులు పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పట్లో ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు పుట్టారు. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న సమయంలో, గత కొంతకాలంగా వీరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. చిన్నపాటి గొడవలు కాస్తా ముదిరిపోయి, ఇద్దరూ విడివిడిగానే ఉంటున్నారు. ప్రస్తుతం లలిత నిజామాబాద్‌లో, రవి కరీంనగర్‌లో నివసిస్తున్నారు.

ఇద్దరి మధ్య గొడవ జరగడంతో

పిల్లల బాధ్యత విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో, చివరకు వారిని తీసుకువచ్చి తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్‌లో వదిలేశారు. "నాకు వద్దు అంటే నాకు వద్దు" అంటూ ఆ చిన్నారులను అక్కడే వదిలి పెట్టి ఆ తల్లిదండ్రులు వెనుదిరగడం చూసి అక్కడి వారు నిర్ఘాంతపోయారు. స్టేషన్‌లో ఉన్న పోలీసుల వద్ద ఆ చిన్నారులు "అమ్మ కావాలి.. నాన్న కావాలి" అంటూ కన్నీరుమున్నీరుగా ఏడుస్తుంటే, కఠినంగా ఉండే పోలీసుల కళ్లు కూడా చెమ్మగిల్లాయి.

తల్లిదండ్రులు ఎంతకీ వినకపోవడంతో, పోలీసులు ఆ చిన్నారుల నానమ్మ వివరాలను సేకరించారు. ఆమెను పిలిపించి పిల్లల క్షేమ సమాచారాలను వివరించి, జాగ్రత్తగా చూసుకోవాలని కోరుతూ వారికి అప్పగించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు ఇలా బాధ్యతలను విస్మరించి పిల్లలను నడిరోడ్డుపై వదిలేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

Advertisment
తాజా కథనాలు