/rtv/media/media_files/2025/02/06/COD9DrwAZw0mb91V8cwC.jpg)
telangana minister
కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగలు చల్లారడం లేదు. ఈ అసమ్మతి సెగలు బెంగళూరు వరకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా బెంగుళూరులో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కలిసినట్లుగా తెలుస్తోంది. బుధవారం రాత్రి బెంగుళూరులో కృష్ణ, తుంగభద్రకు నీటి విడుదల విషయమై వీరంతా అక్కడికి వెళ్లి ఖర్గేను కలిశారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేను తీసుకొస్తే కనీసం తనకు ప్రాధాన్యం కూడా ఇవ్వడం లేదని కనీసం తనకు సహకరించడం లేదంటూ ఖర్గే వద్ద మంత్రి జూపల్లి వాపోయారట.
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షీ మీటింగ్ ఉండగా ఖర్గేను కలిసి గోడు వెళ్లబోసుకున్నారట జూపల్లి. మరోవైపు గద్వాల నియోజకవర్గంలో తనకు ప్రాధన్యత ఇవ్వకుండా సరితా తిరుపతయ్యకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఖర్గే వద్ద ఆవేదన వ్యక్తం చేశారట. తన నియోజకరవర్గంలో ఉప ఎన్నికలు వస్తే తన పరిస్థితి ఏంటని ఎమ్మెల్యే అయోమయంలో పడ్డారని తెలుస్తోంది. దీనిపై మల్లిఖర్జున ఖర్గే కూడా చాలా సానుకూలంగా స్పందించారని వార్తలు వస్తున్నాయి. జూపల్లి వెంట ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, గవినోళ్ల మధుసూదన్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ కర్ణాటకకు వెళ్లారు.
సీఎం రేవంత్ మీటింగ్
కాంగ్రెస్ శాసనసభాపక్షం గురువారం సమావేశం కానుంది. హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల కేంద్రంలో సీఎం రేవంత్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు, కులగణన, ఎస్సీ వర్గీకరణను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ప్రధానంగా ఈ భేటీలో చర్చించనున్నారు. ఇటీవల అసంతృప్త ఎమ్మెల్యేల భేటీ అంశాన్ని కూడా ఈ మీటింగ్ లో ప్రస్తావిచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ భేటీలో రాష్ట్ర ఇంఛార్జి దీపాదాస్ మున్షీ, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా కూడా పాల్గొననున్నారు.
ఢిల్లీకి సీఎం రేవంత్
ఈ మీటింగ్ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయన వెంట పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా వెళ్లనున్నారు. ఈ పర్యటనలో తమ పార్టీ అధ్యక్షుడు ఖర్గేతో పాటుగా పలువురు అగ్రనేతలతో సీఎం భేటీ కానున్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ సహా పలు నిర్ణయాలపై అధిష్ఠానానికి రేవంత్ వివరిస్తారని తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో పార్టీ కూర్పు, మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్యేల విషయంపైనా ఆయన చర్చించవచ్చని సమాచారం.
Also Read : ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటేశా.. ముస్లిం మత పెద్ద సంచలన కామెంట్స్ !