MeeSeva : సామాన్యుడి బిగ్ షాక్.. పెరిగిన మీ సేవ ధరలు.. ఏ సర్టిఫికెట్ కు ఎంతంటే!

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సామాన్యులకు నిత్యం అవసరమయ్యే 'మీసేవ' (MeeSeva) సేవల ధరలు ఈరోజు నుండి పెరిగాయి. సుమారు ఎనిమిదేళ్ల తర్వాత ప్రభుత్వం ఈ ఛార్జీలను సవరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

New Update
mee seva (1)

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సామాన్యులకు నిత్యం అవసరమయ్యే 'మీసేవ' (MeeSeva) సేవల ధరలు ఈరోజు నుండి పెరిగాయి. సుమారు ఎనిమిదేళ్ల తర్వాత ప్రభుత్వం ఈ ఛార్జీలను సవరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. చివరిసారిగా 2018-19లో ఈ ధరలను మార్చారు. పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, డిజిటల్ నెట్‌వర్క్ సామర్థ్యాన్ని పెంచే ఉద్దేశంతోనే ఈ పెంపు అని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ప్రభుత్వం సేవల ప్రాముఖ్యతను బట్టి వాటిని వివిధ కేటగిరీలుగా విభజించింది. గతంలో రూ. 35 నుండి రూ. 45 మధ్య ఉన్న ప్రాథమిక ధృవీకరణ పత్రాల (Category A) ధర ఇప్పుడు రూ. 62కు చేరింది. అదేవిధంగా, మేజర్ సర్టిఫికెట్లు, ఇతర దరఖాస్తుల (Category B) ధర రూ. 45-60 నుండి ఏకంగా రూ. 80కి పెరిగింది. బయోమెట్రిక్,  రైతు నమోదు వంటి సేవల ధరలు కూడా రూ. 10-20 నుండి రూ. 18-35 వరకు సవరించబడ్డాయి.

సామాన్యులు ఎక్కువగా ఉపయోగించే ఆదాయ, కుల, నివాస, EWS ధృవీకరణ పత్రాల కోసం ఇకపై రూ. 80 చెల్లించాల్సి ఉంటుంది. ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్ (EC), బర్త్ సర్టిఫికెట్ ప్రింట్, డ్రైవింగ్ లైసెన్స్ ఫీజు చెల్లింపులు, ఎల్.ఎల్.ఆర్ స్లాట్ బుకింగ్ వంటి సేవలకు రూ. 62 చొప్పున ఛార్జీ నిర్ణయించారు. రేషన్ కార్డు దరఖాస్తులు లేదా సవరణలకు కూడా రూ. 80 ఖర్చవుతుంది. రైతు నమోదు కోసం రూ. 18, ఈ-పాస్ బయోమెట్రిక్ కోసం రూ. 35 చెల్లించాలి.

ప్రభుత్వం కొత్త నిబంధనలు 

మరోవైపు డాక్యుమెంట్ల నిర్వహణ కోసం ప్రభుత్వం కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఏదైనా సేవలో మొదటి నాలుగు పేజీల తర్వాత చేసే ప్రతి అదనపు స్కానింగ్ లేదా ప్రింటింగ్‌కు పేజీకి రూ. 2.50 అదనంగా వసూలు చేస్తారు. కరెంట్ బిల్లుల చెల్లింపులపై కూడా భారం పడనుంది. రూ. 200 లోపు బిల్లులకు రూ. 4, రూ. 201 నుండి రూ. 1,000 వరకు రూ. 9, రూ. 1,001 నుండి రూ. 2,500 వరకు రూ. 18,  రూ. 2,500 దాటితే రూ. 44 సర్వీస్ ఛార్జీగా వసూలు చేస్తారు.

మీసేవ కేంద్రాల్లో నిర్ణయించిన ధరల కంటే ఎవరైనా అదనంగా వసూలు చేస్తే, ఫిర్యాదు చేయడానికి ప్రభుత్వం టోల్ ఫ్రీ నంబర్ 1800 425 1110 ను అందుబాటులోకి ఉంచింది.

Advertisment
తాజా కథనాలు