medaram: మేడారంలో ఆర్టీసీ అట్టర్ ఫ్లాప్.. భక్తులు బస్సు అద్దాలు ధ్వంసం!

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారంలో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. భక్తులను సురక్షితంగా ఇళ్లకు చేర్చడంలో అటు ఆర్టీసీ, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యాయని భక్తులు మండిపడుతున్నారు.

New Update
medaram

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారంలో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. భక్తులను సురక్షితంగా ఇళ్లకు చేర్చడంలో అటు ఆర్టీసీ, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యాయని భక్తులు మండిపడుతున్నారు. గంటల తరబడి నిరీక్షించినా బస్సులు రాకపోవడంతో సహనం కోల్పోయిన భక్తులు అధికారులపై తిరుగుబాటు చేశారు.

హనుమకొండ, హైదరాబాద్ వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన భక్తులు వేలాదిగా బస్టాండ్‌లో పడిగాపులు కాస్తున్నారు. బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రయాణికుల రద్దీ పెరిగిపోయింది. వేలాది మందితో బస్టాండ్ కిక్కిరిసిపోగా.. చంటి బిడ్డల తల్లులు, వృద్ధులు, మహిళలు తీవ్రమైన ఎండలో అల్లాడిపోతున్నారు.

సమయానికి బస్సులు రాకపోవడం, అడిగేందుకు అధికారులు అందుబాటులో లేకపోవడంతో భక్తుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, అక్కడ ఉన్న కొన్ని బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం జాతర నిర్వహణలో కనీస జాగ్రత్తలు తీసుకోలేదని, సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోందని భక్తులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 

పోలీసులకు, రవాణా శాఖ అధికారులకు మధ్య అసలు సమన్వయం లేకపోవడంతో పరిస్థితి అదుపు తప్పుతోంది. భారీగా తరలివచ్చిన భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలోనూ అధికార యంత్రాంగం చేతులెత్తేసిందని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అదనపు బస్సులను ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. 

మేడారంలో భారీ ట్రాఫిక్ జామ్

మరోవైపు మేడారంలో భారీ ట్రాఫిక్ జామ్  ఉంది. వనదేవతల దర్శనం అనంతరం భక్తులు తిరుగు ప్రయాణం కావడంతో మేడారం నుంచి తాడ్వాయి వరకు 14 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 8 గంటలుగా వాహనాలు నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  

Advertisment
తాజా కథనాలు