![Telangana MLC elections](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/media_files/2025/02/10/XBwzVnV8yqmbzm7ip9zp.jpg)
Telangana MLC elections
కరీంనగర్ - నిజామాబాద్ - ఆదిలాబాద్ - మెదక్ పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ, నల్లగొండ - ఖమ్మం - వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీకీ ఇప్పటి వరకు మొత్తం 85 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. వరంగల్ - ఖమ్మం - నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పటి వరకు 17 మంది 23 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. పీఆర్‌టీయూ బలపర్చిన అభ్యర్థి శ్రీపాల్‌రెడ్డితోపాటు బీజేపీ అభ్యర్థి సరోత్తంరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
అలాగే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, టీజేఏసీ అభ్యర్థిగా హర్షవర్ధన్ రెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ నామినేషన్‌ను వేశారు. కరీంనగర్ - నిజామాబాద్ - ఆదిలాబాద్ - మెదక్ పట్టభద్రుల నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ బలపరిచిన అల్పొర్స్ కాలేజీ అధినేత నరేంద్రరెడ్డి పోటీ చేస్తుండగా, బీజేపీ బలపరిచిన అంజిరెడ్డి కూడా పోటీలో ఉన్నారు. మరోవైపు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉండడం గమనార్హం. అయితే ఆ పార్టీ ఏ అభ్యర్థికి కూడా మద్ధతు ఇస్తున్నట్లుగా ప్రకటించలేదు.
కాగా తెలంగాణలోని ఎమ్మెల్సీ ఎన్నికలకు ఫిబ్రవరి 3వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 3 ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ ఏడాది మార్చి 29న ఈ ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నిలకు అనివార్యమైనాయి. కాగా ఈ ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలని కంకణం కట్టుకుంది. నామినేషన్ కార్యక్రమానికి అటు వరంగల్, ఇటు కరీంనగర్ ఉమ్మడి జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో హజరుకావడం విశేషం.