Maoist leader Devji: రాజకీయాల్లోకి కామ్రేడ్ దేవ్‌జీ ఎంట్రీ.. తుపాకి వదిలి కోరుట్ల నుంచే పోరు

జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన దేవ్‌జీ ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. 1983లో జగిత్యాల జైత్రయాత్ర స్ఫూర్తితో అడవి బాట పట్టిన ఆయన, దాదాపు 40 ఏళ్ల పాటు అజ్ఞాతంలో గడిపారు. 1982లో తిరుపతి పీపుల్స్ వార్ గ్రూప్‌లో చేరారు.

New Update
devji

నాలుగు దశాబ్దాల పాటు అడవిని నమ్ముకుని, తుపాకీ పట్టిన చేతులతో విప్లవ వ్యూహాలు రచించిన మావోయిస్టు పార్టీ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ తన అజ్ఞాత జీవితానికి స్వస్తి పలికారు. ఫిబ్రవరి 26న తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయిన ఆయన, ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

అజ్ఞాత ప్రస్థానం నుంచి అత్యున్నత పదవి వరకు
జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన దేవ్‌జీ ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. 1983లో జగిత్యాల జైత్రయాత్ర స్ఫూర్తితో అడవి బాట పట్టిన ఆయన, దాదాపు 40 ఏళ్ల పాటు అజ్ఞాతంలో గడిపారు. 1982లో తిరుపతి పీపుల్స్ వార్ గ్రూప్‌లో చేరారు. 1989లో డివిజనల్ కమిటీ మెంబర్‌గా.. తర్వాత 1993లో గడ్చిరోలి సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శిగా ఎంపికయ్యారు. 1995లో స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడిగా, 2001లో సెంట్రల్ కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొందాడు. ఆయనకు రమేష్, దేవుజి, సంజీవ్, చేతన్, కుమ్మ దాదా అనే మారు పేర్లు కూడా ఉన్నాయి.

1991లో ఆయన మహారాష్ట్రలోని గడ్చిరోలికి చెందిన అరికె జైనీ అలియాస్ సృజన అనే యువతిని వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో ఆమె పెరిమిలి దళంలో సభ్యురాలు. మావోయిస్టు పార్టీలో పాలిట్‌బ్యూరో మెంబర్‌గా, సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఇన్‌చార్జ్‌గా పనిచేసిన దేవ్‌జీ, నంబాల కేశవరావు మృతి తర్వాత పార్టీ జనరల్ సెక్రటరీగా అత్యున్నత బాధ్యతలు చేపట్టారు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA) ఏర్పాటులో ఆయనది కీలక పాత్ర. వివిధ రాష్ట్రాల్లో ఆయనపై ఏకంగా రూ.1.50 కోట్ల రివార్డు ఉండటం ఆయన ప్రాధాన్యతను చాటిచెబుతోంది.

లొంగుబాటు వెనుక కారణాలు

గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న దేవ్‌జీ, దండకారణ్యాన్ని వదిలి జనజీవన స్రవంతిలోకి రావాలని నిర్ణయించుకున్నారు. ఆయనతో పాటు మల్లా రాజిరెడ్డి వంటి అగ్రనేతలు కూడా లొంగిపోయారు. "అనారోగ్యం కారణంగానే రహస్య జీవితాన్ని వదిలాను తప్ప, నేను నమ్మిన సిద్ధాంతాన్ని వీడలేదు" అని దేవ్‌జీ స్పష్టం చేయడం విశేషం. 2020లో ఎదురుకాల్పుల్లో తన భార్య సృజనను కోల్పోయిన ఆయన, ఇప్పుడు ప్రజా సమస్యలపై పోరాడేందుకు రాజకీయ వేదికను ఎంచుకున్నారు.

రాజకీయంలోకి..

దేవ్‌జీ రాకతో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ రాజకీయాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. దేవ్‌జీ తన రాజకీయ ప్రస్థానాన్ని సొంత నియోజకవర్గమైన కోరుట్ల లేదా జగిత్యాల నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. ఎస్సీ (మాదిగ) సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో, దళిత రాజకీయ సమీకరణాల్లో ఆయన కీలకం కానున్నారు. ఆయన ఏ పార్టీలో చేరుతారనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. లెఫ్ట్ పార్టీల మద్దతు పొందుతారా లేదా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతారా అనేది వేచి చూడాలి.

తుపాకీ పడితేనే విప్లవం వస్తుందని నమ్మిన ఒక సైనిక వ్యూహకర్త, ఇప్పుడు అసెంబ్లీ మెట్లు ఎక్కేందుకు సిద్ధమవ్వడం విప్లవ కేడర్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. కోటిన్నర రివార్డు ఉన్న నేత సామాన్యుడి ఓటు కోసం అభ్యర్థించే రోజులు దగ్గరపడ్డాయి. దేవ్‌జీ రాజకీయ ప్రయాణం తెలంగాణ గడ్డపై ఎలాంటి మార్పులు తెస్తుందో కాలమే నిర్ణయించాలి.

Advertisment
తాజా కథనాలు