BANDI BHAGEERATH  :  ప్రేమ నుంచి బ్రేకప్ వరకు.. బండి భగీరథ్ ను పోలీసులు అడుగుతున్న 10 ప్రధాన ప్రశ్నలివే!

తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టించిన POCSO కేసు నిందితుడు బండి భగీరథ్‌ను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. కూకట్‌పల్లి డీసీపీ నేతృత్వంలో విచారణ ప్రక్రియను ప్రారంభించారు. ఫోన్‌ కాల్ డేటా, వాట్సాప్ చాట్స్ ఆధారంగా నిందితుడిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు

New Update
FotoJet (19)

BANDI BHAGEERATH

BANDI BHAGEERATH : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో, అధికార, ప్రతిపక్ష వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన పొక్సో (POCSO) కేసు నిందితుడు బండి భగీరథ్‌ను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ హైప్రొఫైల్ కేసులో దాగి ఉన్న మరిన్ని నమ్మసక్యంకాని నిజాలను, ఆధారాలను రాబట్టేందుకు నిందితుడిని మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ మేడ్చల్ మల్కాజిగిరి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పేట్‌బషీరాబాద్‌ పోలీసులు ఈ రోజు ఉదయం చర్లపల్లి జైలుకు చేరుకుని, అక్కడ రిమాండ్ ఖైదీగా ఉన్న బండి భగీరథ్‌ను అధికారికంగా కస్టడీలోకి తీసుకున్నారు. అనంతరం ఆయనకు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించి, కూకట్‌పల్లి డీసీపీ నేతృత్వంలో విచారణ ప్రక్రియను ప్రారంభించారు.

కస్టడీ విచారణలో భాగంగా పోలీసులు అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా నిందితుడు బండి భగీరథ్‌ను పోలీసులు మొయినాబాద్‌లోని ప్రసిద్ధ 'అరణ్య ఫాంహౌస్‌'కు తరలించారు. నేరం జరిగినట్లుగా భావిస్తున్న సదరు ఫాంహౌస్‌లో సంఘటనా స్థలాన్ని పూర్తిస్థాయిలో పరిశీలిస్తూ 'సీన్ రీకన్‌స్ట్రక్షన్' చేశారు. బాధితురాలిని అక్కడికి ఎలా తీసుకెళ్లారు, అక్కడ ఏం జరిగిందనే అంశాలపై క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించారు. ఈ క్రమంలో కూకట్‌పల్లి డీసీపీ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక బండి భగీరథ్‌ తీవ్రంగా ఉక్కిరిబిక్కిరి అయినట్లు సమాచారం.

మరోవైపు ఈ కేసులో సాంకేతిక ఆధారాల సేకరణే అత్యంత కీలకంగా మారింది. అరెస్ట్ కావడానికి ముందే నిందితుడు తన మొబైల్ ఫోన్ లోని కీలక సమాచారాన్ని తొలగించడంతో, పోలీసులు సాంకేతిక నిపుణుల సహాయంతో భగీరథ్‌ ఫోన్‌ డేటాను పూర్తిస్థాయిలో రిట్రీవ్ (పునరుద్ధరణ) చేశారు. ఫోన్‌లోని కాల్ డేటా, వాట్సాప్ చాట్స్, సోషల్ మీడియా మెసేజ్‌ల ఆధారంగా పోలీసులు నిందితుడిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా, "నువ్వు ఏ తప్పూ చేయకపోతే కాల్స్, చాట్స్‌ ఎందుకు డిలీట్ చేశావ్‌? సోషల్ మీడియా అకౌంట్లను ఎందుకు డీయాక్టివేట్ చేశావ్?" అంటూ పోలీసులు గట్టిగా నిలదీసినట్లు తెలుస్తోంది.

పోలీసుల ప్రధాన విచారణ బాధితురాలితో ఉన్న పరిచయం, ప్రేమ, ఆపై జరిగిన దారుణాల చుట్టూనే సాగింది. "బాధితురాలితో పరిచయం ఎప్పుడు, ఎలా మొదలైంది? ఆమెను రెగ్యూలర్‌గా ఎక్కడ కలిసేవాడివి? అసలు మీ ఇద్దరి మధ్య బ్రేకప్‌ ఎందుకు అయ్యింది? సదరు అమ్మాయిని లొంగదీసుకుంటానని స్నేహితులతో బెట్టింగ్‌ పెట్టావన్నది నిజమేనా?" అనే కోణంలో ప్రశ్నలు సంధించారు. వీటితో పాటు అత్యంత తీవ్రమైన ఆరోపణలైన "బాధితురాలిపై ఇప్పటివరకు ఎన్నిసార్లు లైంగికదాడి చేశావ్‌? ఆమె ఇంటికి ఎన్నిసార్లు వెళ్లావ్? అమ్మాయి వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు నీ ఫోన్ నుంచే బయటికి వచ్చాయా?" అనే అంశాలపై పోలీసులు నిందితుడి నుంచి వివరాలు రాబడుతున్నారు.

ఇక అరణ్య ఫాంహౌస్ ప్లాన్, ఆర్థిక లావాదేవీలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మొయినాబాద్ ఫాంహౌస్‌కు వెళ్లాలనే ప్లాన్ ఎవరిది? కేవలం పార్టీ కోసమే అక్కడికి వెళ్లారా లేక అమ్మాయితో ఒంటరిగా ఉండటానికి ముందే ప్లాన్‌ చేశారా? మీతో పాటు ఆ రోజు పార్టీలో ఎవరెవరున్నారు? అనే విషయాలపై స్పష్టత తీసుకుంటున్నారు. అలాగే, బాధితురాలికి రూ. 50 వేలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఒకవేళ నిందితుడు వాదిస్తున్నట్లు అమ్మాయే బ్లాక్‌మెయిల్‌ చేస్తుంటే.. ఆ విషయాన్ని ముందే పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? అమ్మాయి తనపై కేసు పెడుతుందని తెలిసే ముందస్తు వ్యూహంతో ఆమెపై ఎదురు కేసు పెట్టావా? అని పోలీసులు ప్రశ్నించారు.

మే 16న అరెస్టయిన భగీరథ్, అంతకుముందు 9 రోజుల పాటు పోలీసుల కళ్లగప్పి పరారీలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, "అరెస్ట్‌కు 9 రోజుల ముందు వరకు ఎక్కడ దాక్కున్నావ్? ఆ 9 రోజులు నిన్ను దాచిపెట్టి ఆశ్రయం ఇచ్చింది ఎవరు? మే 16న పోలీసుల కళ్లుగప్పి ఎటు పారిపోవాలని చూశావ్‌?" అనే ప్రశ్నల ద్వారా అతనికి సహకరించిన వారిని కూడా ఈ కేసులోకి లాగేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మూడు రోజుల కస్టడీ ముగిసే సమయానికి ఈ పొక్సో కేసులో మరిన్ని కీలక ఆధారాలు లభ్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు