/rtv/media/media_files/2026/05/27/producers-and-exhibitors-2026-05-27-20-45-47.jpg)
producers and exhibitors'
Peddi movie :టాలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా చిత్ర నిర్మాతలు (Producers), థియేటర్ల యాజమాన్యాల (Exhibitors) మధ్య నడుస్తున్న పర్సంటేజీ వివాదానికి ఎట్టకేలకు శుభం కార్డు పడింది. చిత్ర పరిశ్రమలో మరోసారి పెద్దన్న పాత్ర పోషించిన మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగి, ఇరు వర్గాలకు నచ్చజెప్పడంతో ఈ వివాదం సద్దుమణిగింది. మెగాస్టార్ చొరవతో తెలంగాణ ఎగ్జిబిటర్లు తమ పట్టును వీడి వెనక్కి తగ్గారు.
వివాదానికి కారణం ఏంటి?
నిర్మాతలకు, థియేటర్ల యాజమాన్యాలకు మధ్య సినిమా వసూళ్ల షేరింగ్ (Percentage Sharing) విషయంలో గత కొన్ని రోజులుగా తీవ్రమైన విభేదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ ప్రతినిధులు ఒక కీలక నిర్ణయానికి వచ్చారు. జూన్ 30 తర్వాత విడుదలయ్యే అన్ని సినిమాలను కేవలం 'పర్సంటేజీ పద్ధతి'లోనే ప్రదర్శించాలని, పాత రెంటల్ విధానాన్ని పక్కన పెట్టాలని వారు భావించారు. ఇదే విషయాన్ని వివరిస్తూ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ ప్రతినిధులు తాజాగా మెగాస్టార్ చిరంజీవిని కలిశారు.
నిర్మాతలను, థియేటర్ల యాజమాన్యాలను సమన్వయం చేస్తూ మెగాస్టార్ చిరంజీవి వరుసగా రెండు రోజుల పాటు సుదీర్ఘ భేటీలు నిర్వహించారు. ఎగ్జిబిటర్లు చెప్పిన సమస్యలను ఓపిగ్గా విన్న చిరంజీవి, పరిశ్రమ హితాన్ని కోరి కీలక సలహా ఇచ్చారు. ప్రస్తుతం ఫిలిం చాంబర్ కమిటీ (Film Chamber Committee) ఇచ్చిన నివేదిక, అందులోని మార్గదర్శకాల ప్రకారమే నడుచుకోవాలని ఎగ్జిబిటర్స్ అసోసియేషన్‌కు స్పష్టం చేశారు. అలాగే జూన్ 30 లోపు ఈ పర్సంటేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని ఆయన హామీ ఇచ్చారు."పరిశ్రమ బాగుండాలంటే ఇరు వర్గాలు కలిసికట్టుగా వెళ్లాలి. ప్రస్తుతానికి ఫిలిం చాంబర్ కమిటీ గైడ్‌లైన్స్ పాటించడం అందరికీ శ్రేయస్కరం." అని మెగాస్టార్ చిరంజీవి స్పష్టం చేశారు.
చిరంజీవి ఇచ్చిన సలహాతో ఏకీభవించిన తెలంగాణ ఎగ్జిబిటర్లు తమ పట్టుదలను వీడి, నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఈ రాజీ ఫార్ములాతో టాలీవుడ్‌లో కొన్ని కీలక ఒప్పందాలు కుదిరాయి. తాజాగా విడుదల కాబోతున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ మూవీ ప్రదర్శనను యథావిధిగా పాత పద్ధతి అయిన రెంటల్ విధానంలోనే (Rental System) కొనసాగించేందుకు ఎగ్జిబిటర్లు అంగీకరించారు. భవిష్యత్తులో ఏదైనా పెద్ద సినిమాకు ప్రభుత్వం టికెట్ ధరలు పెంచితే.. ఆ పెంచిన మొత్తంలో 7.5% వాటాను ఎగ్జిబిటర్లకు అదనంగా చెల్లించేలా ఇరు వర్గాల మధ్య ఒప్పందం కుదిరింది.
చిరంజీవి మాటకు కట్టుబడి ఉంటాం:తెలంగాణ ఫిలిం చాంబర్
చిరంజీవితో భేటీ అనంతరం తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు."చిరంజీవి పెద్దన్నగా మా సమస్యలను విన్నారు, వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆయన మాటకు మేము కట్టుబడి ఉంటాము. పెద్ద సినిమాలకు టికెట్ రేటు పెంచినప్పుడు.. ఆ పెరిగిన మొత్తంలో రెంట్‌తో పాటు మాకు 7.5 శాతం వాటా ఇస్తామన్నారు. జూన్ 30 లోపు ఈ పర్సంటేజ్ వివాదానికి శాశ్వత పరిష్కారం చూపిస్తామని మాట ఇచ్చారు" అని శ్రీధర్ పేర్కొన్నారు.మెగాస్టార్ చిరంజీవి సమయస్ఫూర్తితో వ్యవహరించి, పరిశ్రమలో తలెత్తిన ఒక పెద్ద సంక్షోభాన్ని నివారించడం పట్ల అటు నిర్మాతలు, ఇటు ఎగ్జిబిటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనితో రాబోయే భారీ చిత్రాల విడుదలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా మార్గం సుగమమైంది.
Follow Us