Ashureddy : వారిద్దరి సమక్షంలో సెటిల్మెంట్‌ చేసుకుందాం.. సినీ నటి అషురెడ్డి ఆడియో వైరల్‌

సినీ నటి అషురెడ్డి అలియాస్ కె. వెంకట అశ్విని రెడ్డిపై నమోదైన చీటింగ్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. ఈ క్రమంలో ధర్మేంద్రకు అషురెడ్డి పంపినట్లు చెబుతున్న ఒక ఆడియో సందేశం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది.

New Update
FotoJet - 2026-04-29T072842.426

Ashureddy

Ashureddy : సినీ నటి అషురెడ్డి అలియాస్ కె. వెంకట అశ్విని రెడ్డిపై నమోదైన చీటింగ్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. ఎన్నారై ధర్మేంద్రను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, సుమారు రూ. 9.83 కోట్లు వసూలు చేశారనే ఆరోపణలపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో ధర్మేంద్రకు అషురెడ్డి పంపినట్లు చెబుతున్న ఒక ఆడియో సందేశం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. మే నెలలో కోటిన్నర రూపాయలు తిరిగి ఇచ్చేస్తానని, మిగిలిన డబ్బు తాను జీవితంలో స్థిరపడ్డాక చెల్లిస్తానని ఆమె ఆ ఆడియోలో ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఒకవేళ దీనికి అంగీకరించకపోతే సినీ నిర్మాత ప్రవీణ, వేణుస్వామి వంటి పెద్దమనుషుల సమక్షంలో సెటిల్మెంట్ చేసుకుందామని ఆమె సూచించినట్లు సమాచారం.

మరోవైపు, లండన్ నుంచి ధర్మేంద్ర ఒక ఆడియో సందేశాన్ని విడుదల చేస్తూ అషురెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. గత ఎనిమిదేళ్లలో తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి విడతల వారీగా రూ. 9.83 కోట్లు తీసుకున్నారని, తనతో బంగ్లాలు, కారు కొనిపించుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రెండుసార్లు వివాహ ముహూర్తాలు ఖరారు చేసినప్పటికీ ఆమెనే రద్దు చేసుకున్నారని, ఇప్పుడు తన డబ్బు తిరిగి అడిగితే ఆత్మహత్య చేసుకుంటానని, వేధింపుల కేసు పెడతానని బెదిరిస్తున్నారని ధర్మేంద్ర పేర్కొన్నారు. అషురెడ్డి కుటుంబ సభ్యులు కూడా తన వద్ద నుంచి భారీగా నగదు తీసుకున్నారని, బ్యాంకు రుణాలు తీసుకుని మరీ ఆమెకు డబ్బులు ఇచ్చానని ఆయన వాపోయారు. కోట్లలో వసూలు చేసి ఇప్పుడు కేవలం కోటిన్నరతో సెటిల్ చేస్తాననడం తనను మరోసారి వంచించడమేనని ఆయన మండిపడ్డారు.

ఈ పరిణామాల నేపథ్యంలో అషురెడ్డి న్యాయపోరాటానికి దిగారు. తనపై నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ ఆమె తన తల్లితో కలిసి హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు తన వాదన వినకుండా ఏకపక్షంగా కేసు నమోదు చేశారని, విచారణను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషన్‌లో కోరారు. అయితే, ఈ వ్యవహారంలో తన పేరు రావడంపై నిర్మాత ప్రవీణ స్పందిస్తూ, తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. బాధితుడు ధర్మేంద్ర తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని, అవసరమైతే అషురెడ్డికి నోటీసులు ఇచ్చి విచారిస్తామని డీసీపీ వెల్లడించారు. రాజకీయ, సినీ ప్రముఖుల పేర్లు చెప్పి ఆమె బాధితుడిని భయపెట్టారా అనే కోణంలోనూ పోలీసులు విచారణను వేగవంతం చేశారు.

Advertisment
తాజా కథనాలు