/rtv/media/media_files/2026/04/14/cm-revanth-reddy-2026-04-14-21-19-08.jpg)
జగిత్యాల జిల్లాకు చెందిన ముఖ్య నేతలతో ఏప్రిల్ 14న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన భేటీ ముగిసింది. ఈ సందర్భంగా పార్టీలో నెలకొన్న తాజా పరిస్థితులు, ముఖ్యంగా సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీని వీడటంపై సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్ అయ్యారు. 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం ఉన్న ఒక నాయకుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కార్యకర్తలను వంచించడమేనని ఆయన మండిపడ్డారు.
సమావేశంలో సీఎం మాట్లాడుతూ, "కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ జీవన్ రెడ్డిని తక్కువ చేసి చూడలేదు. ఆయన మర్యాదను, గౌరవాన్ని తగ్గించేలా మేము ఎప్పుడూ వ్యవహరించలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం పార్టీ శ్రేణులన్నీ శక్తివంచన లేకుండా కష్టపడ్డాయి. ఆయన అనుభవాన్ని గౌరవిస్తూనే ఉన్నాం" అని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ఇంటర్నల్ మీటింగుకి హాజరైన జగిత్యాల అటు ఇటు కాని ఎమ్మెల్యే సంజయ్ https://t.co/8THJ99Pw1dpic.twitter.com/Z1vNnk1w3b
— Telugu Scribe (@TeluguScribe) April 14, 2026
జీవన్ రెడ్డికి పార్టీ అన్ని విధాలా అండగా నిలిచిందని సీఎం గుర్తు చేశారు. "పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేయాలని సూచించినా, ఆయన నిజామాబాద్ కోరడంతో అక్కడి నుంచే టికెట్ ఇచ్చాం. దురదృష్టవశాత్తు ఆయన ఓడిపోయారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆయన సూచించిన వారికే టికెట్లు కేటాయించాం. భవిష్యత్తులో ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు రాజకీయ రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చినా.. మొండి పట్టుతో పార్టీని వీడారు" అని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
జీవన్ రెడ్డి నిర్ణయాన్ని తప్పుపడుతూ సీఎం ఘాటు వ్యాఖ్యలు చేశారు. "40 ఏళ్లు తన కోసం పనిచేసిన కార్యకర్తల ఆత్మగౌరవాన్ని జీవన్ రెడ్డి కేసీఆర్ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారు. దుర్మార్గుడైన కేసీఆర్ దగ్గర జీవన్ రెడ్డి లాంటి వ్యక్తి చేతులు కట్టుకుని నిలబడటం బాధాకరం. ఆయన వయసుకు, అనుభవానికి ఇది ఏమాత్రం తగదు." ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్రలు జరుగుతుంటే, దాన్ని కాపాడుకోవడం తప్పా? అని సీఎం ప్రశ్నించారు. "నేను చేస్తుంది తప్పో ఒప్పో మీరే ఆలోచించండి. వ్యక్తి కంటే పార్టీ ముఖ్యం అని నిరూపించిన జగిత్యాల కార్యకర్తలను నేను అభినందిస్తున్నాను. త్వరలోనే మిమ్మల్ని కలవడానికి జగిత్యాలకు వస్తా. అంతా కలిసికట్టుగా ఉండి జగిత్యాలను అభివృద్ధి చేసుకుందాం. ధైర్యంగా ఉండండి, మళ్లీ కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చుకుందాం" అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశం జగిత్యాల కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. జీవన్ రెడ్డి నిష్క్రమణ తర్వాత పార్టీని ఎలా బలోపేతం చేయాలనే అంశంపై సీఎం దిశానిర్దేశం చేశారు.
Follow Us