Hyderabad : డేంజర్ లో హైదరాబాద్‌.. పడిపోయిన ఎయిర్ క్వాలిటీ ?

హైదరాబాద్ కు డేంజర్ పొంచి ఉంది. త్వరలోనే హైదరాబాద్ ఢిల్లీగా మారనుందా అనే భయాన్ని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్లతో పోలిస్తే ఈ ఏడాది గాలి నాణ్యత తగ్గింది. ఈ ఏడాది 337 రోజుల్లో  110 రోజుల్లో గాలి నాణ్యత భారీగా పడిపోయింది.

New Update
FotoJet - 2025-12-06T085254.767

Hyderabad in danger.. Air quality has dropped

 Hyderabad : వాయు కాలుష్యంతో హైదరాబాద్ లో మరణాల సంఖ్య పెరగుతోందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఢిల్లీతో పోలిస్తే హైదరాబాద్ అంత మెరుగైన పరిస్థితుల్లో లేదని ఈ అధ్యయనాలు చెబుతున్నాయి. హైదరాబాద్ లో గాలి నాణ్యత పడిపోవడానికి వాహనాల కాలుష్యం, హైదరాబాద్ విస్తరణ,  పరిశ్రమల నుంచి వెలువడే పొగతో గాలి నాణ్యత పడిపోయిందని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చెబుతున్నారు. కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని నగరవాసులు డిమాండ్‌ చేస్తున్నారు. 

హైదరాబాద్ లో 203 రోజుల్లోనే నాణ్యమైన గాలి

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం వాయు నాణ్యత  సూచిక ( AQI) 0-50 మధ్య ఉంటే గాలి నాణ్యంగా ఉన్నట్టు. 51-100 మధ్య ఏక్యూఐ ఉంటే సంతృప్తికరం. ఇక 100 నుంచి 150 మధ్య ఉంటే  పిల్లలు, వృద్దుల్లో శ్వాసకోశ వ్యాధులు వస్తాయి.151 -200 మధ్య ఉంటే అందరికీ జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అయితే నాలుగేళ్లలో డిసెంబర్ నెలలో వాయు కాలుష్యాన్ని పరిశీలిస్తే ఈ ఏడాది రికార్డు స్థాయిలో గాలి నాణ్యత పడిపోయింది. ఈ ఏడాది 337 రోజుల్లో 203 రోజుల్లో మాత్రమే  గాలి నాణ్యత సాధారణ స్థాయిలో ఉంది.  మరో 23 రోజులు గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. 2022 నుంచి డిసెంబర్ నెల వాయు నాణ్యత సూచీ పరిశీలిస్తే ఈ ఏడాది వాయు నాణ్యత 185గా నమోదైంది. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో రికార్డు కాలేదు. డిసెంబర్ 3న హైదరాబాద్ ఫైనాన్షియల్ జిల్లాలో గాలి నాణ్యత 253గా నమోదైంది. అమీన్ పూర్ లో 201 రికార్డైంది. ఇక సోమాజీగూడ, బొల్లారం, పాశమైలారం, బంజారాహిల్స్, సనత్ నగర్, రామచంద్రాపురంలలో గాలి నాణ్యత 170 నుంచి 189 మధ్య రికార్డైంది. 

హైదరాబాద్ లో గాలి నాణ్యత తగ్గడానికి కారణం ఏంటి?

వాహనాల కాలుష్యం, భవనాల నిర్మాణాల ధూళి, పరిశ్రమల నుంచి వెదజల్లే కాలుష్యం, చెత్త కాల్చడం, కాలం చెల్లిన వాహనాలు వాడడం వంటి అంశాలు  హైదరాబాద్ లో గాలి నాణ్యత తగ్గిపోవడానికి కారణాలుగా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ వేగంగా విస్తరిస్తుంది. దీంతో భవనాల నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. ఇది కూడా గాలి నాణ్యత పడిపోవడానికి కారణంగా చెబుతున్నారు. భవన నిర్మాణ ప్రదేశాల్లో మట్టిని తవ్వడం, భవనాలు కూల్చడం, సిమెంట్, ఇసుక తరలించడంతో ధూళి కణాలు గాలిలో కలుస్తున్నాయి. దీంతో పాటు రోడ్లపై ఎక్కడిక్కకడే మట్టి పేరుకుపోయి ఉండడం పరిస్థితిని మరింత దిగజారుస్తోంది. భారీ పరిశ్రమల నుంచి విడుదలయ్యే ఉద్గారాలతో వాయు నాణ్యత పడిపోతోంది. మరో వైపు గత పదేళ్ల కాలంలో వాహనాల సంఖ్య కూడా పెరిగింది. దీనికితోడు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అటవీ శాతం లేదా పచ్చదనం తగ్గిపోతుంది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే పరిశ్రమల నుంచి విడుదలయ్యే కాలుష్య కారకాలు నేరుగా వాతావరణంలోకి చేరుతున్నాయి.

వాయు కాలుష్యంతో పెరుగుతున్న మరణాలు

వాయు కాలుష్యంతో హైదరాబాద్ లో మరణాల సంఖ్య పెరుగుతోందని డిల్లీలోని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ (సీఎస్ఈ) అధ్యయనం తెలిపింది. గాలిలో పీఎం 2.5 లాంటి సూక్ష్మధూళి కణాలు ప్రమాదకరంగా మారినందున జాగ్రత్తలు తీసుకోవాలని ఈ నివేదిక సూచించింది.  సూక్ష్మధూళికణాల ప్రభావంతో 2005-2018 మధ్యలో పీఎం 2.5 కారణంగా  లక్ష మందిలో 96 మంది చనిపోయారని అధ్యయనాలు చెబుతున్నాయి. 2005లో మొత్తం 9900 మరణాల నుంచి 2018లో 23,700 పెరిగిందని తెలిపింది. 2018 నుంచి ఇప్పటివరకు గణాంకాల్లో స్వల్ప మార్పులున్నప్పటికీ ముప్పు పొంచి ఉందని ఈ నివేదికలు చెబుతున్నాయి.
  

Advertisment
తాజా కథనాలు