Hyderabad: హైదరాబాద్‌ లో వర్ష బీభత్సం...ఏపీకి మరో వాయు''గండం''!

హైదరాబాద్‌ నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో నగరంలోని పలు ప్రాంతాల్లో వర్ష బీభత్సం సృష్టించింది. ఈ క్రమంలోనే ఏపీలో 23 నాటికి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశాలున్నట్లు ఐఎండీ అంచనా వేస్తోంది.

New Update
ap rains

Hyderabad Rains: హైదరాబాద్‌ నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. రాత్రి హయత్‌నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, చైతన్యపురి, కొత్తపేట, సరూర్‌నగర్‌, అంబర్‌పేట్‌,  జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సికింద్రాబాద్, బేగంపేట్, అబిడ్స్, ఉప్పల్, బోడుప్పల్, పీర్జాదిగూడ, అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, నాంపల్లి, కోఠి,  నాగోల్, రామంతపూర్‌, గోల్నాక, నారాయణగూడ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది.

భారీ వర్షంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. సిటీలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడినట్లు అధికారులు తెలిపారు. ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. మరో రెండు నుంచి మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఏపీలో మరోసారి..

ఇదిలా ఉంటే ఏపీలో మరోసారి భారీ వర్షాలు కురుస్తాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడన ప్రాంతం ఉండగా.. 23 నాటికి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశాలున్నట్లు  ఐఎండీ అంచనా వేస్తోంది. అల్పపీడనం బలపడి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్రల తీరానికి చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, ఇది రుతుపవనాలు ముగింపు సీజన్‌లో ఆఖరి అల్పపీడనంగా అధికారులు భావిస్తున్నారు. దీని ప్రభావంతో.. ఉత్తరాంధ్రలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి, రెండు చోట్ల కురిసే అవకాశాలు కనపడుతున్నాయి. 

ఈ సమయంలో 30-40 కిలోమీటర్ల వేగంతో ఉపరితల గాలులు వీస్తాయని అధికారులు ప్రకటించారు. ఇక, ప్రస్తుతం తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి వ్యాపించి ఉండగా.. 21వ తేదీన ఉత్తర అండమాన్ సముద్రం, పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని వివరించింది. ఇది వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని.. ఆవర్తనం ప్రభావంతో ఈ నెల 23 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.

 ఈ క్రమంలో 23వ తేదీ వరకు కోస్తా జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, కోనసీమ, అనకాపల్లి,  ఏలూరు, పశ్చిమ గోదావరి, కాకినాడ, ఎన్టీఆర్, శ్రీకాకుళం, విజయనగరం, జిల్లాలలో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.  అయితే.. ఇప్పటికే రాష్ట్రాన్ని భారీ వర్షాలు.. వరదలు అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. బుడమేరు సృష్టించిన బీభత్సంతో విజయవాడ అతలాకుతలం అయ్యింది. కాగా, మరోసారి వాతావరణశాఖ హెచ్చరికలు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు