Heavy Rain : హైదరాబాద్‌లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం...జలమయమైన రోడ్లు

హైదరాబాద్ నగరాన్ని వేధిస్తున్న ఎండ వేడిమి నుండి ఉపశమనం కలిగిస్తూ వరుణుడు నగరవాసులను పలకరించాడు. గత కొన్ని రోజులుగా భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు, ఒక్కసారిగా మారిన వాతావరణం భారీ ఊరటనిచ్చింది. భారీ వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది.

New Update
Hyderabad Heavy Rains

Hyderabad Heavy Rains

Heavy Rain :హైదరాబాద్ నగరాన్ని వేధిస్తున్న ఎండ వేడిమి నుండి ఉపశమనం కలిగిస్తూ వరుణుడు నగరవాసులను పలకరించాడు. గత కొన్ని రోజులుగా భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు, ఒక్కసారిగా మారిన వాతావరణం భారీ ఊరటనిచ్చింది. ఆదివారం సాయంత్రం నగరం అంతటా ఆకాశం మేఘావృతమై, ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయి వాతావరణం చల్లబడింది.

నగరంలోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, మూసాపేట్‌, జేఎన్టీయూ, నిజాంపేట్‌ జీడిమెట్ల పరిసరాల్లో పెద్ద ఎత్తున వడగళ్లు పడ్డాయి. అటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని న్యూ బోయిన్‌పల్లి, లోతుకుంట, తిరుమలగిరి, బొల్లారం వంటి ప్రాంతాల్లో కూడా వడగళ్ల వాన కురిసింది. ఆకస్మికంగా కురిసిన ఈ వర్షంతో వాహనదారులు, బాటసారులు కొంత ఇబ్బంది పడినప్పటికీ, వేడి నుండి ఉపశమనం లభించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

భారీ ఈదురుగాలుల కారణంగా నగరంలో పలుచోట్ల ఆస్తి నష్టం సంభవించింది. చింతల్‌ పరిధిలోని పద్మానగర్‌లో గాలి ధాటికి ఒక భారీ వృక్షం వేళ్లతో సహా నేలకూలింది. ఈ క్రమంలో చెట్టు పక్కనే ఉన్న రెండు విద్యుత్‌ స్తంభాలు విరిగిపడటంతో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అంతేకాకుండా, చెట్టు కింద పార్క్ చేసి ఉన్న పలు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రాణాపాయం కలగలేదు.

మున్ముందు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో, జీహెచ్‌ఎంసీ మరియు విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. విరిగిపడిన విద్యుత్ స్తంభాలను తొలగించి సరఫరాను పునరుద్ధరించే పనుల్లో సిబ్బంది నిమగ్నమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, బలహీనంగా ఉన్న చెట్ల కింద వాహనాలను నిలపవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా, ఈ అకాల వర్షం హైదరాబాద్ ప్రజలకు ఎండల నుండి గొప్ప ఊరటనిచ్చింది.

Advertisment
తాజా కథనాలు