Luggage racks : సిటీ బస్సుల్లో ప్రయాణించేవారికి అదిరిపోయే శుభవార్త.. ఇక నుంచి ఆ బాధ పోయినట్లే!

సాధారణంగా జిల్లాల్లో ఆర్టీసీ బస్సు ఎక్కగానే మన చేతిలో ఉన్న లగేజీని బస్సులో ఉన్న ర్యాక్ మీద పెడుతుంటాం. హైదరాబాద్‌ సిటీ బస్సుల్లో అలాంటి ర్యాకులు ఉండవు. సిటీ బస్సుల్లో కూడా సామగ్రి పెట్టుకునే అటకలు(ర్యాక్స్‌) ఏర్పాటు చేయాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.

New Update
FotoJet (14)

tgs rtc

 Luggage racks : సాధారణంగా జిల్లాల్లో ఆర్టీసీ బస్సు ఎక్కగానే మన చేతిలో ఉన్న లగేజీని బస్సులో ఉన్న ర్యాక్ మీద పెడుతుంటాం. దానివల్ల బస్సులో ప్రయాణీకులు నడవడానికి స్థలం ఉండటంతో పాటు ప్రయాణీకులు మోసే బరువు తగ్గుతుంది. అయితే హైదరాబాద్‌ సిటీ బస్సుల్లో అలాంటి ర్యాకులు ఉండవు. దీంతో ప్రయాణీకులు బ్యాగులు మోస్తూ నిలబడాల్సి ఉంటుంది. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు సిటీ బస్సుల్లో ప్రయాణీంచే సమయంలో తమ బ్యాగులు ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. గతంలో చాలా మంది ఈ విషయంలో ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఎవరూ పరిష్కారం చూపలేదు. సిటీ బస్సుల్లో ఉండే రద్దీ నేపథ్యంలో ఆర్టీసీ కూడా  దాని గురించి పట్టించుకోలేదు. అయితే ఈ సమస్యను తీవ్రంగా పరిగణించిన ఆర్టీసీ యజమాన్యం పరిష్కరించే దిశగా అడుగులు వేస్తుంది.  సిటీ బస్సుల్లో కూడా సామగ్రి పెట్టుకునే అటకలు(ర్యాక్స్‌) ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.

 ప్రయోగాత్మకంగా...

జిల్లా బస్సుల్లో లాగా సిటీ బస్సుల్లో ఎక్కువసేపు ప్రయాణించాల్సిన అవసరం ఉండదు. మన కాలనీ రాగానే దిగిపోతుంటాం. అందువల్ల సిటీ బస్సుల్లో ర్యాక్‌లు ఏర్పాటు అంతా అవసరం అనిపించలేదు. కానీ ప్రయాణించే సమయం తక్కువే అయినప్పటికీ, ఎక్కువ బరువుతో ప్రయాణించేవారు లగేజీ పెట్టుకోవడానికి స్థలం లేక దాన్ని మోస్తూ నిలబడాల్సి వస్తోంది. సిటీ బస్సుల్లో సాధారణం కంటే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో సీట్లు సరిపోక నిలబడాల్సి వస్తుంది. ఆ సమయంలో నిలబడే ప్రయాణికులు వారి బ్యాగులను కింద పెట్టే వీలు కూడా ఉండదు. దీంతో మోస్తూ నిలబడాలి.

అలాగే పాఠశాల విద్యార్థులు కూడా బస్సులో తమ పుస్తకాల బరువును మోస్తూ, రద్దీ మధ్యలో మెసలడం.. వారికి, తోటి ప్రయాణికులకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని సిటీ బస్సుల్లో ప్రయోగాత్మకంగా లగేజీ అటకలు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ నిర్ణయానికి వచ్చింది. తొలుత రెండు బస్సుల్లో వాటిని ఏర్పాటు చేసింది. బాగుండంటంతో ప్రయాణికుల అభిప్రాయాన్ని తెలుసుకోవాలన్న ఉద్దేశంతో తొలిదశలో 150 బస్సుల్లో అటకలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జిల్లా సర్వీసుల్లో ఉండేంత విశాలంగా కాకుండా, తక్కువ ఎత్తుతో ఉండేలా వాటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
 
కాగా, ఆర్టీసీకి బస్సు బాడీలు తయారు చేసే నిర్మాణ వ్యవస్థ ఉంది. మియాపూర్‌లో ఉన్న ఈ వర్క్‌షాపులో సొంతంగా సిబ్బందే బస్సు బాడీలను తయారు చేసే సామర్థ్యం ఉన్న వారు కావటంతో, బస్సులో ర్యాకులు ఏర్పాటు చేసే పనిని వారికే అప్పగించారు. ఇందుకు ఒక్కో బస్సుకు రూ.15 వేల ఖర్చు అవుతుందని తయారీ కార్మికులు తెలిపారు. ప్రస్తుతం 150  బస్సుల్లో అటకలు ఏర్పాటు చేసే పని కొనసాగుతోంది. మరికొద్ది రోజుల్లో ఆ బస్సులు అటకలతో రోడ్ల మీదకు రానున్నాయి. అవి ప్రయాణికులకు ఉపయుక్తంగా ఉన్నాయా, అంతగా వినియోగించుకునే పరిస్థితి ఉందా లేదా అన్నది గుర్తించి... మిగతా బస్సుల్లో వాటి ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటారు.  

 కాగా ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగిన తర్వాత హైదరాబాద్‌ సిటీ బస్సుల్లో మహిళా ప్రయాణికులు–పురుష ప్రయాణికులు కలిసిఉండే వీలు లేకుండా ప్రత్యేక పార్టీషన్‌ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇందుకోసం ఒక వరుస సీట్లను తొలగించి మధ్యలో ఇనుప జాలీ తరహాలో స్లైడింగ్‌ డోర్‌తో కూడిన విభజనను ఏర్పాటు చేశారు. దీనికోసం ఏకంగా రూ.4.5 కోట్లు ఖర్చు చేశారు. అప్పట్లో ఓ ఉన్నతాధికారి వీటి ఏర్పాటులో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే వాటివల్ల పెద్దగా ఉపయోగం లేదని తేలడంతో మళ్లీ వాటిని తీసేసి, వాటి కోసం తొలగించిన సీట్లను తిరిగి ఏర్పాటు చేయడం గమనార్హం. వాటితో పోలిస్తే, తాజా నిర్ణయం ఉపయోగకరమైంది, తక్కువ ఖర్చుతో కూడుకున్నది కావటంతో దీనికి సానుకూలత ఉంటుందని ఆర్టీసీ యజమాన్యం భావిస్తోంది.

Advertisment
తాజా కథనాలు