Kaleshwaram : కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ముందుకే...ఒత్తిడిపెంచేందుకు సిద్ధమైన ప్రభుత్వం

కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) విచారణ జరిపించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సిబిఐ విచారణకు ఒత్తిడి పెంచాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.

New Update
Kaleshwaram Project and CBI

Kaleshwaram Project and CBI

Kaleshwaram :   తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) విచారణ జరిపించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సిబిఐ విచారణకు ఒత్తిడి పెంచాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దీనిపై సిబిఐ డైరెక్టర్‌కు అధికారికంగా లేఖ రాయాలని సూచించారు. అవసరమైతే రాష్ట్ర మంత్రుల బృందం స్వయంగా ఢిల్లీకి వెళ్లి సిబిఐ డైరెక్టర్‌ను కలవాలని, వినతిపత్రం సమర్పించాలని నిర్ణయించారు. ఇటీవల జస్టిస్ పి.సి. ఘోష్ నివేదిక ఆధారంగా కేసీఆర్, హరీశ్‌రావులపై చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో, సీనియర్ న్యాయ నిపుణుడు అభిషేక్ సింఘ్వీతో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి తదుపరి కార్యాచరణను ఖరారు చేశారు.

కాళేశ్వరం అంశంపై ప్రస్తుతం కోర్టుల్లో ఎలాంటి స్టేలు లేవని, సిబిఐ విచారణ చేపట్టేందుకు చట్టపరమైన అడ్డంకులు ఏవీ లేవని న్యాయనిపుణులు ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిబిఐ విచారణకు తన సమ్మతిని తెలిపినందున, ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పు ఈ ప్రక్రియకు అడ్డుకాబోదని వారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గతంలో తాము ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖను సంప్రదించిన విషయాలను కూడా సీఎం ప్రస్తావించారు. సిబిఐ దర్యాప్తును వేగవంతం చేయాలని కోరుతూ, రాజకీయాలకు అతీతంగా ఈ విచారణ సాగాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది.

హైకోర్టు తీర్పును విశ్లేషించిన ముఖ్యమంత్రి, పి.సి. ఘోష్ కమిషన్ ఏర్పాటును గానీ, ఆ కమిషన్ నివేదికను గానీ కోర్టు ఎక్కడా తప్పుబట్టలేదని స్పష్టం చేశారు. కేవలం కేసీఆర్, హరీశ్‌రావులకు నోటీసులు జారీ చేసిన విధానంలో సహజ న్యాయసూత్రాల అమలును మాత్రమే కోర్టు ప్రస్తావించిందని, కమిషన్ ఏర్పాటు రాజ్యాంగబద్ధమేనని కోర్టు అంగీకరించిందని ఆయన వివరించారు. కమిషన్ నివేదిక చట్టవిరుద్ధమని పిటిషనర్లు చేసిన వాదనను కోర్టు తోసిపుచ్చినందున, ఆ నివేదిక యథాతథంగా కొనసాగుతుందని సీఎం వెల్లడించారు. విజిలెన్స్ నివేదికలు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నివేదికల ఆధారంగానే సిబిఐ విచారణ కోరుతున్నట్లు ఆయన తెలిపారు.

గతంలో సిబిఐ విచారణపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి గుర్తు చేస్తూ, కేసు అప్పగిస్తే 48 గంటల్లో విచారణ మొదలుపెడతామన్న మాటను ఇప్పుడు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఒకవేళ కేంద్రం లేదా సిబిఐ స్పందించని పక్షంలో, ప్రభుత్వం , కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యే కార్యాచరణను ప్రారంభిస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అదేవిధంగా, మేడిగడ్డ సందర్శనలో ఎన్డీఎస్ఏ చైర్మన్ పాల్గొనడంపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. కేంద్ర మంత్రుల అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే అధికారులపై తాము విమర్శలు చేయడం లేదని, మరి తమ పర్యటనల్లో అధికారులు పాల్గొంటే ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తుపై ప్రభుత్వం మంగళవారం మరో కీలక సమీక్షను నిర్వహించనుంది. పి.సి. ఘోష్ కమిషన్ నివేదికతో పాటు తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి వరకు లేదా సుందిళ్ల వరకు ఏ అలైన్‌మెంట్ అనుసరించాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు, రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టులకు భూసేకరణ, పునరావాస పనులు, నిధుల సమీకరణ వంటి అంశాలతో పాటు ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల పునఃప్రారంభంపై ఎన్జీఆర్ఐ నివేదికపై కూడా సీఎం నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ సమగ్ర సమీక్ష ద్వారా ప్రాజెక్టు పునర్నిర్మాణం,అక్రమాల విచారణ రెండింటినీ సమాంతరంగా ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.

Advertisment
తాజా కథనాలు