Revanth Reddy : ఉచిత విద్యుత్‌ ఇవ్వకుంటే ఎన్నికల్లో పోటీ చేయం..మీరూ సిద్దమా? బీఆర్‌ఎస్‌ కు రేవంత్‌ సవాల్‌

తెలంగాణలో 'రైతు డిస్కం' ఏర్పాటును వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్‌కు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. రాష్ట్రంలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టినా, రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వకున్నా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయబోదని తేల్చి చెప్పారు.

New Update
CM Revanth Reddy

CM Revanth Reddy

Revanth Reddy : తెలంగాణలో 'రైతు డిస్కం' ఏర్పాటు, ధాన్యం కొనుగోళ్లపై రాజకీయ వాతావరణం తీవ్రంగా వేడెక్కింది. ఈ అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం మీడియాతో నిర్వహించిన చిట్ చాట్‌లో ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలపై నిప్పులు చెరిగారు. రైతు డిస్కం ఏర్పాటును వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఒక బహిరంగ సవాల్ విసిరారు. రాష్ట్రంలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టినా, లేదా రైతులకు ఉచిత విద్యుత్ సరఫరాను నిలిపివేసినా వచ్చే ఎన్నికల్లో తమ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయబోదని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ తమ ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెట్టకుండా, ఉచిత విద్యుత్‌ను విజయవంతంగా కొనసాగిస్తే... వచ్చే ఎన్నికల పోటీ నుంచి బీఆర్ఎస్ తప్పుకుంటుందా? అని సవాల్ విసిరారు. రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్ రైతుల ముసుగులో పొలిటికల్ లైఫ్ లైన్ కోసం ఆరాటపడుతున్నారని ముఖ్యమంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

రైతులకు 24 గంటల పాటు నాణ్యమైన, నమ్మకమైన ఉచిత విద్యుత్ అందించాలనే సత్సంకల్పంతోనే దేశంలోనే మొట్టమొదటిసారిగా 'రైతు డిస్కం'ను ఏర్పాటు చేశామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న విద్యుత్ వినియోగాన్నంతటినీ ఈ రైతు డిస్కంకు అనుసంధానం (కనెక్ట్) చేస్తున్నట్లు వివరించారు. ఈ నూతన వ్యవస్థ వల్ల విద్యుత్ సరఫరాలో జవాబుదారీతనం పెరుగుతుందని, ప్రభుత్వానికి అవసరాన్ని బట్టి తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేసే వెసులుబాటు కలుగుతుందని తెలిపారు. రైతు డిస్కంపైన ప్రస్తుతం ఈఆర్‍సి (ERC) బహిరంగ విచారణ జరుపుతుంటే.. అందులో ఉద్యోగులు లేరంటూ కొందరు అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అసలు రైతు డిస్కం వద్దు అన్నవారికి, దాని గురించి విమర్శించే హక్కు ఎక్కడిదని ఆయన దుయ్యబట్టారు.

ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ ఆడుతున్న రాజకీయ నాటకాలను సీఎం తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో వడ్లు కొనుగోలు చేయనిది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనని ఆయన ఆరోపించారు. కేంద్రం కేవలం మద్దతు ధర (MSP) ప్రకటించి చేతులు దులుపుకుంటే, తమ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తోందని గుర్తుచేశారు. గత ప్రభుత్వ హయాంలో కొన్నదానికి, తాము కొంటున్న దానికి తేడాను గమనించాలని కోరారు. రాష్ట్రంలో పండే వరి, జొన్న, మొక్కజొన్న పంటలన్నింటినీ తమ ప్రభుత్వమే కొంటుందని, అలా సేకరించిన మొత్తాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోతే.. వడ్ల పేరిట బస్సు యాత్రలు చేసిన బీజేపీ నేతల ఇళ్లకు తాము ట్రాక్టర్లపై వచ్చి ధాన్యం పోస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో ఈ రోజు వరకు 62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, వర్షానికి తడిచిన ధాన్యానికి సైతం మద్దతు ధర కల్పించామని, త్వరలోనే సన్న వడ్లకు బోనస్ అందిస్తామని సీఎం పునరుద్ఘాటించారు.

జల వివాదాల పరిష్కారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీరును సీఎం రేవంత్ రెడ్డి తప్పుపట్టారు. అంతరాష్ట్ర జల వివాదాలను రాష్ట్రాలు సమన్వయంతో పరిష్కరించుకోవాలని ప్రధాని చెబుతున్నారని, కానీ తాము తుమ్మిడిహట్టి ప్రాజెక్టు అంశంపై మాట్లాడటానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోరినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణకు చెందిన 7 మండలాలను ఆర్డినెన్స్ ద్వారా బదలాయించిన మోడీ, తెలంగాణ ప్రయోజనాల కోసం మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు ఇప్పించలేరా? అని ప్రశ్నించారు. ఇదే క్రమంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. గత పాలకులు స్టోన్ క్రషర్ల నిర్వాహకుల వద్ద రూ.50 లక్షల చొప్పున వసూలు చేశారని, ఇదులకుంట చెరువు భూముల వ్యవహారంపై హరీశ్ రావు ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. అలాగే విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న గ్లోబరీనా సంస్థ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బినామీ సంస్థేనని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.

చివరగా, హైదరాబాద్‌లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై జరుగుతున్న వివాదంపైన, జీహెచ్ఎంసీ ఎన్నికలపైన సీఎం స్పందించారు. గతంలో ఖమ్మంలో పువ్వాడ అజయ్ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదా? అని ప్రశ్నించిన సీఎం.. కేసీఆర్ తన పాలనలో కమ్మ సంఘానికి 10 ఎకరాల భూమిని కేటాయించలేదా? అని నిలదీశారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి తెలంగాణ ముద్దుబిడ్డ సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టింది తానేనని గుర్తుచేశారు. ఎన్టీఆర్ లాంటి మహానుభావుడిని కులం, ప్రాంతం పరిధుల్లోకి లాగి రాజకీయం చేయడం బుద్ధిలేనితనమని హితవు పలికారు. మరి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు చెందిన మహానుభావుల విగ్రహాలు ఎందుకు పెట్టడం లేదని, అక్కడ పార్టీ పెట్టిన కేసీఆర్ ఎప్పుడైనా ప్రశ్నించారా అని నిలదీశారు. తాను సెంటిమెంట్లు, వివాదాలతో రాజకీయాలు చేయదలచుకోలేదని, తన పూర్తి దృష్టి కేవలం తెలంగాణ అభివృద్ధి పైనే ఉందన్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ (GHMC) ఎన్నికల నిర్వహణకు తమకు ఎలాంటి తొందర లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Advertisment
తాజా కథనాలు