Jeevan Reddy : మాజీ మంత్రి జీవన్ రెడ్డి కీలక నిర్ణయం.. రేపు కేటీఆర్‌‌తో భేటీ

తెలంగాణ రాజకీయ చరిత్రలో రేపు కీలక సమీకరణాలు చోటు చేసుకోనున్నాయి. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన మాజీమంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు టీ. జీవన్‌ రెడ్డితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తొలిసారి భేటీ కాబోతున్నారు.

New Update
FotoJet (5)

Jeevan Reddy' Key meeting with KTR tomorrow

Jeevan Reddy : తెలంగాణ రాజకీయ చరిత్రలో రేపు కీలక సమీకరణాలు చోటు చేసుకోనున్నాయి. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన మాజీమంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు టీ. జీవన్‌ రెడ్డితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తొలిసారి భేటీ కాబోతున్నారు. ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన తర్వాత తొలిసారి బీఆర్‌ఎస్‌ నేతలతో సమావేశం అవుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.  జీవన్‌ రెడ్డిని కేటీఆర్‌ స్వయంగా పార్టీలోకి ఆహ్వానిస్తారని తెలుస్తోంది.

కారు వైపే మొగ్గు

జగిత్యాల ఎమ్మెల్యేగా ఓటమి తర్వాత జగిత్యాల రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అక్కడ బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన సంజయ్‌కుమార్‌ కాంగ్రెస్‌లో చేరడంతో జీవన్‌రెడ్డికి  పొసగలేదు. ఆ తర్వాత వరుసగా ఏర్పడిన పరిణామాల నేపథ్యంలో జీవన్‌ రెడ్డి తీవ్ర మనస్థాపానికి గురయ్యారు.. చివరికి పార్టీకి రాజీనామా చేశారు. అయితే సీనియర్‌ నేతగా ఉండటం, ఆయనపై ఎలాంటి ఆరోపణలు లేకపోవడం, నిజాయితీ గల నాయకుడు అనే పేరుండటంతో ఆయనను బీఆర్‌ఎస్‌, బీజేపీలతో పాటు ఇతర పార్టీలు కూడా తమ పార్టీలోకి ఆహ్వానించినట్లు ప్రచారం సాగింది. అయితే రాష్ట్రంలో అధికార కాంగ్రెస్‌ పార్టీ తర్వాత బలంగా ఉండటంతో పాటు  రాష్ర్ట సమస్యలపై బలంగా పోరాడుతున్న పార్టీగా, భవిష్యత్తు్లో తిరిగి అధికారంలోకి వస్తుందనే ప్రచారం నేపథ్యంలో జీవన్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఆయన అనుచరులు కూడా అటే జై కొట్టడంతో కారు ఎక్కేందుకు సిద్ధమయ్యారు.

కాగా, గత వారం రోజులుగా విదేశాల్లో ఉన్న కేటీఆర్‌ ఈ రోజు ఉదయమే హైదరాబాద్‌ కు చేరుకోవడంతో ఆయన పార్టీ అధినేత కేసీఆర్‌ తో భేటీ అయ్యారు. అనంతరం ఆయన ఆదేశాల మేరకు జీవన్‌ రెడ్డితో ఫోన్‌ లో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా జీవన్‌ రెడ్డి పార్టీలోకి వస్తే ఆయనకు సముచిత స్థానం ఇస్తామని, ఆయన కోరుకున్న పార్టీ పదవీతో పాటు వచ్చే ఎన్నికల్లో ఆయనను గెలిపించుకునే బాధ్యతను కూడా తీసుకుంటామని చెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలో జీవన్‌ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించేందుకు  రేపు మధ్యాహ్నం కేటీఆర్ స్వయంగా జగిత్యాల వెళ్లడానికి సిద్ధమయ్యారు. కేటీఆర్‌ తో పాటు కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఆయన వెంట వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నేరుగా జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో  భేటీ అయిన తర్వాత అధికారికంగా బీఆర్ఎస్ పార్టీలోకి కేటీఆర్ ఆహ్వానించనున్నారు.

 కాగా, ఈ నెలలోనే జగిత్యాలలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం ద్వారా ఆయనను పార్టీలోకి ఆహ్వానించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో వైపు పార్టీ 21 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ర్ట జనరల్‌ భాడీ సమావేశం లేదా ప్లీనరీ నిర్వహించాలని బీఆర్‌ఎస్‌ నేతలు భావిస్తున్నారట. ఈ క్రమంలో అదే రోజు ఆయన పార్టీలో చేరుతారన్న ప్రచారం కూడా ఉంది.

Advertisment
తాజా కథనాలు