/rtv/media/media_files/2026/02/11/dgp-b-shivadhar-reddy-2026-02-11-14-35-45.jpeg)
మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవ్‌జీ మంగళవారం తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఆయనతో పాటు బడే చొక్కారావు, మల్లా రాజిరెడ్డి, నూనె నర్సింహారెడ్డి కూడా లొంగిపోయారు. ఈ మేరకు డీజీపీ శివధర్‌రెడ్డి విలేకరుల సమావేశంలో వివరాలను ప్రకటించారు. తెలంగాణకు చెందిన మరో 11 మంది ఇంకా అజ్ఞాతంలో ఉన్నారని, వారిలో కొందరు ఇప్పటికే పోలీసులతో చర్చలు జరుపుతున్నారని, త్వరలోనే వారు కూడా బయటకు వస్తారని డీజీపీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ 11 మంది ఏరియా కమిటీ కార్యదర్శులు, సభ్యూ లుగా ఉన్నారని తెలుస్తోంది. అలాగే మొత్తం ముగ్గురు కేంద్ర కమిటీ సభ్యుల్లో ఇద్దరు తెలంగాణకు చెందిన వారే ఉన్నారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. ‘‘గత రెండేళ్లలో నలుగురు సీసీఎంలు, 16మంది ఎస్‌ఈఎంలు, 26మంది డివిజన్ కమిటీ సభ్యులు, సెక్రటరీలు.. 85 మంది ఏసీఎస్‌లు, 60 మంది పార్టీ సభ్యులు సహా మొత్తం 591 మంది జన జీవన స్రవంతిలోకి వచ్చారు.
తెలంగాణలో పుట్టి, పెరిగిన 11 మంది ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు. వాళ్లలో కొంతమంది మాతో చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే వారు కూడా బయటకు వస్తారు. పోలీసుల అమరవీరుల సంస్మరణ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఎంతో మంది మావోయిస్టులు అజ్ఞాతాన్ని వీడి జన జీవన స్రవంతిలోకి వస్తున్నారు. అలా వచ్చిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రివార్డులు, పునరావాస ప్రయోజనాలు వెంటనే అందిస్తాం’’
మావోయిస్టుల లొంగుబాటులో కీలకంగా వ్యవహరించిన స్పెషల్ ఇంటెలిజెన్స్ ఐజీ సుమతి, ఆమె టీమ్‌నకు డీజీపీ అభినందనలు తెలిపారు. ఐడీజీ ఇంటెలిజెన్స్ విజయ్‌కుమార్‌ను కూడా అభినందిస్తున్నాని అన్నారు. ఈ సందర్భంగా దేవ్‌జీ, బడే చొక్కారావు, మల్లా రాజిరెడ్డి, నూనె నర్సింహారెడ్డిల స్వస్థలం, విద్యాభ్యాసం, మావోయిస్టులుగా వారి ప్రయాణాన్ని డీజీపీ వివరించారు. జన జీవన స్రవంతిలోకి వచ్చిన మావోయిస్టుల హక్కుల కాపాడేందుకు ప్రయత్నిస్తామని అవసరమైతే వారి ప్రాణాలకు తమ ప్రాణాలు అడ్డు వేస్తామని డీజీపీ పునరుద్ఘాటించారు.
Follow Us