/rtv/media/media_files/2026/04/10/cv-anand-2026-04-10-20-16-27.jpg)
Telangana new dgp c.v. anand
CV Anand : తెలంగాణకు త్వరలో కొత్త పోలీస్ బాస్ రానున్నారు. ప్రస్తుత డీజీపీ బి. శివధర్ రెడ్డి ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు, దీంతో ఆ స్థానంలో శాశ్వత ప్రాతిపదికన కొత్త అధికారిని నియమించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్ర తదుపరి పూర్తిస్థాయి డీజీపీగా1991వ బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి సి.వి. ఆనంద్ బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కాగా, కొత్త డీజీపీగా నియామకం కోసం తెలంగాణ ప్రభుత్వం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కు ఐదుగురు అధికారుల జాబితాను పంపినట్లు తెలిసింది. అందులో ముగ్గురు అధికారులతో కూడిన ప్యానెల్‌ను UPSC రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఆ జాబితాలో సి.వి. ఆనంద్‌తో పాటు కేంద్ర ఇంటలిజెన్స్ బ్యూరో (IB) స్పెషల్ డైరెక్టర్‌గా పని చేస్తున్న వినాయక ప్రభాకర్ ఆప్టే , తెలంగాణ జైళ్ల శాఖ డీజీగా పనిచేస్తున్న సౌమ్య మిశ్రాల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి పదవీ విరమణ తప్పనిసరి కావడంతో, సీనియారిటీ , రాష్ట్రంలో సుదీర్ఘ కాలం వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవం ఉన్న సి.వి. ఆనంద్ కే అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారని తెలుస్తోంది. గతంలోనూ రెండుసార్లు డీజీపీ పదవికి ఆయన పేరు పరిశీలించినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల ఆయనకు అవకాశం దక్కలేదు, కానీ ఈసారి సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం శాశ్వత ప్రాతిపదికన ఆయన నియమితులయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, ఆనంద్ పేరు దాదాపు ఫైనల్ అయినట్లు ప్రచారం సాగుతుండగా దానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఈ నెల 14 తర్వాత వెలువడే అవకాశాలున్నట్లు అధికారులు చెబుతున్నారు. సి.వి. ఆనంద్ డీజీపీగా బాధ్యతలు చేపడితే, ఆయన పదవీ కాలం 2028 మే వరకు ఉండనుంది. మరోవైపు, మహిళా అధికారులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని, హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఒక మహిళా డీజీ స్థాయి అధికారిని నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దానికోసం సౌమ్య మిశ్రా పేరును పరిశీలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక హైకోర్టు ఆదేశాల ప్రకారం ఏప్రిల్ 13 నాటికి కొత్త డీజీపీ నియామకంపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉండటంతో త్వరలోనే డీజీపీ నియామకాన్ని ప్రకటించే అవకాశం ఉంది.
Follow Us