CM Revanth Reddy : మీనాక్షిపై తెలంగాణలో ఎలాంటి కేసులు లేవు : సీఎం రేవంత్ రెడ్డి

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను తిరస్కరించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఇది పూర్తిగా బీజేపీ చేసిన కుట్ర అని ఆయన ఆరోపించారు.

New Update
cm revanth (1)

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను తిరస్కరించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఇది పూర్తిగా బీజేపీ చేసిన కుట్ర అని ఆయన ఆరోపించారు. గతంలో ఓట్ల దొంగతనం,   ఆ తర్వాత SIR కుంభకోణాలకు పాల్పడిన బీజేపీ.. ఇప్పుడు ఏకంగా సీట్ల దొంగతనానికి తెరలేపిందని ఆరోపించారు. తెలంగాణలో మీనాక్షి నటరాజన్‌పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవన్నారు సీఎం రేవంత్. అయినప్పటికీ, ఎన్నికల్లో గెలవలేకనే కుట్రపూరితంగా ఆమె నామినేషన్‌ను తిరస్కరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ అన్యాయంపై ఫిర్యాదు చేయడానికి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ నేతృత్వంలో కాంగ్రెస్ బృందం ఎన్నికల కమిషన్‌ను కలవడానికి వెళ్లగా, వారిని వెళ్లకుండా అడ్డుకున్నారని సీఎం చెప్పారు. ఈ చర్య ప్రజాస్వామ్యంపై జరిగిన దారుణమైన దాడి అని, ప్రజల గొంతుకలను అణచివేయడమేనని ఆయన దుయ్యబట్టారు. ఇది ప్రజాస్వామ్య చరిత్రలోనే ఒక చీకటి రోజు అని, దేశంలోని పౌరులందరూ ఈ చర్యను తీవ్రంగా ఖండించాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నామినేషన్ తిరస్కరణపై తాము ఊరుకునేది లేదని, ఖచ్చితంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. చట్టబద్ధంగా న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

సొంత పార్టీ నాయకుల హస్తమే

మరోవైపు మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురికావడం వెనుక సొంత పార్టీ నాయకుల హస్తమే ఉందంటూ మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి కైలాష్ విజయ్‌ వర్గీయ పెద్ద బాంబు పేల్చారు. ఆమెపై తెలంగాణలో ఉన్న కేసుల గురించిన సమాచారాన్ని కాంగ్రెస్ నాయకులే తమకు అందించారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీకి చెందిన వాళ్లే ఈ రహస్య సమాచారాన్ని, కాగితాలను తమకు చేరవేశారని, కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనమని ఆయన విమర్శించారు. చివరకు న్యాయమే గెలిచిందని, తమ అభ్యర్థి మహేష్ కేవత్‌కు విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి.

తన రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురికావడంపై కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ తీవ్రంగా స్పందించారు. "నా నామినేషన్‌ను అన్యాయంగా తిరస్కరించిన ఈ ఉదంతంతో బీజేపీ నడుపుతున్న రాజనీతి ఏంటో దేశ ప్రజలందరికీ పూర్తిగా అర్థమైంది. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, ప్రతిపక్షాలను పూర్తిగా తుడిచేసి, కేవలం ఏక పార్టీ వ్యవస్థను తీసుకురావడానికి బీజేపీ కుట్రలు చేస్తోంది" అని ఆమె ఆరోపించారు. ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా గెలవలేక, ఇలాంటి అడ్డదారుల్లో ప్రతిపక్ష అభ్యర్థులను తప్పించాలని చూడటం దేశ పౌరుల హక్కులను కాలరాయడమేనని ఆమె విమర్శించారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాము వెనకడుగు వేసేది లేదని, న్యాయం కోసం తమ పోరాటం కొనసాగుతుందని మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు.

Advertisment
తాజా కథనాలు