/rtv/media/media_files/2026/06/06/cm-revanth-2026-06-06-19-50-04.jpg)
మారుతున్న కాలానికి అనుగుణంగా యువత కొత్త దారులను వెతుక్కోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. AI వల్ల వైట్ కాలర్ ఉద్యోగాలు పోతున్నాయని అంతా టెన్షన్ పడుతున్నారు. కానీ, వీటికి ప్రత్యామ్నాయం బ్లూ కాలర్ ఉద్యోగాలేనని చెప్పారు. యువత వీటిపై ఫోకస్ పెట్టి, కొత్త స్కిల్స్ నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం తెలంగాణలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తెచ్చామన్నారు. పాత పద్ధతుల్లో ఉన్న ఐటీఐలను అత్యాధునిక టెక్నాలజీ సెంటర్లు మార్చామని వివరించారు. తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా మార్చడమే లక్ష్యంగా తెలంగాణ రైజింగ్-2047 రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసినట్లు తెలిపారు.
నిరుద్యోగుల కష్టాలను తీర్చడమే తమ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని సీఎం చెప్పారు. గతంలో టీజీపీఎస్‌సీ రాజకీయ పునరావాస కేంద్రంగా ఉండేదని, తాము అధికారంలోకి రాగానే ఆ పరిస్థితిని మార్చామన్నారు. "నేను స్వయంగా ఢిల్లీ వెళ్లి యూపీఎస్సీ చైర్మన్‌ను కలిసి, ఎలాంటి వివాదాలు లేకుండా ఉద్యోగాలు ఎలా భర్తీ చేయాలో తెలుసుకున్నాను. ఆ పద్ధతినే ఇక్కడ అమలు చేసి కేవలం 15 నెలల్లోనే 67,760 ఉద్యోగాలను భర్తీ చేశాం. దేశంలోనే ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగాలిచ్చిన రాష్ట్రం మాదే. త్వరలోనే మరో 5 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా ఇస్తాం" అని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
రైతుల ఆత్మహత్యలకు అప్పులే ముఖ్య కారణమన్న సీఎం.. తాము అధికారంలోకి రాగానే 25,035 రైతు కుటుంబాలకు చెందిన రూ. 20,616 కోట్ల రుణాలను మాఫీ చేశామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం 2024-25 సంవత్సరంలో తెలంగాణలో ఒక్క రైతు ఆత్మహత్య కూడా జరగలేదని గర్వంగా చెప్పారు. రైతులకు కనీస మద్దతు ధరతో పాటు ధాన్యానికి క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇస్తున్నామని, రైతు భరోసా కింద ఎకరాకు రూ. 12,000 పెట్టుబడి సాయం అందిస్తున్నామని తెలిపారు. ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం చేతులు దులుపుకుంటోందని, కానీ తాము మాత్రం మొక్కజొన్నతో పాటు ఇతర పంటలను కూడా కొనుగోలు చేస్తున్నామని వివరించారు.
విప్లవాత్మక మార్పులు తెచ్చాం
మహిళా సాధికారత కోసం తెలంగాణలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని సీఎం అన్నారు. రాష్ట్రంలోని 67 లక్షల మంది పొదుపు సంఘాల మహిళలకు సున్నా వడ్డీకే రూ. 60 వేల కోట్ల రుణాలు ఇచ్చామని, ఆ వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తోందని చెప్పారు. మహిళా సంఘాలు సొంతంగా 1000 బస్సులు కొనుగోలు చేశాయని, వారికి పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లు, ప్రభుత్వ ఆఫీసుల్లో క్యాంటీన్లు నడిపే బాధ్యతలను అప్పగించామని తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లలో వసతుల కల్పన బాధ్యత కూడా వారికే ఇవ్వడంతో మహిళలు ఎంతో సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు.
విషయాలు నేర్చుకోవడానికి తనకు ఎలాంటి మొహమాటం లేదన్న సీఎం.. ప్రాజెక్టుల దగ్గర అసిస్టెంట్ ఇంజనీర్ అడిగినా నేర్చుకుంటానని, ఇప్పటికే హార్వర్డ్‌లో 10 రోజులు కోర్సు చేశానని, త్వరలోనే చైనా వెళ్లి అక్కడి బెస్ట్ పద్ధతులను పరిశీలిస్తానని చెప్పారు.
Follow Us