TG News: రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు రేవంత్ సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే జనవరిలో షెడ్యూల్ విడుదల చేసి.. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలన్నది ప్రభుత్వ ప్లాన్ గా తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో సమగ్ర కుటుంబ, రాజకీయ, ఆర్థిక సర్వే కొనసాగుతోంది. ఈ సర్వే పూర్తయిన తర్వాత బీసీ రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేయనుంది. అయితే గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకువచ్చిన 2018 పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం.. రెండు టర్మ్‌ల వరకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను మార్చడం కుదరదు. ఇప్పుడు ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను పెంచాలంటే ఆ చట్టానికి సవరణలు చేయాల్సి ఉంటుంది. కేవలం ఇదొక్కటే కాకుండా గత పంచాయతీ రాజ్ చట్టానికి అనేక మార్పులను చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. పాత పంచాయతీ రాజ్ చట్టానికి ప్రభుత్వం సవరణలు తీసుకురావాలని నిర్ణయించింది.
ఉప సర్పంచ్ల చెక్ పవర్ రద్దు..
గతంలో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి జాయింట్ చెక్ పవర్ ఉండేది. అయితే.. 2018లో బీఆర్ఎస్ సర్కార్ తీసుకువచ్చిన పంచాయతీ రాజ్ చట్టంలో ఆ విధానాన్ని రద్దు చేశారు. సెక్రటరీ స్థానంలో ఉప సర్పంచ్‌కు జాయింట్ చెక్ పవర్ ఇచ్చారు. అయితే.. ఇలా చేయడం ద్వారా అనేక గ్రామాల్లో సర్పంచ్, ఉప సర్పంచ్ మధ్య విభేదాలు తలెత్తుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ ప్రభావం పల్లెల అభివృద్ధిపై పడిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ సర్పంచ్, సెక్రటరీకి జాయింట్ చెక్ పవర్ ఉండేలా చట్టంలో సవరణలు చేయనున్నారు. అయితే, సర్పంచ్, ఉప సర్పంచులకు చెక్ పవర్ కంటిన్యూ చేయాలని కొందరు.. గతంలో మాదిరిగా సర్పంచ్, సెక్రటరీకే జాయింట్ చెక్‌పవర్ ఉండాలని మరికొందరు.. ఇలా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై గ్రామాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
రిజర్వేషన్లలో మార్పులు..
ప్రతీ రెండు టర్మ్ లకు ఒక సారి రిజర్వేషన్లు మార్చేలా గత బీఆర్ఎస్ సర్కార్ పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు చేసింది. గతంలో సింగిల్ టర్మ్ రిజర్వేషన్ ఉండేది. రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు కొనసాగుతూ వచ్చాయి. ప్రతీ టర్మ్‌కు ఓ సారి రిజర్వేషన్ మారడం ద్వారా ఎన్నికైన వారు సరిగా పని చేయలేకపోతున్నారని అప్పట్లో ప్రభుత్వం చెప్పింది. తమకు మళ్లీ అవకాశం ఉండదని ఎన్నికైన వారు అభివృద్ధిపై శ్రద్ధ పెట్టడం లేదని తెలిపింది. కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వ 2018లో పంచాయతీ రాజ్ చట్టాన్ని సవరించి రెండు టర్మ్‌ల రిజర్వేషన్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అయితే.. ప్రతీ ఏటా రిజర్వేషన్లు మారేలా సవరణలు తీసుకురావాలని రేవంత్ సర్కార్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పంచాయతీల్లో రెండు టర్మ్‌ల రిజర్వేషన్ విధానం కొనసాగుతున్నది. గతంలో సింగిల్ టర్మ్ రిజర్వేషన్ ఉండేది. రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు కొనసాగుతూ వచ్చాయి. కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వ 2018లో పంచాయతీ రాజ్ చట్టాన్ని సవరించి రెండు టర్మ్‌ల రిజర్వేషన్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో పదేండ్ల వరకు పంచాయతీలలో అదే రిజర్వేషన్ కొనసాగనున్నది. ఈ విధానాన్ని మార్చి మళ్లీ పాత పద్ధతిలో సింగిల్ టర్మ్ రిజర్వేషన్ అమలు చేసేలా అసెంబ్లీలో చట్టం చేయనున్నట్టు తెలిసింది.
కలెక్టర్లకు పవర్ కట్..
సర్పంచ్ లను సస్పెన్షన్ చేసే అధికారాన్ని గత పంచాయతీ రాజ్ చట్టం కలెక్టర్లకు కల్పించింది. అయితే.. ప్రజలతో ఎన్నికైన వారిని కలెక్టర్లు తొలగించడం ఏంటన్న విమర్శలు ఉన్నాయి. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నుకున్న సర్పంచ్‌పై కలెక్టర్ వేటు వేయడమేమిటని, ఈ నిబంధన తొలగించాలని ప్రజాప్రతినిధులు గత ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చినా పట్టించుకోలేదు. దీంతో సర్పంచ్‌పై కలెక్టర్లు వేటు వేసే అధికారాన్ని తొలగించాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తున్నట్టు కూడా చర్చ జరుగుతోంది. అలాగే, సమగ్ర కుటుంబ, రాజకీయ, ఆర్థిక సర్వే పూర్తయిన వెంటనే బీసీ జనాభా లెక్కించి రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. అదే సమయంలో పంచాయతీ రాజ్ చట్టంలో సవరణలు చేసేలా ప్రణాళిక రూపొందించినట్టు తెలిసింది. ఈ క్రమంలో ఈ నెలలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లోనే పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించే అవకాశం ఉన్నట్టు సమాచారం.
ఎంత మంది పిల్లులున్నా పోటికి అర్హత..
ప్రస్తుతం ఉన్న చట్టంలో పంచాయతీ ఎన్నికల్లో ఇద్దరి కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉంటే పోటీ చేసే అవకాశం లేదు. ఇద్దరు కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులని పంచాయతీ రాజ్ చట్టం 2018లోని సెక్షన్ 213 చెబుతోంది. కానీ, మున్సిపాలిటీ చట్టం ప్రకారం కౌన్సిలర్, చైర్మన్, కార్పొరేటర్, మేయర్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులకు ఎంతమంది పిల్లలున్నా పోటీకి అవకాశముంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల్లోనే పంచాయతీలకు ఒక రకంగా, మున్సిపాలిటీలకు మరో రకంగా చట్టాలుండడంపై విమర్శలు వస్తున్నాయి. మున్సిపాలిటీలకు లేని నిబంధన పంచాయతీలకు ఎందుకని పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడితెస్తున్నారు. దీంతో ఎంత మంది పిల్లలున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని, ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేయాలనే డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చారు. దీంతో రేవంత్ రెడ్డి సర్కార్ ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేయాలని ఇప్పటికే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఎంత మంది పిల్లలు ఉన్నా పోటీ చేసే అవకాశాన్ని కల్పించేలా పంచాయతీ రాజ్ చట్టంలో సవరణలు తీసుకురానుంది రేవంత్ సర్కార్.