/rtv/media/media_files/2026/05/12/jail-museum-2026-05-12-13-28-29.jpg)
Jail Museum
Jail Museum : తెలంగాణ జైళ్ల శాఖ చరిత్రలోనే సరికొత్త అధ్యాయం లిఖిస్తూ చంచల్‌గూడ జైలు ప్రాంగణం వేదికగా అత్యంత వినూత్నమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. సాధారణంగా కటకటాల వెనుక జీవితం ఎలా ఉంటుందో చూడాలంటే ఏదో ఒక నేరం చేయాలి, పోలీసులు సంకెళ్లు వేయాలి, న్యాయస్థానం శిక్ష ఖరారు చేయాలి. కానీ, ఇప్పుడు ఆ సంకెళ్ల భయం, కేసుల ఒత్తిడి ఏమీ లేకుండానే జైలు గేట్లు సామాన్యుల కోసం సగర్వంగా తెరుచుకోనున్నాయి. ‘స్వేచ్ఛ’ విలువను ప్రతి ఒక్కరికీ అర్థం చేయించడమే పరమావధిగా చంచల్‌గూడలోని సిబ్బంది శిక్షణ కేంద్రం (SICA) నందు ఏర్పాటు చేసిన ‘జైలు మ్యూజియం’, ‘ఫీల్ ద జైల్’ (ఒక రోజు జైలు అనుభవం) ప్రత్యేక బ్లాక్‌లను తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా మంగళవారం ఉదయం వైభవంగా ప్రారంభించారు.
/filters:format(webp)/rtv/media/media_files/2026/05/12/jail-museum-2026-05-12-13-28-50.jpg)
గతంలో నిజాం నవాబుల కాలం నాటి కఠినమైన శిక్షా పద్ధతుల నుంచి నేటి ఆధునిక జైళ్ల సంస్కరణల వరకు సమగ్ర చరిత్రను కళ్లకు కట్టేలా ఈ జైలు మ్యూజియంను అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. దేశంలోనే ఐదోదిగా, తెలంగాణలోనే మొదటిసారిగా నగర నడిబొడ్డున అందుబాటులోకి వచ్చిన ఈ మ్యూజియంలో.. గతంలో ఖైదీలను బంధించడానికి వాడిన భారీ ఇనుప సంకెళ్లు, నూలు వడికే పాతకాలపు వస్తువులు, నిజాం రాజులు లండన్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన కంచుగంట, అప్పటి వాల్‌క్లాక్‌లు, రేడియోలను ప్రదర్శనకు ఉంచారు. వీటితో పాటు స్వాతంత్ర్యోద్యమ చరిత్ర, ఖైదీల జీవనశైలిని ప్రతిబింబించే అద్భుతమైన పెయింటింగ్స్, విగ్రహాలు పర్యాటకులను ఆనాటి కాలంలోకి తీసుకెళ్తాయి. కోర్టు విచారణలు, ములాఖత్‌ల అనుభవాన్ని అందించే ఆడియో విజువల్స్ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
/filters:format(webp)/rtv/media/media_files/2026/05/12/jail-museum-2026-05-12-13-29-06.jpg)
‘నేను జైలు చూశాను’ అని గర్వంగా చెప్పుకోవాలనుకునే పర్యాటకుల కోసం, జైలు జీవితంపై ఆసక్తి ఉన్నవారి కోసం ‘ఫీల్ ద జైల్’ కాన్సెప్ట్ ఒక సరికొత్త లోకాన్ని పరిచయం చేయనుంది. కేవలం రూ. 500 టికెట్ ధర చెల్లించి, 24 గంటల పాటు అచ్చం ఖైదీలాగే గడిపే సువర్ణావకాశాన్ని అధికారులు కల్పించారు. అయితే, జైలు లోపలికి అడుగుపెట్టగానే బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. మొబైల్ ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇతర సాంకేతిక పరికరాలను లోపలికి అనుమతించరు. సందర్శకులు తమ సొంత దుస్తులను విడిచిపెట్టి, ఖైదీలకు కేటాయించే అధికారిక దుస్తులనే ధరించాల్సి ఉంటుంది.
/filters:format(webp)/rtv/media/media_files/2026/05/12/jail-museum-2026-05-12-13-29-43.jpg)
ఈ 24 గంటల వినూత్న జీవితంలో నిబంధనలు అత్యంత కఠినంగా ఉంటాయి. ఖైదీల మాదిరిగానే నేలపై చాప పరుచుకుని పడుకోవాలి, ఎవరి లాకప్‌ను వారే స్వయంగా శుభ్రం చేసుకోవాలి. జైలు నిబంధనల ప్రకారం ఖైదీలకు ఏ ఆహారం అందిస్తారో, అదే మెనూతో కూడిన భోజనాన్ని వీరికి వడ్డిస్తారు. కేవలం కూర్చోవడం మాత్రమే కాదు.. తోటపని, క్లీనింగ్ వంటి శ్రమదాన పనులను కూడా చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ కఠిన వాతావరణాన్ని తట్టుకోలేక, 24 గంటలు ముగియకముందే ‘బాబోయ్ నేను వచ్చేస్తా!’ అంటూ మధ్యలోనే బయటకు వచ్చేయాలనుకుంటే మాత్రం రూ. 1,000 జరిమానా (పెనాల్టీ) చెల్లించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
#Hyderabad:
— NewsMeter (@NewsMeter_In) May 12, 2026
“#FeeltheJail” and the #JailMuseum were inaugurated at the #ChanchalgudaCentralJail by @tg_governor Shiv Pratap Shukla.
The event was attended by Prison Department DG Soumya Mishra, IPS and other senior officials.
The initiative aims to offer #visitors a glimpse… pic.twitter.com/8XTQgOpwJm
ప్రస్తుతానికి ఈ ‘ఫీల్ ద జైల్’ అనుభవం కోసం ఆన్‌లైన్ బుకింగ్ సదుపాయం లేదు. ఈ సరికొత్త అనుభూతిని పొందాలనుకునే వారు ఒక రోజు ముందుగానే నేరుగా చంచల్‌గూడలోని కేంద్రానికి వెళ్లి తమ పేరును రిజర్వు చేసుకోవాలి. బుకింగ్ సమయంలో ఓటర్ ఐడీ లేదా ప్రభుత్వం జారీ చేసిన ఇతర ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. సందర్శకుల సందేహాల నివృత్తి కోసం జైళ్ల శాఖ అధికారులు 040-24527846, 040-24528877 ప్రత్యేక ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచారు. గతంలో 2016లో సంగారెడ్డి జైలులో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ విధానం కరోనా వల్ల మూతబడగా, ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ప్రారంభం కావడం వల్ల పర్యాటకుల నుంచి భారీ స్పందన వస్తుందని ఆశిస్తున్నారు.
సమాజంలో నేర రహిత వాతావరణాన్ని నిర్మించడంలో ఈ వినూత్న ప్రయోగం కీలక పాత్ర పోషిస్తుందని జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రా ఆశాభావం వ్యక్తం చేశారు. యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా, నేరాల బాట పట్టకుండా ఉండాలన్నా.. స్వేచ్ఛ యొక్క నిజమైన విలువ ఏంటో తెలియాలన్నా ఈ జైలు అనుభవం ఒక గుణపాఠంగా మారుతుందన్నారు. ఓపెన్ జైలు విధానం, జైళ్లలో మారుతున్న సంస్కరణలను అభినందించిన గవర్నర్ శివప్రతాప్ శుక్లా.. ఖైదీలను కేవలం బంధించడమే కాకుండా, వారిలో మానసిక పరివర్తన తీసుకువచ్చి ఆహ్లాదకర వాతావరణంలో సమాజంలోకి పునరాగమనం చేసేలా ప్రోత్సహించాలని అధికారులకు పిలుపునిచ్చారు.
Follow Us