UP highway: హైవేపై నోట్ల వర్షం : గాల్లో ఎగిరిన డబ్బు.. చెల్లాచెదురుగా రూ. 4 లక్షలు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షామ్లీలోని ఒక హైవే రహదారి అకస్మాత్తుగా నోట్ల వర్షం కురిసినట్లుగా మారిపోయింది. రోడ్డుపై కరెన్సీ కట్టలు చెల్లాచెదురుగా పడి ఉండటం చూసి బాటసారులు షాక్‌కు గురయ్యారు.

New Update
up high way

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షామ్లీలోని ఒక హైవే రహదారి అకస్మాత్తుగా నోట్ల వర్షం కురిసినట్లుగా మారిపోయింది. రోడ్డుపై కరెన్సీ కట్టలు చెల్లాచెదురుగా పడి ఉండటం చూసి బాటసారులు షాక్‌కు గురయ్యారు. మీరట్-కర్నాల్ హైవే సమీపంలో ఈ వింత సంఘటన చోటుచేసుకుంది. రహదారిపై సుమారు 500 మీటర్ల మేర రూ. 500 మరియు రూ. 200 నోట్లు పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఒక వంతెన సమీపంలో నోట్లు విస్తృతంగా పడి ఉండటంతో ఆ ప్రాంతంలో కొంత గందరగోళం నెలకొంది. అయితే, కొంతమంది స్థానికులు అత్యుత్సాహం ప్రదర్శించకుండా, నిజాయితీగా అధికారులకు ఫిర్యాదు చేయడం విశేషం. పోలీసులు రోడ్డుపై ఉన్న నోట్లను జాగ్రత్తగా సేకరించి పోలీస్ స్టేషన్‌కు తరలించి లెక్కించగా, మొత్తం రూ. 4 లక్షల నగదు ఉన్నట్లు తేలింది. రికవరీ చేసిన కొన్ని నోట్ల కట్టలకు బ్యాంక్ స్లిప్పులు కూడా అంటించి ఉన్నాయి. దీనిని బట్టి చూస్తే, ఎవరో బ్యాంకు నుండి నగదు డ్రా చేసుకుని వెళ్తుండగా, కదులుతున్న వాహనం నుండి పొరపాటున ఆ డబ్బు కింద పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ

ప్రస్తుతం ఆ నగదును పోలీస్ మాల్‌ఖానాలో భద్రపరిచారు. ఈ డబ్బు ఎవరిదనే విషయాన్ని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ, ఆ సమయంలో అక్కడ ప్రయాణించిన వాహనాలను గుర్తిస్తున్నారు. ఇప్పటివరకు ఈ నగదుకు సంబంధించి ఎవరూ తమ వద్దకు రాలేదని అదనపు ఎస్పీ సుమిత్ శుక్లా తెలిపారు. నగదు మూలాలను కనుగొనేందుకు బ్యాంకులను కూడా సంప్రదిస్తున్నామని, తగిన ఆధారాలతో ఎవరైనా తమ నగదును క్లెయిమ్ చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. దర్యాప్తు కొనసాగుతోంది.

Advertisment
తాజా కథనాలు