KCR : బీఆర్ఎస్ ప్రక్షాళన...పాత కమిటీల రద్దు, సభ్యత్వ నమోదుపై కేసీఆర్ కీలక నిర్ణయం

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల ముగింపు సందర్భంగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీలోని పాత కార్యవర్గాలన్నింటినీ రద్దు చేశారు. కేవలం రాష్ట్ర కమిటీని మాత్రమే కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు.

New Update
FotoJet - 2026-04-27T191203.331

KCR Meeting With BRS Leaders

KCR : హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) రజతోత్సవ సంబరాల ముగింపు వేడుకల సందర్భంగా ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేసి, రాబోయే ఎన్నికలే లక్ష్యంగా సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టారు. పార్టీలోని పాత కార్యవర్గాలన్నింటినీ కేసీఆర్ రద్దు చేశారు. కేవలం రాష్ట్ర కమిటీని మాత్రమే కొనసాగిస్తూ మిగిలిన అన్ని కమిటీలు, అనుబంధ సంఘాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రతి జిల్లాకు ఒక రాష్ట్ర స్థాయి నేతను ఇన్-చార్జీగా నియమించి, పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించేలా కొత్త వ్యూహాన్ని అమలు చేయనున్నారు.

జూన్ నెలలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఈసారి సభ్యత్వాలను మాన్యువల్‌తో పాటు డిజిటల్ రూపంలోనూ నిర్వహించనున్నారు. సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత, నియోజకవర్గ , జిల్లా స్థాయిలలో పెద్ద ఎత్తున బహిరంగ సభలు నిర్వహించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.

ఈ సమావేశంలో పార్టీ రెండు ముఖ్యమైన అంశాలపై తీర్మానాలు చేసింది. మహిళా చట్టాన్ని తక్షణమే అమల్లోకి తీసుకురావాలని, ఈ బిల్లును పార్లమెంట్‌లో పెట్టి తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ తీర్మానించింది. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులపై స్పందిస్తూ, ప్రభుత్వం అన్ని రకాల పంటలను మద్దతు ధరతో కొనుగోలు చేయాలని డిమాండ్ చేసింది.

జీవన్ రెడ్డి రాకతో నూతన జోష్

ఇటీవలే కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్‌లో చేరిన సీనియర్ నేత టి. జీవన్ రెడ్డిని కేసీఆర్ ఈ వేదికగా పార్టీ శ్రేణులకు పరిచయం చేశారు. అధికార పార్టీ నుంచి వచ్చిన ఆయన అనుభవాన్ని, సేవలను పార్టీ బలోపేతం కోసం పూర్తిస్థాయిలో వినియోగించుకుంటామని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ మార్పుల ద్వారా బీఆర్ఎస్ మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

నేతలకు కేసీఆర్ సీరియస్ వార్నింగ్

కాగా సమావేశంలో కేసీఆర్ తనదైన శైలిలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ క్రమశిక్షణ, అంతర్గత నిబద్ధత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ, పార్టీ శ్రేణులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. పార్టీలో ఉంటూ ఇతర పార్టీల వైపు చూస్తున్న నేతలను ఉద్దేశించి కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. "ఆటో కాలు ఇటో కాలు వేస్తామంటే కుదరదు.. పార్టీ పట్ల పూర్తి నిబద్ధతతో ఉండాల్సిందే" అని ఆయన తేల్చి చెప్పారు. సోషల్ మీడియాలో డ్రామాలు ఆడుతూ మభ్యపెట్టే ప్రయత్నాలు ప్రతిసారి పనిచేయవని, క్షేత్రస్థాయిలో చేసే వాస్తవ పనితీరు ఆధారంగానే గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు. క్రమశిక్షణ ఉల్లంఘించినా, కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసినా ఉపేక్షించబోమని హెచ్చరించారు.

 కొత్త కమిటీల ఏర్పాటుపై కేసీఆర్ కీలక సూచనలు చేశారు. నాయకులకు నచ్చిన వారికో లేక వారి అనుయాయులకో పదవులు ఇస్తే ఊరుకోనని, కేవలం చురుకైన కార్యకర్తలకు మాత్రమే కమిటీల్లో అవకాశం ఇవ్వాలని ఆదేశించారు.నిఖార్సైన బీఆర్ఎస్ కార్యకర్తలకు, కొత్త వారికి కమిటీల్లో పెద్దపీట వేయాలి.ఎంపికలో అన్యాయం జరిగితే కార్యకర్తలు నేరుగా తనకు ఫిర్యాదు చేయవచ్చు.అటువంటి ఫిర్యాదులను తానే స్వయంగా పరిశీలిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు.

 రాబోయే ఎన్నికల టికెట్ల విషయంలో కేసీఆర్ ఇప్పటి నుంచే స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. "ఎవరు సిట్టింగ్ అన్నది ముఖ్యం కాదు.. పార్టీ లైన్‌లో ఉండి, క్రమశిక్షణతో పనిచేసే వారికే ప్రాధాన్యత ఉంటుంది" అని అన్నారు. పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యవహరించే వారికి, అది సిట్టింగ్ ఎమ్మెల్యేలైనా సరే, టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు. పార్టీలో అంతర్గత విభేదాలకు స్వస్తి పలకాలని, క్షేత్రస్థాయి నుంచి పార్టీని ప్రక్షాళన చేయడమే తన తక్షణ లక్ష్యమని కేసీఆర్ ఉద్ఘాటించారు. ఈ సమావేశం ద్వారా పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపడంతో పాటు, క్రమశిక్షణ విషయంలో వెనక్కి తగ్గేది లేదని గులాబీ బాస్ స్పష్టమైన సంకేతాలిచ్చారు.

Advertisment
తాజా కథనాలు