సీఎం రేవంత్‌కు కేటీఆర్ హెచ్చరిక

TG: సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ హెచ్చరించారు. అన్ని రకాల వడ్లకో రూ.500 బోనస్ ఇవ్వాలని, అలాగే రైతు భరోసా నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లక్షలాది మంది రైతులకు పంగనామాలు పెడతామంటే ఊరుకోమని.. పెద్దఎత్తున ఆందోళన చేపడుతామని వార్నింగ్ ఇచ్చారు.

New Update
KTR

MLA KTR: తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన హామీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహారిస్తోందంటూ కేటీఆర్ మండిపడ్డారు. ఎన్నికలకు ముందు రైతులు పండించే ప్రతి క్వింటాలు ధాన్యానికి రూ. 500 బోనస్ చెల్లిస్తామని ఇచ్చిన హామీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిన్న జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలోనూ దొడ్డు వడ్లకు 500 రూపాయల బోనస్, ఈ వర్షా కాలానికి సంబంధించి రైతు భరోసా సాయం పైన తేల్చకుంట కప్పదాటు వైఖరి అనుసరించిన సీఎంని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కేటీఆర్ నిలదీశారు. అదే విధంగా వానాకాలం సీజన్ పూర్తవుతున్నప్పటికీ ఇప్పటికీ రైతు భరోసా ఊసే ఎత్తటం లేదని ప్రశ్నించారు. వెంటనే దొడ్డు వడ్లకు బోనస్ తో పాటు రైతు భరోసా చెల్లించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

రుణమాఫీ అయ్యిందా అయ్యా?..

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రుణమాఫీపై విమర్శల దాడికి దిగారు ఎమ్మెల్యే కేటీఆర్. 100 శాతం రుణమాఫీ అయ్యిందంటూ విర్రవీగిన సీఎం బండారం వ్యవసాయ మంత్రి ప్రకటనతో బట్టబయలైందని అన్నారు.  20 లక్షల మంది రైతులకు ఇంకా రుణమాపీ జరగలేదని స్వయంగా వ్యవసాయ మంత్రే ప్రకటన చేశాడంటే ముఖ్యమంత్రివన్నీ డొల్లమాటలేనని తేలిపోయిందని చురకలు అంటించారు.

డిసెంబర్ 9 రోజే ఏకకాలంలో రూ. 2లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పి 10 నెలలైనా 20 లక్షల మంది రైతులకు నయా పైసా రాలేదంటే రైతులను నయవంచన చేయడం కాకపోతే ఏంటీ అని నిలదీశారు. అధికారిక లెక్కల ప్రకారమే…20 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదంటే అనధికార లెక్కల ప్రకారం ఇంకా ఎంతమంది రైతులు ఉంటారో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. రైతులకు చేయాల్సిన రుణమాఫీ పక్కన పెట్టి మూసీ పేరుతో వేలకోట్లు దోపీడి చేయాలనుకుంటున్న ఈ రాబందుల ప్రభుత్వం ఉండి రైతులకు ఏం లాభమని కేటీఆర్ ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు భరోసా పేరిట ఎకరాకు రూ. 7500 ఇస్తామంటూ స్వయంగా పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి మాట్లాడారని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ గత సీజన్ లో రైతులకు రైతుబంధు పైసలు మాత్రమే వేశారు. ఇప్పుడు వానాకాలం సీజన్ దాటినా ఇంకా రైతు బంధు (రైతు భరోసా) డబ్బులు రైతులకు అందలేదని విమర్శించారు. ఈ నగదు రైతుల ఖాతాలో ఎప్పుడు జమ చేస్తారో చెప్పాలని అన్నారు.

 

Advertisment
Advertisment
తాజా కథనాలు