/rtv/media/media_files/2026/04/25/kavita-2026-04-25-10-41-02.jpg)
Kavita
Big twist : తెలంగాణ రాజకీయ చిత్రపటంలో నేడు ఒక చారిత్రాత్మక మార్పు చోటుచేసుకుంది. కల్వకుంట్ల కవిత 'తెలంగాణ రాష్ట్ర సేన' (TRS) పేరుతో కొత్త పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ పరిణామం కేవలం ఒక కొత్త పార్టీ ఆవిర్భావం మాత్రమే కాదు, బీఆర్ఎస్ (BRS) పునాదులను కదిలించే ఒక శక్తివంతమైన వ్యూహంగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.మొదటి నుంచి కవిత ప్రకటించే పార్టీలో జాగృతి ఉండి తీరుతుందని అందరూ ఊహించారు. ఆమె సైతం ఒక దశలో జాగృతి ఉంటుందనే చెప్పారు. తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ వికాస సమితి అనే పేర్లు తొలుత ప్రచారం అయ్యాయి. మరోవైపు తెలంగాణ రాష్ట్రీయ సమితి , తెలంగాణ ప్రజా వికాస్ సమితి పేర్లలో ఏదో ఒకటి ఉంటుందని అందరూ ఉహించారు. కవిత కూడా తన పార్టీ పేరును చివరి వరకు సస్పెన్స్ లో ఉంచారు.
ఇదిలా ఉండగా అందరి ఊహాగానాలను తలకిందులు చేస్తూ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్ వేదికగా జరిగిన భారీ బహిరంగ సభలో కవిత తన పార్టీ పేరును "తెలంగాణ రాష్ట్ర సేన" (Telangana Rashtra Sena) గా ప్రకటించడం సంచలనంగా మారింది. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ పార్టీ సంక్షిప్త నామం TRS. గతంలో తన తండ్రి కేసీఆర్ స్థాపించిన 'తెలంగాణ రాష్ట్ర సమితి' పేరులోని సెంటిమెంట్‌ను, ఆ అక్షరాలనే కవిత ఎంచుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
కేసీఆర్ 'తెలంగాణ రాష్ట్ర సమితి'ని 'భారత్ రాష్ట్ర సమితి'గా మార్చిన తర్వాత, తెలంగాణ వాదుల్లో ఒక రకమైన భావోద్వేగ శూన్యం ఏర్పడింది. కవిత సరిగ్గా అదే 'TRS' అనే అక్షరాలతో 'తెలంగాణ రాష్ట్ర సేన'ను స్థాపించడం ద్వారా ఆ సెంటిమెంట్‌ను తన వైపుకు తిప్పుకున్నారు. "బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను కోల్పోయింది" అని కవిత చేసిన వ్యాఖ్యలు, పాత ఉద్యమకారులను ఆకర్షించేలా ఉన్నాయి. టీఆర్ఎస్ పేరుతో ఉన్న సుదీర్ఘ రాజకీయ వారసత్వాన్ని, సెంటిమెంట్‌ను కైవసం చేసుకోవడం కవిత వ్యూహంగా కనిపిస్తోంది.
బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్, హరీష్ రావుల ఆధిపత్యం పెరగడం, గత కొంతకాలంగా కవితా అనుచరులకు పార్టీలో ప్రాధాన్యత తగ్గడం వంటి అంశాలు ఈ కొత్త పార్టీ ఏర్పాటుకు దారితీశాయని తెలుస్తోంది. కేటీఆర్ నాయకత్వాన్ని వ్యతిరేకించే ద్వితీయ శ్రేణి నాయకులకు, అసంతృప్త నేతలకు 'తెలంగాణ రాష్ట్ర సేన' ఇప్పుడు ఒక బలమైన ప్రత్యామ్నాయంగా మారింది. గతేడాది (2025 సెప్టెంబరులో) బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన కవిత, అప్పటి నుంచి సొంతంగా 'జాగృతి జనం బాట' పేరిట క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల్లోకి వెళ్లారు. బీఆర్ఎస్ (BRS) జాతీయ రాజకీయాల వైపు వెళ్లడంతో తెలంగాణ ప్రాంతీయ అజెండాను , అమరవీరుల ఆశయాలను నెరవేర్చడమే లక్ష్యంగా ఈ 'తెలంగాణ రాష్ట్ర సేన' (TRS)ను ఏర్పాటు చేసినట్లు ఆమె సంకేతాలిచ్చారు. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా, పాత 'టిఆర్ఎస్' సెంటిమెంట్‌ను గుర్తు చేస్తూ ఈ పేరు పెట్టడం బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడటమే తమ పార్టీ ప్రధాన ఎజెండా అని ఈ సందర్భంగా కవిత స్పష్టం చేశారు.
'తెలంగాణ జాగృతి' ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో కవితకు ఉన్న నెట్‌వర్క్ ఇప్పుడు నేరుగా రాజకీయ పార్టీ యంత్రాంగంగా మారబోతోంది. బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేయడం ద్వారా కవితకు మహిళా లోకంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. "తెలంగాణ ఆడబిడ్డ"గా ఆమెకున్న ఇమేజ్, రాబోయే ఎన్నికల్లో మహిళా ఓటర్లను బీఆర్ఎస్ నుంచి తన వైపుకు మళ్లించే అవకాశం ఉంది. బహుజన, అణగారిన వర్గాల ప్రతినిధులుగా అంబేద్కర్, ఫూలే విగ్రహాలను సభా ప్రాంగణంలో ఉంచడం ద్వారా అన్ని వర్గాలను కలుపుకుపోయే ప్రయత్నం చేశారు.
బీఆర్ఎస్ (BRS)ఓటు బ్యాంకు చీలిపోయే ప్రమాదం. ముఖ్యంగా ఉద్యమకారుల మద్దతు తగ్గొచ్చు.కాంగ్రెస్, బీజేపీప్రతిపక్షాల ఓటు చీలకుండా, అధికార పక్షం (లేదా ప్రధాన ప్రత్యర్థి) ఓట్లు చీలితే వీరికి లాభం చేకూరవచ్చు. ఒకే కుటుంబం నుంచి రెండు పార్టీలు ఉండటం కేసీఆర్ రాజకీయ వారసత్వానికి సవాలుగా మారనుంది.
కవిత తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ రాజకీయాలను 'త్రిముఖ' లేదా 'చతుర్ముఖ' పోటీ వైపు తీసుకెళ్తోంది. "తెలంగాణ రాష్ట్ర సేన" కేవలం ఓట్లను చీలుస్తుందా లేక అధికార పీఠాన్ని శాసించే స్థాయికి ఎదుగుతుందా అనేది భవిష్యత్తు నిర్ణయించాలి. కానీ, ఈరోజు మునీరాబాద్ వేదికగా కవిత వేసిన అడుగు బీఆర్ఎస్ పార్టీకి మాత్రం 'బిగ్ షాక్' అనడంలో సందేహం లేదు.
Follow Us