Balka Suman : తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా – బాల్క సుమన్‌ అరెస్ట్‌

భారత రాష్ట్ర సమితి (BRS) కీలక నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను నాంపల్లి పోలీసులు శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేశారు. ఉదయం నుంచే ఆయన అరెస్ట్ కాబోతున్నారనే వార్తలు రావడంతో తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

New Update
FotoJet (47)

Balka Suman arrested

Balka Suman : భారత రాష్ట్ర సమితి (BRS) కీలక నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను నాంపల్లి పోలీసులు శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేశారు. ఉదయం నుంచే ఆయన అరెస్ట్ కాబోతున్నారనే వార్తలు రావడంతో తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తొలుత ఈ వార్తలను ఖండించిన సుమన్, తాను ఎక్కడికీ పారిపోలేదని, పార్టీ కార్యకలాపాల్లోనే ఉన్నానని స్పష్టం చేశారు. ఆ తర్వాత పోలీసులు భారీగా మోహరించి భవనాన్ని చుట్టుముట్టగా, బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసులను అడ్డుకుంటూ 'గో బ్యాక్' అంటూ నినాదాలు చేయడంతో అక్కడ కాసేపు తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

సింగరేణి సంస్థ, ప్రజా నిరసనలపై బాల్క సుమన్ ఇటీవల చేసిన వివాదాస్పద, ఉద్వేగభరిత వ్యాఖ్యల కారణంగానే ఈ అరెస్ట్ జరిగింది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపేందుకు రైతులు, కార్మికులు నేరుగా రావడం లేదని, కాబట్టి బీఆర్ఎస్ నేతలే స్వయంగా మిలిటెంట్ తరహా ఉద్యమాలకు దిగాలని ఆయన పిలుపునిచ్చారు. అవసరమైతే రోడ్లపై గొడవలు చేయాలని, సింగరేణి కార్యాలయాలను ధ్వంసం చేయాలని, రైలు పట్టాలను కోసేయాలంటూ ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో ఆయనపై పలు తీవ్రమైన సెక్షన్ల కింద నాన్-బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి.

బాల్క సుమన్‌పై నమోదైనవి నాన్-బెయిలబుల్ కేసులు కావడం వల్ల ఆయనకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని అబిడ్స్ ఏసీపీ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన పోలీసులను బీఆర్ఎస్ న్యాయవాదులు, కార్యకర్తలు అడ్డుకున్నప్పటికీ, చట్టపరమైన ప్రక్రియను అనుసరించి పోలీసులు ముందుకు వెళ్లారు. చివరకు సుమన్ స్వయంగా తెలంగాణ భవన్ నుండి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన అనంతరం పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తదుపరి చట్టపరమైన విచారణ నిమిత్తం ఆయనను నాంపల్లి కోర్టుకు తరలించారు.

అరెస్ట్‌కు ముందు మీడియాతో మాట్లాడిన బాల్క సుమన్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్‌లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పాలన దేశంలో ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోందని, ప్రజల తరఫున, సింగరేణి కార్మికుల వారసత్వ ఉద్యోగాల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే తనపై కుట్రపూరితంగా అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. పాలకులకు ప్రజా సమస్యలపై కంటే తనను జైల్లో పెట్టి పైశాచికానందం పొందడంపైనే ఎక్కువ శ్రద్ధ ఉందని, సింగరేణిలో వందల కోట్ల విలువైన స్కాములు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు.

తాను చట్టాన్ని, రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించే వ్యక్తిగా పోలీసులకు సహకరిస్తున్నానని, ఈ అక్రమ అరెస్టులపై కోర్టులోనే న్యాయపోరాటం చేస్తానని సుమన్ ప్రకటించారు. గత తెలంగాణ ఉద్యమ సమయంలోనూ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తనను టార్గెట్ చేసి 250కి పైగా కేసులు పెట్టి, లాఠీఛార్జ్ చేసి చెర్లపల్లి, చంచల్‌గూడ జైళ్లకు పంపిందని గుర్తుచేశారు. ఇటీవల క్యాతనపల్లి మున్సిపాలిటీ ఎన్నికల సమయంలోనూ తనను జైలుకు పంపి కనీస వసతులు లేకుండా ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధిగా (మాజీ ఎంపీ, ఎమ్మెల్యేగా) ఓడినా గెలిచినా ప్రజల్లోనే ఉంటూ నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు.

Advertisment
తాజా కథనాలు