Prof Nageshwar: హైదరాబాద్ లో AP పోలీసులు.. ప్రొ.నాగేశ్వర్ అరెస్ట్ తప్పదా? అసలేం జరుగుతోంది?

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి అమిత్ షాల భేటీపై రాజకీయ విశ్లేషకుడు కె. నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆయనపై కేసు నమోదు కావడంతో పాటు ఆయనను అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు హైదరాబాద్ వచ్చారంటూ ప్రచారం సాగటం తీవ్ర ఉత్కంఠ రేపింది.

New Update
FotoJet (11)

Prof. Nageshwar...Pawan Kalyan

Prof Nageshwar:  ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల భేటీపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ రావు చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారాయి. ఆయనపై ఏపీలో కేసు నమోదు కావడం, అదే సమయంలో ఆయనను అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు హైదరాబాద్ వచ్చారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడం తీవ్ర ఉత్కంఠ రేపింది. అయితే ఈ అరెస్ట్ వార్తలను బాధ్యతాయుత వర్గాలు పూర్తిగా ఖండించాయి. 

ఈ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఇటీవల ఒక ప్రముఖ టీవీ ఛానెల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏపీ రాజకీయాలకు సంబంధించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ కలిసి ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన సందర్భాన్ని ఆయన ప్రస్తావించారు. ఆ సమయంలో అమిత్ షాకు, పవన్ కళ్యాణ్ పూసగుచ్చినట్లు కొన్ని విషయాలు వివరించారని నాగేశ్వర్ పేర్కొన్నారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటూ తమపై (కూటమిపై) తీవ్రమైన ఒత్తిడి వస్తోందని వారు అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. దీనికి అమిత్ షా స్పందిస్తూ.. "రాజకీయాల్లో చంద్రబాబు తాత్కాలిక మిత్రుడు మాత్రమే, కానీ జగన్ శాశ్వత మిత్రుడు. చంద్రబాబుకు జగన్‌తో శత్రుత్వం ఉండొచ్చు.. కానీ మనకెందుకు?" అని అన్నట్లు జనసేన కోర్ కమిటీ సమావేశం ద్వారానే తనకు నమ్మకమైన సమాచారం అందిందంటూ ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. అయితే ఈ విషయమై ఆ తర్వాత నాగేశ్వర్ తన వ్యాఖ్యలను వెనుకకు తీసుకోవడం గమనార్హం.

కాకినాడలో జనసేన నేతల ఫిర్యాదు.. కేసు నమోదు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్‌ల మధ్య జరగని సంభాషణను జరిగినట్లుగా చిత్రీకరిస్తూ.. ప్రొఫెసర్ నాగేశ్వర్ తీవ్ర అనుచిత, ఆధారాల్లేని వ్యాఖ్యలు చేశారని జనసేన పార్టీ నేతలు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంపై, నాయకులపై బురదజల్లేందుకే ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్‌లో జనసేన పార్టీ నాయకులు ప్రొఫెసర్ నాగేశ్వర్‌తో పాటు సదరు టీవీ ఛానెల్‌పై అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ కూడా సీరియస్‌గా ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడిచింది. కాగా, సోమవారం జరిగిన జనసేన పార్టీ సమావేశంలో ఈ విషయమై పవన్‌ కళ్యాణ్‌ సీరియస్‌ కావడంతో వ్యవహారం మరింత తీవ్రతకు దారి తీసింది. ఈ నేపథ్యంలో  ప్రొఫెసర్ నాగేశ్వర్ ను ఏపీ పోలీసులు అరెస్ట్‌ చేస్తారంటూ తీవ్ర ప్రచారం సాగింది.

అరెస్ట్ ప్రచారం.. అసలు నిజం ఏమిటి?

కేసు నమోదైన తర్వాతి రోజే (మంగళవారం) ఆంధ్రప్రదేశ్ నుండి 3 వాహనాల్లో సుమారు 50 మంది పోలీసులు తెలంగాణకు బయలుదేరారనే వార్త దావానంలా వ్యాపించింది. ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను అరెస్ట్ చేసేందుకే ఏపీ పోలీసులు హైదరాబాద్ వస్తున్నారని, కొద్ది గంటల్లో ఆయన ఇంటికి చేరుకుంటారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అదే సమయంలో ఆయన మొబైల్ ఫోన్ కూడా అందుబాటులోకి రాకపోవడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో హైదరాబాద్‌లోని టోలిచౌకి పోలీసులు ప్రొఫెసర్ నాగేశ్వర్ నివాసం వద్ద ముందస్తు జాగ్రత్తగా రక్షణ (ప్రొటెక్షన్) కల్పించారు.

అయితే, ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు తెలంగాణకు చేరుకున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. అది పూర్తిగా అసత్యపు ప్రచారమని రవాణా, పోలీస్ వర్గాలు స్పష్టం చేశాయి. కొందరు ఉద్దేశపూర్వకంగానే పనిగట్టుకుని ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు పెంచేలా ఈ అవాస్తవాలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని, ఈ దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అధికారులు తెలిపారు.ప్రస్తుతానికి చట్టపరమైన ప్రక్రియలో భాగంగా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందే తప్ప, తక్షణ అరెస్టులు వంటివి ఏవీ లేవని  పుకార్లను నమ్మవద్దని ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్‌ చెక్‌ సైతం స్పష్టం చేయడం గమనార్హం.

Advertisment
తాజా కథనాలు