/rtv/media/media_files/2026/05/26/maoist-leader-narahari-2026-05-26-16-47-56.jpg)
Maoist leader Narahari surrenders
Maoist surrenders : మావోయిస్టు పార్టీకి దేశవ్యాప్తంగా మరో కోలుకోలేని భారీ ఎదురుదెబ్బ తగిలింది. దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉంటూ విప్లవోద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న కేంద్ర కమిటీ సభ్యుడు (CCM) పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్, ఆయన భార్య, స్టేట్ కమిటీ మెంబర్ మెడారి ధనమ్మ అలియాస్ లత మంగళవారం (మే 26, 2026) తెలంగాణ పోలీసుల ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయారు. హైదరాబాద్‌లోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ సమక్షంలో వారు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన పునరావాస ప్యాకేజీ కింద నరహరికి రూ. 25 లక్షలు, ధనమ్మకు రూ. 20 లక్షల విలువైన చెక్కులను డీజీపీ అందజేసి, వారికి కొత్త జీవితంపై భరోసానిచ్చారు.
/filters:format(webp)/rtv/media/media_files/2026/05/26/maoist-leader-narahari-surrenders-2026-05-26-16-49-05.jpg)
హన్మకొండ జిల్లా కాజీపేట మండలం సోమిడి గ్రామంలో 1962లో జన్మించిన పసునూరి నరహరి విద్యాభ్యాసం స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లోనే సాగింది. ఎల్బీ డిగ్రీ కాలేజీలో ఇంటర్, డిగ్రీ చదువుతున్న రోజుల్లో నాటి ర్యాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (RSU) సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా కుంట దళంలో సాధారణ సభ్యుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించిన నరహరి, ఆ తర్వాత గోపన్న దళం, రామన్న స్క్వాడ్‌లలో దండకారణ్యం వేదికగా చురుగ్గా పనిచేశారు. 1986లో హైదరాబాద్ సిటీ ఆర్గనైజర్‌గా, బెంగళూరులో డెన్ కీపర్‌గా వ్యవహరిస్తూ నగరాల్లో పార్టీ నెట్‌వర్క్‌ను బలోపేతం చేశారు.
పార్టీలో నరహరి అత్యంత ప్రమాదకరమైన ‘టెక్నికల్ వింగ్’ నిపుణుడిగా గుర్తింపు పొందారు. సౌత్ బస్తర్‌లో దాదాపు 10 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీ సప్లయ్ అండ్ ఆర్మ్స్ ఆర్గనైజర్‌గా పనిచేసిన ఆయన.. ఫైర్ ఆర్మ్స్, మోటార్లు, రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్లు (RPG), బూబీ ట్రాప్‌లు, క్లేమోర్ మైన్స్ మరియు ఐఈడీ (IED)లను తయారు చేయడంలో, అనుసంధానించడంలో అసాధారణ నైపుణ్యం సాధించారు. వందలాది మంది కేడర్‌కు ఆయనే స్వయంగా బాంబుల తయారీలో శిక్షణ ఇచ్చారు. ఆయన ప్రతిభను గుర్తించిన అగ్రనాయకత్వం మొదట నాగ్‌పూర్ రీజినల్ కమిటీకి, ఆ తర్వాత బిహార్-ఝార్ఖండ్ స్టేట్ కమిటీకి బదిలీ చేసింది. 2017లో ఆయనను అత్యున్నతమైన కేంద్ర కమిటీ సభ్యుడిగా (CCM) నియమించగా, ఝార్ఖండ్‌లోని కోల్హన్ ఏరియాలో స్టేట్ మిలటరీ కమిటీ మెంబర్‌గా, టెక్నికల్ హెడ్‌గా సుదీర్ఘకాలం బాధ్యతలు నిర్వర్తించారు.
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గాములపాడు గ్రామానికి చెందిన మెడారి ధనమ్మ అలియాస్ లత 1988లో నరహరిని వివాహం చేసుకున్నారు. వివాహమైన నాటి నుంచి భర్త అడుగుజాడల్లోనే నడుస్తూ విప్లవ పథంలో సాగారు. 2004లో ఈమెను నాగ్‌పూర్ పోలీసులు అరెస్ట్ చేయగా, ఏడేళ్ల పాటు సెంట్రల్ జైలులో కఠిన శిక్ష అనుభవించారు. 2011లో బెయిల్‌పై విడుదలైనప్పటికీ, ఆమె చట్టబద్ధమైన జీవితాన్ని ఎంచుకోకుండా మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లి ఉద్యమ బాట పట్టారు. 2018 నుంచి బిహార్, ఝార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీలో ఉంటూ టెక్నికల్ టీమ్‌కు వ్యూహాత్మక మద్దతు అందిస్తూ, స్టేట్ కమిటీ మెంబర్‌గా బాధ్యతలు నిర్వహించారు. అయితే, ఇటీవలి కాలంలో వయసు పైబడటం, తీవ్ర అనారోగ్య సమస్యలు వెంటాడటంతోనే తాము జనజీవన స్రవంతిలోకి రావాలని నిర్ణయించుకున్నట్లు ఈ దంపతులు వెల్లడించారు.
ఈ లొంగుబాటు సందర్భంగా డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఉనికి పతనకవస్థకు చేరిందని స్పష్టం చేశారు. 2024 నుంచి ఇప్పటివరకు తెలంగాణలో వేర్వేరు కేడర్లకు చెందిన మొత్తం 822 మంది మావోయిస్టులు లొంగిపోయారని, వారి నుంచి 334 ఆయుధాలను రికవరీ చేశామని వెల్లడించారు. ఇటీవలే ఝార్ఖండ్‌లో 15 మంది, ఇవాళ ఇద్దరు అగ్రనేతల లొంగుబాటు తర్వాత.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేవలం 47 మంది మావోయిస్టులు మాత్రమే అజ్ఞాతంలో మిగిలి ఉన్నారని గణాంకాలను విడుదల చేశారు. ఇందులో ఛత్తీస్‌గఢ్‌లో 15, ఒరిస్సాలో 15, ఝార్ఖండ్‌లో 13 మంది ఉండగా, తెలంగాణలో కేవలం ముగ్గురు, ఏపీలో ఒక్కరు మాత్రమే మిగిలి ఉన్నారని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న ముగ్గురిలో మావోయిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి, ఆయన భార్య జోడె రత్నాబాయి, వార్త శేఖర్ మాత్రమే ఉన్నారని డీజీపీ తెలిపారు. వీరంతా ప్రస్తుతం తీవ్ర వయోభారం, వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. ఈ నేపథ్యంలో డీజీపీ సీవీ ఆనంద్ అగ్రనేత గణపతికి ఒక కీలక పిలుపునిచ్చారు. వారు కూడా తక్షణమే ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని, లొంగిపోతే తెలంగాణ పోలీస్ శాఖ తరఫున వారికి మెరుగైన ఉచిత వైద్య సదుపాయాలతో పాటు, ప్రభుత్వం ద్వారా పూర్తి స్థాయి పునరావాసం కల్పించి గౌరవప్రదమైన జీవితానికి భరోసా ఇస్తామని డీజీపీ సాదరంగా ఆహ్వానించారు.
Follow Us