/rtv/media/media_files/2026/06/10/pawan-and-amit-shah-2026-06-10-06-51-49.jpg)
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విజయవంతంగా 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో.. ఢిల్లీలోని భారత్ మండపంలో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మీడియాతో జరిపిన చిట్‌చాట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. ముఖ్యంగా తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామంటూ ఆయన చేసిన ప్రకటన, ఏపీలో మిత్రపక్షాలుగా ఉన్న TDP, జనసేన పార్టీలకు ఒక రకమైన బిగ్ షాక్ అనే చెప్పాలి. కేవలం పొత్తుల గురించే కాకుండా.. నియోజకవర్గాల పునర్విభజన, వన్ నేషన్ వన్ ఎలక్షన్ వంటి జాతీయ అంశాలపై కూడా అమిత్ షా తమ వ్యూహాత్మక క్లారిటీని స్పష్టం చేశారు.
తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలపై మాకో స్పష్టమైన క్లారిటీ ఉంది. అక్కడ మేము ఒంటరిగానే పోటీ చేస్తాం. రాబోయే రోజుల్లో ఏ ప్రాంతీయ పార్టీని దగ్గరకు చేర్చుకునే అవకాశం లేదని అమిత్ షా తేల్చి చెప్పారు. దీని అర్థం ఏంటంటే.. ఏపీలో ఉన్న పొత్తులు కేవలం ఆ రాష్ట్రానికే పరిమితం, తెలంగాణలో బీజేపీ ఏ పార్టీతోనూ (టీడీపీ, జనసేన) కలిసి నడవడానికి సిద్ధంగా లేదని చెప్పకనే చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ లోపాయికారీగా పొత్తు పెట్టుకుంటున్నాయని, రెండు పార్టీలు ఒక్కటేనని గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారానికి కూడా అమిత్ షా ఈ కామెంట్స్ తో చెక్ పెట్టారు. తాము ఎవరితోనూ చేతులు కలపడం లేదని, సొంత బలంపైనే తెలంగాణలో అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని కమలనాథుల వ్యూహాన్ని బయటపెట్టారు.
ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు
నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అమిత్ షా స్పందిస్తూ ఆ వ్యాఖ్యల్లో పెద్దగా తీవ్రత లేదని కొట్టిపారేశారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఎవరికీ, ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని హామీ ఇచ్చారు. లోక్‌సభలో ఆయా రాష్ట్రాలకు ప్రస్తుతం ఉన్న నిష్పత్తి ప్రకారం.. అన్ని రాష్ట్రాలలో 50 శాతం సీట్లు పెరిగేలా బిల్లును ఆమోదించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుపై ప్రస్తుతం కమిటీ అధ్యయనం చేస్తోందని కీలక అప్‌డేట్ ఇచ్చారు.
కేంద్రంలో తమతో కలిసి నడుస్తున్న ప్రాంతీయ పార్టీలకు ఎలాంటి ఇబ్బందులు లేవని, ఎన్డీయే కూటమిలోని అన్ని పార్టీలు చాలా బలంగా ఉన్నాయని అమిత్ షా చెప్పుకొచ్చారు. మీనాక్షీ నటరాజన్ వేసిన నామినేషన్ తిరస్కరణకు, తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత కమలనాథ్ సరిగ్గా చూసుకోకుండా ఆ నామినేషన్ పత్రాలను నింపారు కాబట్టే అది రిజెక్ట్ అయిందంటూ ఎద్దేవా చేశారు.
Follow Us