/rtv/media/media_files/2025/02/19/nSIg7gqU4HW8lC1xHiE5.webp)
murder
Crime News : కామారెడ్డి జిల్లాలో క్షణికావేశం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకోవడమే కాకుండా, ఇద్దరు పసిపిల్లల భవిష్యత్తును చీకట్లోకి నెట్టేసింది.
వివరాల్లోకి వెళ్తే... కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి అమానుష ఘటన వెలుగుచూసింది. చిన్నపాటి మనస్పర్థలు ఒక కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేశాయి. భార్య చేసిన దాడిలో భర్త ప్రాణాలు కోల్పోగా, ఆమె కటకటాల పాలైంది. ఈ ఘటనతో వారిద్దరి పసిబిడ్డలు దిక్కులేని వారయ్యారు. కామారెడ్డి పట్టణ శివారులోని వాంబే కాలనీలో కోదండ శివ (30), అతని భార్య లక్ష్మి నివాసం ఉంటున్నారు. శనివారం రాత్రి వీరిద్దరి మధ్య ఏదో విషయంలో చిన్న గొడవ మొదలైంది. ఆ గొడవ కాస్తా ముదరడంతో లక్ష్మి తీవ్ర ఆగ్రహానికి లోనైంది. క్షణికావేశంలో పక్కనే ఉన్న కొడవలితో భర్తపై విచక్షణారహితంగా దాడి చేసింది. తీవ్ర గాయాలైన శివ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితురాలు లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి (GGH)కి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.ఈ ఘటనలో అత్యంత విషాదకరమైన అంశం ఏమిటంటే.. ఈ దంపతులకు ఒక సంవత్సరం, రెండేళ్ల వయసున్న ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.తండ్రి మరణించడం, తల్లిని పోలీసులు తీసుకెళ్లడంతో ఆ పసిపిల్లలు ఒక్కసారిగా అనాథలయ్యారు.తల్లిదండ్రుల మధ్య జరిగిన గొడవతో ఏ పాపం తెలియని ఆ బిడ్డల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.పసిపిల్లల పరిస్థితిని చూసి స్థానికులు, ఇరుగుపొరుగు వారు కన్నీరుమున్నీరవుతున్నారు.
కుటుంబ కలహాలు ఎంతటి దారుణాలకు దారితీస్తాయో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. ఆ సమయంలో లక్ష్మి ఒక్క క్షణం ఆగి ఆలోచించి ఉంటే..భర్త ప్రాణాలతో ఉండేవారు.ఆమె జైలు పాలు కావాల్సిన అవసరం ఉండేది కాదు. ముక్కుపచ్చలారని ఇద్దరు పిల్లలు అనాథలయ్యే వారు కాదు అని అందరూ చర్చించుకుంటున్నారు.
Follow Us