/rtv/media/media_files/2025/01/26/leW8KbDQCOav1sb1kp0W.jpg)
tg republic Photograph: (tg republic)
పరేడ్ గ్రౌండ్లో76వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ జెండాను అవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు పరేడ్ గ్రౌండ్ లోని వీర జవాన్ల స్తూపానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన స్వాతంత్ర్య సంగ్రామంలో సైనికుల త్యాగాలను గుర్తుచేసుకున్నారు. గణతంత్ర వేడుకలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరగనున్నాయి.
మరోవైపు రిపబ్లిక్ డే సందర్భంగా ఆదివారం హైదరాబాద్ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాలు, పంజాగుట్ట నుంచి బేగంపేట్ మీదుగా సికింద్రాబాద్ వైపు వెళ్లే రూట్ లో ఉదయం 7.30 గంటల నుంచి 11.30 వరకు ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని అడిషనల్ సీపీ(ట్రాఫిక్) విశ్వప్రసాద్ తెలిపారు.
వీఐపీల మూవ్మెంట్ సమయాల్లో ట్రాఫిక్ నిలిపివేత, దారి మళ్లింపు ఉంటుందన్నారు. వాహనదారులు నిర్దేశించిన రూట్లలో ట్రావెల్ చేయాలని సూచించారు. ఇక ఎట్ హోమ్ సందర్భంగా రాజ్ భవన్ పరిసర ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. ఖైరతాబాద్ ఫ్లై ఓవర్, పంజాగుట్ట, బేగంపేట మార్గాల్లో అవసరానికి అనుగు ణంగా వాహనాల నిలిపివేత మళ్లింపులు ఉంటాయని పేర్కొన్నారు.
ఇవాళ 4 కొత్త పథకాలు
రిపబ్లిక్ డే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం కొత్తగా నాలుగు కొత్త పథకాలను ప్రారంభించనుంది. రైతుభరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను తొలుత 621 గ్రామాల్లోనే అమలు చేయనుంది. ఫిబ్రవరి నుంచి మార్చ్ వరకు అర్హులందరికీ లబ్ధి చేకూర్చనుంది. నారాయణపేట జిల్లా చంద్రవంచలో జరిగే పథకాల పండుగలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అయితే ఇవాళ ఆదివారం కావడంతో లబ్ధిదారుల అకౌంట్లలో నగదు సోమవారం జమ కానుంది.