HYD Scam: బంగ్లాదేశ్‌కు చెందిన పలువురు మనదేశంలోకి అక్రమంగా చొరబడుతున్నారన్న విషయం చాలాసార్లు రుజువైంది. బంగ్లా సరిహద్దుల్లో ఉన్న భద్రత దళాల కన్నుగప్పి మనదేశంలోకి పలువురు ప్రవేశిస్తున్నారు. అలా వచ్చినవారిలో చాలామంది హైదరాబాద్‌లో తలదాచుకుంటున్నారనే విషయం చాలాసార్లు రుజువైంది. అయితే ఆ అక్రమ చొరబాటుదారులకు స్థానిక బర్త్ సర్టిఫికెట్ ఇస్తూ వారిని స్థానికులుగా నమ్మిస్తున్న ఒక ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు.బర్త్ సర్టిఫికెట్ పత్రంపై అనుమానంతో తీగ లాగితే డొంక కదిలింది.
ఇది కూడా చదవండి: రాత్రంతా ఏసీ వాడుతున్నారా..అయితే జాగ్రత్త
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం . మహ్మద్ హసిబుల్ అనే వ్యక్తి ఢాకా నుంచి అక్రమంగా కోల్‌కతా చేరి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డాడు. అయితే ఆయన విషయంలో అనుమానం రావడంతో ఎంక్వయిరీ చేయగా షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. బంగ్లా రాజధాని ఢాకాకు చెందిన ప్రధాన నిందితుడు మహ్మద్ హసిబుల్ నాలుగేళ్ల క్రితం భారత్‌లోకి వచ్చాడు. ఏజెంట్లకు రూ.25 వేలిచ్చి అక్రమంగా పశ్చిమ బెంగాల్‌లోకి ప్రవేశించాడు. కోల్‌కతాలోని సౌత్రాలో జోవన్ చౌదరి పేరుతో నకిలీ ఆధార్ కార్డు సేకరించాడు. అక్కడే కరాటే శిక్షకుడిగా పని చేస్తూ నెలకు రూ.20 వేల సంపాదనతో జీవనం సాగించాడు. 2023 డిసెంబర్లో ఫేస్‌బుక్‌లో ఛాటింగ్ ద్వారా హైదరాబాద్ మలక్‌పేట్‌కు చెందిన జయా చౌదరితో పరిచయం పెంచుకున్నాడు. తాను కోల్‌కతా పౌరుడినంటూ మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు. మలక్‌పేటకు మకాం మార్చి ఆన్‌లైన్ వస్త్ర వ్యాపారం, ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు.
ఇది కూడా చూడండి: Sunstroke: వడదెబ్బకు ఏడుగురు మృతి.. మరో రెండ్రోజులు వడగాల్పులు
ఇదే సమయంలో తనకు బర్త్ సర్టిఫికెట్‌ఇప్పించాలంటూ మలక్‌పేట్‌లోని పాన్ దుకాణ యజమాని మహ్మద్ ముఖీద్‌ను మహ్మద్ హసిబుల్ కోరాడు. అతడు కోల్‌కతా నుంచే వచ్చాడని నమ్మిన పాన్‌షాప్ యజమాని, చాదర్ ఘాట్‌లోని డీటీపీ ఆపరేటర్ సాయికిరణ్‌ను పరిచయం చేశాడు. అతడు చంచల్‌గూడలోని రజనీకాంత్‌ను సంప్రదించమని సూచించాడు. రజనీకాంత్ ద్వారా నార్సింగి మున్సిపాలిటీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి సుధీర్‌కుమార్‌ను మహ్మద్ హసిబుల్ కలిశాడు. రూ.15 వేలు కమీషన్ ఇచ్చి జోవన్ చౌదరి పేరుతో బర్త్ సర్టిఫికెట్ పొందాడు. వాటి ఆధారంగా ఓటరు గుర్తింపు కార్డు సైతం సంపాదించాడు. బర్త్ సర్టిఫికెట్, ఓటరు ఐడీ రెండు ఉండడంతో ఆధార్ కార్డు పొందేందుకు మహ్మద్ హసిబుల్ సిద్ధమయ్యాడు.
Also Read: ఏ బొక్కలో దాక్కున్న తప్పించుకోలేరు.. ఉగ్రవాదుల వేటకు రంగంలోకి ధ్రువ్ హెలీకాప్టర్లు!
ఇదిలా ఉండగానే 3 నెలల క్రితం బంగ్లాదేశ్ నుంచి కోల్‌కతా చేరి టూరిస్ట్ గైడ్‌గా పని చేస్తున్న రోహన్‌షాతో మహ్మద్ హసిబుల్‌కు పరిచయం ఏర్పడింది. తన భార్య గర్భంతో ఉందని సహకరించాలని కోరటంతో రోహన్ షాను హైదరాబాద్ రప్పించిన హసిబుల్ తన ఇంట్లో వసతి కల్పించాడు. అతడికి నకిలీ ఆధార్ కార్డు ఇప్పించాడు. హసన్, రోహన్ షా భారత పౌరులుగా చెలామణి అయ్యేందుకు పాస్‌పోర్ట్స్ పొందాలని నిర్ణయించుకొని నకిలీ ఆధార్ కార్డులతో దరఖాస్తు చేసుకున్నారు. పోలీసుల పరిశీలనలో అవి నకిలీవిగా తేలటంతో మధ్య మండలం టాస్క్‌ఫోర్స్ ఇన్స్‌పెక్టర్ ఖలీల్ పాషా బృందం రంగంలోకి దిగింది. అసలు వారికి ఆ నకిలీ కార్డ్సు ఎలా వచ్చాయి అనే విషయంలో కూఫీ లాగడం మొదలు పెట్టాయి.
ఇది కూడా చదవండి: ఇంట్లో బల్లుల బెడద ఎక్కువగా ఉందా ఇలా తరిమేయండి
బంగ్లాదేశీయుడి నుంచి రాబట్టిన సమాచారంతో పాన్ దుకాణదారుడిని పోలీసులు ప్రశ్నించటంతో మిగిలిన వారి ప్రమేయం వెలుగు చూసింది. నార్సింగి మున్సిపాలిటీ కార్యాలయానికి మఫ్టీలో వెళ్లిన పోలీసులు, తమకు బర్త్ సర్టిఫికెట్ కావాలని సుధీర్‌ని కోరటంతో అంగీకరించాడు. దీంతో ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి తదుపరి దర్యాప్తు కోసం మలక్‌పేట్ పోలీసులకు అప్పగించారు. నిందితుల్లో నార్సింగి మున్సిపాలిటీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి సుధీర్ కుమార్, ఏజెంట్లు మహ్మదులీజ్, టి.సాయికిరణ్, రజనీకాంత్, బంగ్లా దేశస్థులు మహ్మద్ హసిబుల్, రోహన్ ఉన్నారు. నిందితుల నుంచి 7 సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్, నకిలీ ఆధార్, ఓటర్ గుర్తింపు, బర్త్ సర్టిఫికెట్లు, బంగ్లా పాస్‌పోర్టు స్వాధీనం చేసుకున్నారు.
Also Read: ఈ సారి సైన్యం కాదు.. పర్యాటకులే టార్గెట్.. ఉగ్రమూకల కొత్త వ్యూహం అదేనా?