Mandula Samuel: అద్దంకిని కాదని సామేలుకు తుంగతుర్తి టికెట్.. ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా?

అద్దంకి దయాకర్, పిడమర్తి రవి, మోత్కుపల్లి నర్సింహులు లాంటి టాప్ లీడర్లను పక్కకు నెట్టి తుంగతుర్తి కాంగ్రెస్ టికెట్ ను సొంతం చేసుకున్నారు మందుల సామేలు. దీంతో ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఆయన గత పార్టీ ఏంటి? ఆయన ఏ పదవుల్లో పని చేశారు? అన్న చర్చ జోరుగా సాగుతోంది.

New Update
Mandula Samuel: అద్దంకిని కాదని సామేలుకు తుంగతుర్తి టికెట్.. ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా?

గత కొన్ని రోజులుగా తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్న అంశంపై రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ టికెట్ కోసం కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ అద్దంకి దయాకర్ (Addanki Dayakar) తీవ్రంగా ప్రయత్నించారు. ఆయనకే టికెట్ వస్తుందని అంతా భావించారు. దయాకర్ తో పాటు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ఓయూ విద్యార్థి ఉద్యమ నేత పిడమర్తి రవి, అన్నెపర్తి జ్ఞానసుందర్, మందుల సామేలు, నగారిగారి ప్రీతం తదితరులు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఆఖరి నిమిషంలో మందుల సామేలు పేరును ప్రకటించింది కాంగ్రెస్ హైకమాండ్. అద్దంకి దయాకర్, మోత్కుపల్లి నర్సింహులు, పిడమర్తి రవి తదితర రాష్ట్ర స్థాయి పాపులర్ లీడర్లను పక్కకు నెట్టి టికెట్ దక్కించుకున్న సామేలు ఎవరన్న అంశంపై తెలంగాణ వ్యాప్తంగా జోరుగా చర్చ సాగుతోంది.
ఇది కూడా చదవండి: Big Breaking: మరో ట్విస్ట్ ఇచ్చిన బీజేపీ.. ఆ రెండు స్థానాల్లో అభ్యర్థులు మార్పు..

publive-image తెలంగాణ ఉద్యమ సమయంలో నేటి మంత్రి జగదీశ్ రెడ్డి, సీఎం కేసీఆర్ తో సామేలు

సామేలు విషయానికి వస్తే.. ఆయన 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో పని చేస్తూ వస్తున్నారు. 2001-05 వరకు ఉమ్మడి నల్గొండ జిల్లా టీఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా పని చేశారు. 2001లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సామేలు సతీమణి మోత్కూరు జడ్పీటీసీగా టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి 8 వేల ఓట్లు సాధించారు. తర్వాత సామేలును 2005లో టీఆర్ఎస్ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా నియమించారు కేసీఆర్. 2014 వరకు ఆయన ఆ పదవిలో కొనసాగారు. 2008లో పునర్విభజన తర్వాత సామేలు సొంత నియోజకవర్గం తుంగతుర్తి ఎస్సీకి రిజర్వ్ అయ్యింది. దీంతో ఆయనను తుంగతుర్తి ఇన్చార్జిగా కేసీఆర్ నియమించారు. 2009లో ఎమ్మెల్యేగా ఆయనకు టికెట్ ఖాయమన్న సమయంలో టీడీపీ-టీఆర్ఎస్ పొత్తు కుదిరింది. దీంతో తుంగతుర్తి సీటును పొత్తుల్లో భాగంగా టీడీపీకి కేటాయించారు.
ఇది కూడా చదవండి: Neelam Madhu: భగ్గుమంటోన్న నీలం మధు.. నేడు ఇండిపెండెంట్ గా నామినేషన్!

2009 నుంచి 14 వరకు జరిగిన తెలంగాణ ఉద్యమంలో సామేలు క్రియాశీలకంగా పాల్గొన్నారు. నియోజకవర్గంలో పార్టీని ఆయనే ముందుండి నడిపించారు. 2014లో ఆయన పోటీకి సిద్ధమైన సమయంలో విద్యార్థి ఉద్యమ నేత గాదరి కిశోర్ కుమార్ కు టికెట్ ను కేటాయించారు కేసీఆర్. దీంతో ఆయన అప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్నారు. అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా సామేలుకు అవకాశం దక్కింది. 2018లో అయినా.. తనకు టికెట్ వస్తుందని సామేలు ఆశించారు. కానీ రెండో సారి కూడా కిశోర్ కే టికెట్ దక్కింది. అయితే.. కేటీఆర్ స్వయంగా సామేలుతో మాట్లాడడంతో చల్లబడ్డారు.

publive-image కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతున్న సమయంలో

అయితే.. ఈ సారి తాను తప్పనిసరిగా పోటీ చేస్తానని సామేలు రెండు మూడేళ్లుగా చెబుతూ వస్తున్నారు. ఎమ్మెల్యే కిశోర్ పై కూడా బహిరంగంగానే విమర్శలు చేస్తూ వచ్చారు. ఐదు నెలల క్రితం తుంగతుర్తిలో జరిగిన పార్టీ మీటింగ్ కు హాజరైన కేటీఆర్ కిశోర్ ను మూడో సారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన సామేలు ఆ మరుసటి రోజే పార్టీకి రాజీనామా చేశారు.

సెప్టెంబర్ 17న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. సర్వేల్లో మంచి రిపోర్టు ఉందని.. పని చేసుకోవాలని ఆ సమయంలోనే వెంకట్ రెడ్డి సామేలుకు సూచించారు. చెప్పినట్లుగా 27 మంది అభ్యర్థులు పోటీ పడ్డా కూడా.. సామేలుకే టికెట్ దక్కేలా కోమటిరెడ్డి చక్రం తిప్పారన్న చర్చ ఉమ్మడి నల్గొండ జిల్లాలో జోరుగా సాగుతోంది. అద్దంకి దయాకర్ కు చెక్ పెట్టడం కోసమే సామేలును కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యూహాత్యకంగా తెరపైకి తెచ్చారన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి.

సామేలు బలాలు: 
- స్థానికుడు కావడం
- తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం
-ఉద్యమకారులతో సంబంధాలు
- నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పరిచయాలు
- మాదిగ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి కావడం
- రెండు సార్లు టికెట్ దక్కలేదన్న సానుభూతి

బలహీనతలు:
- కాంగ్రెస్ లో చేరి కొన్ని నెలలే కావడం
- పార్టీలో గ్రూపు రాజకీయాలు
- నియోజకవర్గంలో కాంగ్రెస్ కు సరైన నాయకత్వం లేకపోవడం
- టికెట్ దక్కని 26 మంది సహకారంపై అనుమానాలు
- బీఆర్ఎస్ అభ్యర్థితో పోల్చితే ఆర్థికంగా అంత బలంగా లేకపోవడం

Advertisment
Advertisment
తాజా కథనాలు