/rtv/media/media_files/2026/06/15/maxresdefault-2026-06-15-15-43-01.jpg)
/filters:format(webp)/rtv/media/media_files/2026/05/31/ravi-prakash-2026-05-31-20-05-28.webp)
_ Ravi Prakash
ఈరోజు ఆంథ్రోపిక్ … రేపు ChatGPTనా? ఒక్కసారి ఊహించండి. రేపు ఉదయం మీరు నిద్రలేస్తారు. మొబైల్ తీసుకుంటారు. ఎప్పటిలాగే ChatGPT ఓపెన్ చేస్తారు. కానీ అది ఓపెన్ కాదు. మీరు అనుకుంటారు… బహుశా నెట్‌వర్క్ సమస్యేమో అని మీరనుకుంటారు. మళ్లీ ట్రై చేస్తారు. అయినా పని చేయదు. యాప్ క్లోజ్ చేసి మళ్లీ ఓపెన్ చేస్తారు. అయినా పని చేయదు. కొద్దిసేపటికి సోషల్ మీడియాలో ఒకే చర్చ మొదలవుతుంది. ChatGPT పని చేయడం లేదట. స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ ఇబ్బంది పడుతున్నారు. రిసెర్చర్స్ ఇబ్బంది పడుతున్నారు. జర్నలిస్టులు ఇబ్బంది పడుతున్నారు. వ్యాపార సంస్థలు ఇబ్బంది పడుతున్నాయి. లక్షలాది మంది ఒక్కసారిగా AI సేవలకు దూరమైపోయారు. ఇప్పుడు ఇంకో విషయం ఊహించండి. ఇది టెక్నికల్ సమస్య వల్ల జరగలేదు. సర్వర్లు డౌన్ కాలేదు. సైబర్ దాడి జరగలేదు.
భారత ప్రభుత్వం కూడా దీనిపై ఎలాంటి నిషేధం విధించలేదు. అయితే ఎందుకు జరిగింది. ఎందుకంటే వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రభుత్వం… ఈ టెక్నాలజీని ఎవరు ఉపయోగించాలి, ఎవరు ఉపయోగించకూడదు అనే విషయంలో జోక్యం చేసుకుంది. వినడానికి కాస్త అతిశయోక్తిలా అనిపించవచ్చు. కానీ ఇప్పుడు అది పూర్తిగా ఇంపాజిబుల్. ఎందుకంటే AI ప్రపంచంలో తాజాగా జరిగిన ఒక సంఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ప్రపంచంలో అత్యంత ప్రభావశీలమైన AI కంపెనీలలో ఒకటైన ఆంథ్రోపిక్… తన అత్యాధునిక AI మోడల్స్‌కు సంబంధించిన కీలక ప్రకటన చేసింది. అమెరికా ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో… తమ అత్యంత శక్తివంతమైన AI మోడల్స్ ఫేబుల్ 5, మైథోస్ 5ల యాక్సెస్‌పై పరిమితులు విధించాల్సి వచ్చిందని చెప్పింది.
ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ఎవరూ ChatGPTపై నిషేధం విధించలేదు. ChatGPT రేపు మూసివేస్తారని ఎవరూ చెప్పలేదు. భారతీయులకు ChatGPT అందుబాటులో ఉండదని కూడా ఎలాంటి ప్రకటన లేదు. అయితే ఈ స్టోరీలో అసలు విషయం ఏమిటి? అసలు కథ ChatGPT గురించి కాదు. అసలు కథ ఆంథ్రోపిక్ గురించి కూడా కాదు. అసలు కథ కంట్రోల్ గురించి. ప్రపంచంలోని అత్యంత పవర్‌ఫుల్ టెక్నాలజీపై కంట్రోల్ ఎవరి చేతిలో ఉంటుంది అన్న ప్రశ్న గురించి. ఎవరు డిసైడ్ చేస్తారు..? ఎవరికి యాక్సెస్ ఉండాలి? ఎవరికి ఉండకూడదు? ఏ టెక్నాలజీ సురక్షితం? ఏది ప్రమాదకరం? ఎందుకంటే చరిత్ర మనకు ఒక విషయం చెబుతోంది. ఏదైనా టెక్నాలజీ అత్యంత పవర్‌ఫుల్‌గా మారినప్పుడు… ప్రభుత్వాలు దానిపై ఆసక్తి చూపడం ప్రారంభిస్తాయి. న్యూక్లియర్ టెక్నాలజీ విషయంలో అదే జరిగింది. స్పేస్ టెక్నాలజీ విషయంలో అదే జరిగింది. సూపర్ కంప్యూటర్ల విషయంలో అదే జరిగింది. అత్యాధునిక సెమీకండక్టర్ చిప్‌ల విషయంలో కూడా అదే జరిగింది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే… AI కూడా అదే దారిలో నడుస్తుందా?
ఈ ప్రశ్నకు సమాధానం అవును అయితే… ఈ కథ కేవలం ఒక కంపెనీ కథ కాదు. ఇది భవిష్యత్తు కథ. ఇది ప్రపంచ శక్తి సమీకరణాలు ఎలా మారబోతున్నాయో చెప్పే కథ. ఇది రేపటి ప్రపంచాన్ని ఎవరు ప్రభావితం చేస్తారనే కథ. ఇది భారతదేశానికి కూడా అంతే ముఖ్యమైన కథ. ఎందుకంటే రాబోయే కాలంలో AI ప్రపంచంలో మార్పులు తెలుసుకోవాలంటే ముందుగా మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఆంథ్రోపిక్‌తో అసలు ఏమి జరిగింది? ఎందుకు జరిగింది? అంతకంటే ముఖ్యంగా… ఇది కేవలం ఒక సంఘటనా? లేక ఒక పెద్ద మార్పుకు సంకేతమా?
అదే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం.
అసలు ఆంథ్రోపిక్‌తో ఏమైంది? ఎందుకు ప్రపంచం మొత్తం దీనిపై చర్చిస్తోంది? ఇప్పటివరకు మనం ఈ కథ ఒక కంపెనీ గురించి కాదని అర్థం చేసుకున్నాం. కానీ ఇప్పుడు అసలు ప్రశ్న దగ్గరకు వద్దాం. ఆంథ్రోపిక్‌లో నిజంగా ఏమైంది? ఎందుకు ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ నిపుణులు, విధాన నిర్ణేతలు, పెట్టుబడిదారులు ఈ వార్తను అంత సీరియస్‌గా తీసుకుంటున్నారు? ముందుగా జరిగిందేంటో చూద్దాం. కొన్ని రోజుల క్రితం ఆంథ్రోపిక్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో కంపెనీ ఒక అసాధారణ విషయాన్ని వెల్లడించింది. అమెరికా ప్రభుత్వం నేషనల్ సెక్యూరిటీ పవర్స్ ఉపయోగించి ఒక ఎగుమతి నియంత్రణ ఆదేశం జారీ చేసింది. అత్యంత శక్తివంతమైన US AI మోడల్స్. ఫేబుల్ 5, మైథోస్ 5లకు విదేశీ పౌరుల యాక్సెస్‌ను నిలిపివేయాల్సి వచ్చిందని పేర్కొంది.
ఇక్కడ కాసేపు ఆగి ఆలోచించండి. మనం ఏ విషయం గురించి మాట్లాడుతున్నాం? ఏదైనా క్షిపణి గురించా? ఏదైనా యుద్ధ విమానం గురించా? ఏదైనా అణు సాంకేతికత గురించా? కాదు. మనం ఒక AI మోడల్ గురించి మాట్లాడుతున్నాం. ఇంటర్నెట్ ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఉపయోగించగల సాఫ్ట్‌వేర్ గురించి మాట్లాడుతున్నాం. అందుకే ఈ ఘటన అసాధారణంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటివరకు మనం ఒక విషయం నమ్ముతున్నాం. ఇంటర్నెట్ ప్రపంచంలో సరిహద్దులు ఉండవు అని. అమెరికాలో ఉన్న వ్యక్తి ఉపయోగించే సాఫ్ట్‌వేర్‌ను భారతదేశంలో ఉన్న వ్యక్తి కూడా ఉపయోగిస్తాడు. లండన్‌లో ఉన్న విద్యార్థి ఉపయోగించే టూల్‌ను హైదరాబాద్‌లో ఉన్న విద్యార్థి కూడా ఉపయోగిస్తాడు. అదే డిజిటల్ ప్రపంచం. కానీ ఆంథ్రోపిక్ ఘటన ఒక కొత్త ప్రశ్నను లేవనెత్తింది. AI ప్రపంచంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందా? లేక AIకి సరిహద్దులు ఏర్పడబోతున్నాయా? ఇప్పుడు మరో ముఖ్యమైన విషయం. ఫేబుల్ 5, మైథోస్ 5 అంత ప్రత్యేకమైనవి ఎందుకు? దానికి సమాధానం సులభం.
ఇవి సాధారణ AI మోడళ్లు కావు. ప్రపంచంలోని అత్యంత ఆధునిక AI వ్యవస్థలు. అత్యంత క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాలు ఇట్టే ఇవ్వగలవు. పెద్ద స్థాయిలో విశ్లేషణలు చేయగలవు. సంక్లిష్టమైన కోడ్ రాయగలవు. విశాలమైన సమాచారాన్ని అధ్యయనం చేయగలవు. అంటే ఇవి కేవలం చాట్‌బాట్‌లు కావు. భవిష్యత్తు మేధో సామర్థ్యాల వైపు వెళ్తున్న సాంకేతిక పరిణామంలో కీలకమైన అడుగులు. అందుకే ప్రభుత్వాలు వీటిని గమనిస్తున్నాయి. ఇప్పుడు అమెరికా ప్రభుత్వ ఆందోళన ఏమిటి? వివిధ నివేదికల ప్రకారం ఈ ఆందోళన ప్రధానంగా సైబర్ భద్రతకు సంబంధించినదిగా చెబుతున్నారు. అత్యంత శక్తివంతమైన AI మోడళ్లు సాఫ్ట్‌వేర్ బలహీనతలను గుర్తించడంలో, లేదా సైబర్ కార్యకలాపాల్లో ఉపయోగపడే అవకాశం ఉందనే భయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఆంథ్రోపిక్ మాత్రం ఈ నిర్ణయం వెనుక కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని చెబుతోంది. అంటే చర్చ ఇంకా కొనసాగుతోంది. ఎవరు సరైనవారు? ఎవరు తప్పు? అది ప్రస్తుతం మన ప్రధాన చర్చ కాదు. మనం ఇక్కడ ముఖ్యమైన విషయంపై దృష్టిపెట్టాలి. ఒకవేళ రేపు ఈ ఆంక్షలు తొలగిపోయాయని అనుకుందాం. ఒకవేళ సమస్య పరిష్కారమైందని అనుకుందాం. అయినా దీని ఇంపార్టెన్స్ తగ్గదు. ఎందుకంటే ఈ సంఘటన ప్రపంచానికి ఒక విషయాన్ని స్పష్టంగా చూపించింది. ప్రభుత్వాలు ఇప్పుడు AIను కేవలం ఒక వ్యాపార ఉత్పత్తిగా మాత్రమే చూడటం లేదు. వ్యూహాత్మక సామర్థ్యంగా కూడా చూస్తున్నాయి. అంటే దేశ భద్రతను ప్రభావితం చేయగల సామర్థ్యంగా. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయగల సామర్థ్యంగా. దేశ పోటీ సామర్థ్యాన్ని ప్రభావితం చేయగల శక్తిగా.
ఒకసారి ఏదైనా టెక్నాలజీ ఈ స్థాయికి చేరుకుంటే… ప్రభుత్వాలు కేవలం ప్రేక్షకులుగా ఉండవు. వాటిపై నిఘా పెడతాయి. నియమాలు తీసుకొస్తాయి. అవసరమైతే జోక్యం చేసుకుంటాయి. అదే ఈ కథలోని అతిపెద్ద సంకేతం. అసలు వార్త ఆంథ్రోపిక్‌తో ఏమి జరిగిందన్నది కాదు. అసలు వార్త AIతో ఏమి జరగబోతోంది అని. ప్రపంచం ఇప్పుడు ఒక కొత్త దశలోకి అడుగుపెడుతోందా? లేటెస్ట్ AI మోడళ్లపై ప్రభుత్వాల నియంత్రణ పెరగబోతోందా? AI కూడా ఒకప్పుడు అణు సాంకేతికత, సూపర్ కంప్యూటర్లు, అత్యాధునిక చిప్‌లు నడిచిన దారిలో నడవబోతోందా? అలా అయితే… ఇది కేవలం ఆంథ్రోపిక్ సమస్య కాదు. ఇది రాబోయే దశాబ్దాల గ్లోబల్ చర్చ. ఈ చర్చ ప్రభావం అమెరికాపై మాత్రమే కాదు. భారత్‌పై కూడా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఉంది. అమెరికా ఇలాంటి పని ఇంతకు ముందు ఎప్పుడైనా చేసిందా? ముఖ్యమైన సాంకేతికతలపై ఇలాంటి నియంత్రణలు విధించిన చరిత్ర ఉందా? దానికి సమాధానం... అవును. ఒక్కసారి కాదు. చాలా సార్లు. అదే ఇప్పుడు మనం చూడబోతున్న నెక్స్ట్ చాప్టర్.
అమెరికా ఇలాంటి పని ఇంతకుముందూ చేసింది. AI కూడా ఇప్పుడు అదే దారిలో నడుస్తోందా? ఆంథ్రోపిక్ ఘటన గురించి విన్న తర్వాత చాలామంది ఒక విషయం అనుకుంటున్నారు. ఇది పూర్తిగా న్యూ డెవలప్ మెంట్ అని. కానీ నిజం కాదు. చరిత్రను తిరగేస్తే… అమెరికా మాత్రమే కాదు, ప్రపంచంలోని అనేక పెద్ద దేశాలు కూడా కీలకమైన సాంకేతికతల విషయంలో ఇలాంటి నియంత్రణలు గతంలో ఎన్నోసార్లు అమలు చేశాయి. అందుకే ఆంథ్రోపిక్ ఘటనను అర్థం చేసుకోవాలంటే… ముందుగా చరిత్రను అర్థం చేసుకోవాలి. మనం 1945 సంవత్సరానికి వెళ్దాం. రెండో ప్రపంచ యుద్ధం ముగింపు దశలో ఉంది. అప్పుడు అమెరికా ప్రపంచానికి ఒక కొత్త శక్తిని చూపించింది. అణుబాంబు. ఆ రోజు నుంచి అణు సాంకేతికత కేవలం ఒక శాస్త్రీయ ఆవిష్కరణగా మిగల్లేదు. అది నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన అంశంగా మారిపోయింది. అది వ్యూహాత్మక ఆస్తిగా మారిపోయింది. దాని తర్వాత ఏమైంది? నియంత్రణలు వచ్చాయి. ఆంక్షలు వచ్చాయి. అంతర్జాతీయ ఒప్పందాలు వచ్చాయి. ప్రతి దేశానికి అణు సాంకేతికత అందుబాటులోకి రాలేదు. ఎందుకంటే ప్రపంచ శక్తులు ఒక విషయం అర్థం చేసుకున్నాయి. కొన్ని సాంకేతికతలు చాలా శక్తివంతంగా ఉంటాయి. వాటిని పూర్తిగా స్వేచ్ఛగా వదిలేయలేం. ఇప్పుడు మరో ఉదాహరణ చూద్దాం. సూపర్ కంప్యూటర్స్. ఈరోజు మన చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్ కూడా ఒకప్పుడు ఉన్న సూపర్ కంప్యూటర్ల కంటే ఎక్కువ శక్తివంతంగా ఉండొచ్చు. కానీ ఒకప్పుడు సూపర్ కంప్యూటర్ అనేది వ్యూహాత్మక ఆస్తి. ఎందుకు? ఎందుకంటే వాటిని క్షిపణుల రూపకల్పనలో ఉపయోగించవచ్చు. సైనిక పరిశోధనలో ఉపయోగించవచ్చు. గోప్యమైన శాస్త్రీయ ప్రాజెక్టుల్లో ఉపయోగించవచ్చు. అంటే కంప్యూటింగ్ శక్తి కూడా ఒక దేశ బలాన్ని నిర్ణయించే అంశంగా మారిపోయింది. అందుకే వాటిపైనా నియంత్రణలు వచ్చాయి. ఇప్పుడు మరో ఆసక్తికరమైన ఉదాహరణ. ఎన్‌క్రిప్షన్. ఈరోజు మనం వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపుతున్నాం. ఆన్‌లైన్ బ్యాంకింగ్ చేస్తున్నాం. డిజిటల్ చెల్లింపులు చేస్తున్నాం. ఇవన్నీ ఎన్‌క్రిప్షన్ వల్లే సాధ్యమవుతున్నాయి. కానీ ఒకప్పుడు బలమైన ఎన్‌క్రిప్షన్ టెక్నాలజీని కూడా అమెరికా చాలా సున్నితమైన అంశంగా చూసింది.
దాని ఎగుమతులపై నియంత్రణలు ఉండేవి. ఎందుకంటే అది కూడా భద్రతకు సంబంధించిన అంశమని భావించారు. ఇప్పుడు మనం ఈరోజు ప్రపంచంలో అత్యంత కీలకమైన రంగానికి వస్తాం. సెమీకండక్టర్ చిప్స్. గత కొన్ని సంవత్సరాలుగా అమెరికా-చైనా మధ్య జరుగుతున్న సాంకేతిక పోటీ గురించి మీరు తప్పకుండా విని ఉంటారు. ప్రత్యేకంగా అత్యాధునిక చిప్‌ల విషయంలో. అమెరికా అనేక పరిమితులు విధించింది. కొన్ని రకాల అత్యంత శక్తివంతమైన చిప్‌లు, వాటి తయారీకి అవసరమైన సాంకేతికత చైనాకు అందకుండా చర్యలు తీసుకుంది. ఎందుకు? ఎందుకంటే ఈ చిప్‌లు కేవలం వ్యాపార వస్తువులు కావు. అవి భవిష్యత్తు శక్తికి పునాది. AIకి పునాది. సైనిక సామర్థ్యాలకు పునాది. శాస్త్రీయ పరిశోధనలకు పునాది. అంటే చిప్‌లు కూడా ఇప్పుడు వ్యూహాత్మక ఆస్తులుగా మారిపోయాయి. ఇప్పుడు ఇక్కడే AI కథ ప్రారంభమవుతోంది.
గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలు ప్రధానంగా AIని నిర్మించడానికి అవసరమైన చిప్‌లపై దృష్టి పెట్టాయి. కానీ ఆంథ్రోపిక్ ఘటన ఒక కొత్త ప్రశ్నను లేవనెత్తుతోంది. ఇకపై చిప్‌లపైనే కాదు… AI మోడళ్లపైనా ప్రభుత్వాలు దృష్టి పెడతాయా? AIని నడిపించే యంత్రాలపైనే కాదు… AI అనే డిజిటల్ మేధస్సుపైనా నియంత్రణలు రావచ్చా? అలా అయితే అది చాలా పెద్ద మార్పు. ఎందుకంటే అణు రియాక్టర్ నిర్మించడం కష్టం. మిసైల్ తయారు చేయడం కష్టం. చిప్ ఫ్యాక్టరీ నిర్మించడం కష్టం. కానీ AI మోడల్‌ను ప్రపంచంలో ఎక్కడికైనా ఇంటర్నెట్ ద్వారా అందించడం చాలా సులభం. అందుకే AI చర్చ మరింత క్లిష్టంగా మారుతోంది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ అంశంపై ప్రపంచంలో ఒకే అభిప్రాయం లేదు. కొంతమంది నిపుణులు చెబుతున్నారు… AI ఎంత ఎక్కువ మందికి అందుబాటులో ఉంటే అంత ఎక్కువ ఆవిష్కరణలు జరుగుతాయని.
కొత్త కంపెనీలు వస్తాయని. కొత్త అవకాశాలు వస్తాయని. ఆర్థికాభివృద్ధి వేగవంతమవుతుందని. మరోవైపు ఇంకొందరు వాదిస్తున్నారు… అత్యంత శక్తివంతమైన AI వ్యవస్థలను పూర్తిగా నియంత్రణ లేకుండా వదిలేయడం ప్రమాదకరమని. అంటే చర్చ ఇంకా కొనసాగుతోంది.
కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. AI ఇక కేవలం టెక్నాలజీ చర్చ కాదు. ఇది భద్రతా చర్చ. ఇది ఆర్థిక చర్చ. ఇది వ్యూహాత్మక చర్చ. ఇది భౌగోళిక రాజకీయాల చర్చ. చరిత్ర మనకు ఒక విషయం చెబుతోంది. ఏ సాంకేతికత అయినా ఈ స్థాయికి చేరుకున్నప్పుడు… దాని చుట్టూ నియమాలు వస్తాయి. పరిమితులు వస్తాయి. ప్రభుత్వాల జోక్యం పెరుగుతుంది. అందుకే మనం బహుశా AI చరిత్రలో ఒక కీలక మలుపు దగ్గర నిలబడి ఉండవచ్చు. కానీ ఇప్పుడు అత్యంత ముఖ్యమైన ప్రశ్న. ఈ మొత్తం కథలో భారత్ ఎక్కడ నిలబడి ఉంది? భారత్ ఆందోళన చెందాలా? భారత్ కేవలం వినియోగదారుడిగా మిగిలిపోతుందా? లేక ఈ కొత్త AI పోటీలో తనదైన స్థానం సంపాదించగలదా? ఎందుకంటే AI నిజంగా 21వ శతాబ్దపు అత్యంత కీలక వ్యూహాత్మక శక్తిగా మారితే… ఈ ప్రశ్న కేవలం అమెరికా, చైనా గురించి కాదు. ఇది భారతదేశ భవిష్యత్తు గురించి కూడా. అదే ఇప్పుడు మనం చూడబోయే నెక్స్ట్ ఎపిసోడ్.
ఇండియా ఈ కథను ఎందుకు చాలా సీరియస్‌గా తీసుకోవాలి? ఎందుకంటే మనం ఇలాంటి పరిస్థితులను గతంలో కూడా ఎదుర్కొన్నాం. ఇప్పటివరకు మనం ఒక విషయం అర్థం చేసుకున్నాం. ఆంథ్రోపిక్ ఘటన కేవలం ఒక కంపెనీకి సంబంధించిన విషయం కాదు. ఇది AI భవిష్యత్తుకు సంబంధించిన చర్చ. ఇప్పుడు అసలు ప్రశ్న. భారత్ దీనిని ఎందుకు పట్టించుకోవాలి? ఇది అమెరికా సమస్య కదా? ఇది ఒక అమెరికన్ కంపెనీకి సంబంధించిన విషయం కదా? మనకు దీనితో సంబంధం ఏమిటి? సమాధానం చాలా సులభం. ఈ ప్రపంచంలో సాంకేతికంగా ఆధారపడితే వచ్చే ప్రమాదాలను బాగా అర్థం చేసుకున్న దేశాల్లో భారత్ ఒకటి. ఎందుకంటే మన చరిత్రలో ఇలాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి అనుభవం మనకు ఒకే పాఠాన్ని నేర్పింది. ఒక సాంకేతికత వ్యూహాత్మక స్థాయికి చేరుకున్న తర్వాత… దాని యాక్సెస్ ఎప్పటికీ గ్యారంటీ కాదు. ముందుగా ఇస్రో కథను గుర్తు చేసుకుందాం. ఈరోజు మనం చంద్రయాన్ గురించి గర్వంగా మాట్లాడుతున్నాం. మంగళయాన్ గురించి గర్వంగా మాట్లాడుతున్నాం. ప్రపంచ దేశాలు భారత అంతరిక్ష కార్యక్రమాన్ని ప్రశంసిస్తున్నాయి. కానీ ఈ విజయాలు ఒక్కరోజులో రాలేదు. ఒకప్పుడు భారత్‌కు క్రయోజెనిక్ ఇంజిన్ టెక్నాలజీ అవసరమైంది. అది భారత అంతరిక్ష కార్యక్రమానికి చాలా కీలకం.
కానీ ఆ టెక్నాలజీ పొందడం అంత సులభం కాలేదు. అంతర్జాతీయ ఒత్తిళ్లు వచ్చాయి. పరిమితులు వచ్చాయి. సాంకేతిక బదిలీలపై అడ్డంకులు వచ్చాయి. ఆ సమయంలో భారత్ ఒక విషయం గ్రహించింది. అత్యంత ముఖ్యమైన సాంకేతికతల విషయంలో ఇతరులపై పూర్తిగా ఆధారపడటం ప్రమాదకరం. అందుకే భారత్ తన స్వంత సామర్థ్యాన్ని అభివృద్ధి చేసింది. సంవత్సరాల తరబడి శ్రమించింది. ఈరోజు దాని ఫలితాలు మన కళ్లముందే ఉన్నాయి. ఇప్పుడు మరో ఉదాహరణ. పోఖ్రాన్ అణు పరీక్షలు. భారత్ అణు పరీక్షలు నిర్వహించిన తర్వాత ఏమైంది? అంతర్జాతీయ ఆంక్షలు వచ్చాయి. సాంకేతిక సహకారంపై ప్రభావం పడింది. కొన్ని రంగాల్లో యాక్సెస్ కష్టమైంది. ఆ సమయంలో కూడా భారత్ ఒక పాఠం నేర్చుకుంది. వ్యూహాత్మక రంగాల్లో స్వయం సామర్థ్యం ఎంత ముఖ్యమో.!
ఇప్పుడు డిఫెన్స్ రంగాన్ని చూడండి. దశాబ్దాలుగా భారత్ ప్రపంచంలోని అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుల్లో ఒకటి. ఇప్పటికీ అనేక రక్షణ పరికరాలు విదేశాల నుంచి వస్తున్నాయి. కానీ గత కొన్ని సంవత్సరాలుగా భారత్ ఒక విషయంపై ప్రత్యేక దృష్టి పెడుతోంది. అదే మేకిన్ ఇండియా. ఎందుకు? ఎందుకంటే ఏ పెద్ద దేశం తన భద్రతను పూర్తిగా ఇతరుల చేతుల్లో పెట్టదు. అదే సూత్రం ఇక్కడ కూడా వర్తిస్తుంది. ఇప్పుడు ఒక ఆధునిక ఉదాహరణ చూద్దాం. ఈరోజు కోట్లాది భారతీయులు రోజూ UPI ఉపయోగిస్తున్నారు. టీ దుకాణం నుంచి పెద్ద వ్యాపారం వరకు. అందరూ UPI వాడుతున్నారు. ఒక్కసారి ఊహించండి. భారత్ మొత్తం డిజిటల్ చెల్లింపు వ్యవస్థ ఒక విదేశీ కంపెనీ నియంత్రణలో ఉండి ఉంటే? ఒకరోజు ఆ కంపెనీ నిబంధనలు మార్చితే? సేవలపై పరిమితులు విధిస్తే? ధరలు పెంచితే? అప్పుడు పరిస్థితి ఎలా ఉండేది? అందుకే UPIని కేవలం ఒక చెల్లింపు వ్యవస్థగా మాత్రమే చూడరు. దాన్ని భారత డిజిటల్ స్వావలంబనకు ఒక ఉదాహరణగా చూస్తారు. ఇప్పుడు అదే సూత్రాన్ని AIకి అప్లై చేయండి. ఈరోజు భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద AI వినియోగదారుల్లో ఒకటి. విద్యార్థులు AI వాడుతున్నారు. స్టార్టప్‌లు AI వాడుతున్నాయి. జర్నలిస్టులు AI వాడుతున్నారు. సాఫ్ట్‌వేర్ కంపెనీలు AI వాడుతున్నాయి. బ్యాంకులు AIతో ప్రయోగాలు చేస్తున్నాయి. ప్రభుత్వ విభాగాలు AI వినియోగంపై ఆలోచిస్తున్నాయి. అంటే AI నెమ్మది నెమ్మదిగా మన ఆర్థిక వ్యవస్థలో, మన సమాజంలో కీలక భాగంగా మారుతోంది.
కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన తేడా ఉంది. AIను ఉపయోగించడం ఒక విషయం. AIను నిర్మించడం మరో విషయం. మొబైల్ ఫోన్ వాడటం ఒక విషయం. మొబైల్ ఫోన్ తయారు చేయడం మరో విషయం. కారు నడపడం ఒక విషయం. కారు తయారు చేయడం మరో విషయం. అలాగే AIతో పని చేయడం ఒక విషయం. ప్రపంచ స్థాయి AI మోడళ్లను అభివృద్ధి చేయడం మరో విషయం. అక్కడే భారత్ ముందున్న అసలు సవాలు ఉంది. అదే సమయంలో గొప్ప అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ప్రపంచం ఇప్పుడు ఒక కొత్త పోటీలోకి ప్రవేశించింది. AI పోటీ. అమెరికా ముందుంది. చైనా వేగంగా దూసుకుపోతోంది. యూరప్ తన వ్యూహాన్ని రూపొందిస్తోంది. మధ్యప్రాచ్య దేశాలు బిలియన్ల డాలర్లు పెట్టుబడులు పెడుతున్నాయి. అలాంటి సమయంలో భారత్ ఏం చేయబోతోంది? కేవలం వినియోగదారుడిగా మిగిలిపోతుందా? లేక సృష్టికర్తగా కూడా మారుతుందా? కేవలం ఇతర దేశాల AI మోడళ్లను వాడుతుందా? లేక తన స్వంత AI మోడళ్లను కూడా నిర్మిస్తుందా? కేవలం టెక్నాలజీని కొనుగోలు చేస్తుందా? లేక టెక్నాలజీని సృష్టిస్తుందా? ఈ ప్రశ్నలు ఈరోజు చాలా కీలకమైనవి. అందుకే ఆంథ్రోపిక్ ఘటనను భారత్ ఒక హెచ్చరికగా చూడొచ్చు. భయపడాల్సిన అవసరం లేదు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ ఆలోచించాల్సిన అవసరం మాత్రం ఉంది. ఎందుకంటే ఈ ఘటన మనకు ఒక విషయాన్ని గుర్తు చేసింది. ప్రపంచంలోని అత్యంత కీలకమైన సాంకేతికతలపై నియంత్రణ ఎప్పుడూ పూర్తిగా సాంకేతిక విషయం కాదు. అది రాజకీయ విషయం కూడా. అది వ్యూహాత్మక విషయం కూడా. అది జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన విషయం కూడా. అందుకే అసలు ప్రశ్న ఆంథ్రోపిక్‌తో ఏమి జరిగిందనేది కాదు. అసలు ప్రశ్న రాబోయే పది సంవత్సరాల్లో AI ప్రపంచం ఎలా ఉండబోతోందన్నది. AI కొత్త అవకాశాలను తెరవబోతోందా? లేక కొత్త అసమానతలను సృష్టించబోతోందా? ప్రపంచం AIని పంచుకుంటుందా? లేక కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమవుతుందా? అత్యంత ముఖ్యమైన ప్రశ్న… AI రాబోయే కాలంలో Oil కంటే కూడా విలువైన వ్యూహాత్మక వనరుగా మారుతుందా? అలా అయితే… ఈ కథ ఆంథ్రోపిక్ కంటే చాలా పెద్దది. ఇక్కడి నుంచే మన చివరి ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది.
అసలు కథ ఆంథ్రోపిక్ గురించి కాదు. అసలు కథ తెలివితేటలపై ఆధిపత్యం కోసం జరుగుతున్న పోటీ గురించి. ఇప్పుడు ఒక్కసారి మొత్తం వెనక్కి వెళ్లి చూద్దాం. ఎందుకంటే ఈ వీడియో ఇక్కడివరకు చూసిన తర్వాత మీకు కూడా ఒక విషయం అర్థమై ఉంటుంది. ఇది ఇక ఆంథ్రోపిక్ కథ కాదు. ఇది ఫేబుల్ 5 కథ కాదు. ఇది మైథోస్ 5 కథ కాదు. ఇది కేవలం ChatGPT కథ కూడా కాదు. అసలు కథ చాలా పెద్దది. అసలు కథ శక్తి గురించి. భవిష్యత్తులో ప్రపంచ శక్తి ఎవరి చేతిలో ఉండబోతోందన్న దాని గురించి. చరిత్రను ఒకసారి తిరగేస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి యుగంలో ప్రపంచ దేశాలు ఏదో ఒక కీలక వనరుపై ఆధిపత్యం కోసం పోటీ పడ్డాయి. ఒకప్పుడు భూముల కోసం యుద్ధాలు జరిగాయి. మరో సమయంలో సముద్ర మార్గాల కోసం పోటీ జరిగింది. ఆ తర్వాత Oil కోసం ప్రపంచ రాజకీయాలు మారిపోయాయి. కానీ 21వ శతాబ్దంలో ఒక కొత్త వనరు వెలుగులోకి వస్తోంది. ఆ వనరు పేరు — ఇంటలిజెన్స్ అవును… కేవలం మనుషుల తెలివితేటలు కాదు. యంత్రాల తెలివితేటలు. నేర్చుకునే మిషన్స్. అర్థం చేసుకునే మిషన్స్. విశ్లేషించే మిషన్స్. కోడ్ రాసే మిషన్స్. కొత్త మందుల పరిశోధనలో సహాయపడే మిషన్స్. శాస్త్రీయ ఆవిష్కరణలకు తోడ్పడే మిషన్స్. వ్యాపారాలను మార్చగల మిషన్స్. ప్రభుత్వాల పనితీరును మార్చగల మిషన్స్.
రాబోయే సంవత్సరాల్లో మనం ఊహించలేని స్థాయిలో ప్రభావం చూపగల మిషన్స్. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి సాంకేతికతలో ఒక దేశం అందరికంటే ముందుకు వెళితే ఏమవుతుంది? ఆ దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా ఎదగవచ్చు. ఆ దేశ కంపెనీలు మరింత బలపడవచ్చు. ఆ దేశ పరిశోధనా సామర్థ్యం పెరగవచ్చు. ఆ దేశ రక్షణ వ్యవస్థ మరింత శక్తివంతం కావచ్చు. ప్రపంచ వేదికపై ఆ దేశ ప్రభావం పెరగవచ్చు. అందుకే అమెరికా… చైనా… యూరప్… గల్ఫ్ దేశాలతో పాటు… ప్రపంచంలోని అనేక శక్తివంతమైన దేశాలు AI కోసం బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తున్నాయి. వాళ్లు కేవలం ఒక కొత్త టెక్నాలజీలో పెట్టుబడి పెట్టడం లేదు. భవిష్యత్తు శక్తిలో పెట్టుబడి పెడుతున్నారు. అందుకే ఆంథ్రోపిక్ ఘటనకు అంత ప్రాధాన్యత వచ్చింది. ఎందుకంటే అది మనకు ఒక సంకేతాన్ని ఇస్తోంది. చాలా పెద్ద సంకేతాన్ని. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన AI మోడల్స్‌ను ఇకపై కేవలం వ్యాపార ఉత్పత్తులుగా మాత్రమే చూడకపోవచ్చు. వాటిని వ్యూహాత్మక ఆస్తులుగా కూడా చూడవచ్చు. ఒకసారి ఏదైనా వ్యూహాత్మక ఆస్తిగా మారితే… ప్రభుత్వాలు రంగంలోకి దిగుతాయి. నిబంధనలు వస్తాయి. పరిమితులు వస్తాయి. నియంత్రణ పెరుగుతుంది. రాజకీయాలు కూడా ప్రవేశిస్తాయి. ఇప్పుడు మళ్లీ మనం మొదట అడిగిన ప్రశ్న దగ్గరకు వెళ్దాం. ఆంథ్రోపిక్ ఈరోజు… రేపు ChatGPTనా? నిజం ఏమిటి? నిజం ఏమిటంటే… ప్రస్తుతం ChatGPTపై ఆంక్షలు రాబోతున్నాయనే సమాచారం లేదు. అలాంటి ప్రకటన లేదు. అలాంటి సంకేతాలు కూడా లేవు.
అందరికీ ఒకే విధంగా
ఆధారాలు లేకుండా ఏదైనా చెప్పడం బాధ్యతాయుతమైన జర్నలిజం కాదు. అది మనం గుర్తుంచుకోవాలి. అయితే మరో వాస్తవం కూడా ఉంది. ఆంథ్రోపిక్ ఘటన ఒక విషయం మాత్రం ప్రపంచానికి స్పష్టంగా చూపించింది. అదేంటంటే… ప్రభుత్వాల దగ్గర జోక్యం చేసుకునే శక్తి ఉంది. అదే ఈ మొత్తం కథలో అత్యంత ముఖ్యమైన అంశం. కాబట్టి అసలు ప్రశ్న ChatGPT తర్వాతిదా కాదా అనేది కాదు. అసలు ప్రశ్న ఏమిటంటే… భవిష్యత్తులో అత్యాధునిక AI వ్యవస్థలకు అందరికీ ఒకే విధంగా స్వేచ్ఛగా యాక్సెస్ ఉంటుందా? లేక ఇతర వ్యూహాత్మక సాంకేతికతల మాదిరిగానే వాటిపైనా నియంత్రణలు పెరుగుతాయా? ఈ ప్రశ్నకు సమాధానం ఈరోజు ఎవరికీ తెలియదు. కానీ చర్చ మాత్రం ప్రారంభమైంది. రాబోయే సంవత్సరాల్లో ఈ చర్చ మరింత పెద్దదవుతుంది. ఇప్పుడు భారతదేశం గురించి మాట్లాడుకుందాం. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ సమాజాల్లో ఒకటి. మన దగ్గర ప్రతిభ ఉంది. ఇంజినీర్లు ఉన్నారు. స్టార్టప్‌లు ఉన్నాయి. యువత ఉంది. అవకాశాలు ఉన్నాయి. కానీ అవకాశాలు ఉన్నంత మాత్రాన విజయం రాదు. దానికి దూరదృష్టి కావాలి. పెట్టుబడులు కావాలి. దీర్ఘకాలిక ప్రణాళిక కావాలి. ముఖ్యంగా సమయానికి సిద్ధం కావాలి. ఎందుకంటే చరిత్ర మనకు ఒక విషయం మళ్లీ మళ్లీ చెబుతోంది. సాంకేతికతను ఉపయోగించే దేశాలు అభివృద్ధి చెందుతాయి. కానీ సాంకేతికతను సృష్టించే దేశాలు భవిష్యత్తును నిర్ణయిస్తాయి. బహుశా ఇదే ఈ మొత్తం కథలోని అతిపెద్ద సందేశం.
AIను ఉపయోగించడం ముఖ్యం. కానీ AIను నిర్మించడం ఇంకా ముఖ్యమైనది. AIను అర్థం చేసుకోవడం అవసరం. కానీ AIలో నాయకత్వం సాధించడం అంతకంటే అవసరం. ఎందుకంటే రాబోయే సంవత్సరాల్లో పోటీ కేవలం మార్కెట్లలో ఉండదు. కేవలం సరిహద్దుల్లో ఉండదు. కేవలం వాణిజ్యంలో ఉండదు. తెలివితేటలలో కూడా ఉంటుంది. ఆ పోటీలో ముందుండే దేశాలే రేపటి ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే ఆంథ్రోపిక్ వార్తను కేవలం ఒక టెక్ కంపెనీ సమస్యగా చూడకండి. దాన్ని ఒక హెచ్చరికగా చూడండి. భవిష్యత్తు ఎలా ఉండబోతోందో చూపిస్తున్న ఒక సంకేతంగా చూడండి. ఆ భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కేవలం ఒక యాప్ కాదు. కేవలం ఒక చాట్‌బాట్ కాదు. కేవలం ఒక టెక్నాలజీ కాదు. ఒక దేశ శక్తిని నిర్ణయించే కీలక సాధనం. బహుశా అందుకే ఈ అంశం అంత ఇంపార్టెంట్ అయ్యింది. ఆంథ్రోపిక్ కాదు. ChatGPT కాదు. మన ముందుకు తెచ్చిన పెద్ద ప్రశ్న..
21వ శతాబ్దంలో అత్యంత శక్తివంతమైన దేశాలు ఎవరు? అయిల్ ఉన్న దేశాలా? మోడ్రన్ వెపన్స్ ఉన్న దేశాలా? లేక ఇంటలిజెన్స్‌ను క్రియేట్ చేసి కంట్రోల్ చేయగల సామర్థ్యం ఉన్న దేశాలా? ఆ ప్రశ్నకు సమాధానం భవిష్యత్తులో ఉంది. కానీ ఒక విషయం మాత్రం ఖాయం. ఆ భవిష్యత్తు కోసం పోటీ ఇప్పటికే మొదలైంది.
Follow Us