ఫోన్లలో యాప్స్ యుగానికి ఎండ్ కార్డ్.. రాబోతున్న AI ఏజెంట్ల విప్లవం!

ఇకపై ఆ అవసరం లేకుండా నేరుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లతో మాట్లాడి మన పనులు ముగించుకునే రోజులు రాబోతున్నాయి. ఈ సరికొత్త ఏఐ రేసులో పైచేయి సాధించేందుకు టెక్ దిగ్గజాలు గూగుల్, ఓపెన్ ఏఐ కంపెనీలు హోరాహోరీగా తలపడుతున్నాయి.

New Update
Ai

మనం వాడుతున్న స్మార్ట్‌ఫోన్ల ప్రపంచం ఒక చారిత్రాత్మక మార్పునకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు మనకు ఏ అవసరం వచ్చినా వేర్వేరు మొబైల్ అప్లికేషన్లు ఓపెన్ చేసి వాడుతున్నాం కదా.. ఇకపై ఆ అవసరం లేకుండా నేరుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లతో మాట్లాడి మన పనులు ముగించుకునే రోజులు రాబోతున్నాయి. ఈ సరికొత్త ఏఐ రేసులో పైచేయి సాధించేందుకు టెక్ దిగ్గజాలు గూగుల్, ఓపెన్ ఏఐ కంపెనీలు హోరాహోరీగా తలపడుతున్నాయి.

గూగుల్ తాజాగా నిర్వహించిన ఆండ్రాయిడ్ షో 2026 వేదికగా గూగుల్ జెమినై ఇంటెలిజెన్స్ ను అధికారికంగా పరిచయం చేసింది. ఇది ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కోసం తయారు చేసిన ఒక పవర్‌ఫుల్ ఏఐ లేయర్. కేవలం సాఫ్ట్‌వేర్‌గా ఉన్న ఆండ్రాయిడ్‌ను, పూర్తిస్థాయి తెలివైన ఇంటెలిజెన్స్ సిస్టమ్‌గా మార్చడమే గూగుల్ లక్ష్యం. ఇది మనం ఏం చేయాలనుకుంటున్నామో ముందే ఊహించి, మన ఫోన్లలోని రకరకాల యాప్స్ ద్వారా ఆ పనులను ఆటోమేటిక్‌గా పూర్తి చేస్తుంది. ఈ ఏడాది చివర్లో మార్కెట్లోకి రానున్న శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్‌26 , గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ ఫోన్లలో ఈ ఏఐ ఫీచర్లు తొలిసారి అందుబాటులోకి రానున్నాయి.

గూగుల్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు యాపిల్ కంపెనీ మాజీ ఐకానిక్ డిజైనర్ జోనీ ఐవ్‌తో కలిసి ఓపెన్ ఏఐ ఒక సరికొత్త ఏఐ స్మార్ట్‌ఫోన్‌ను వేగంగా తయారు చేస్తోంది. అసలు స్క్రీన్‌లు, పాతకాలపు యాప్స్ అవసరం లేకుండా.. కేవలం మాటలు, సైగలతో నడిచే సరికొత్త డివైస్‌లను వీరు రూపుదిద్దుతున్నారు. ఇందుకోసం జోనీ ఐవ్‌కు చెందిన ఐఓ అనే స్టార్టప్‌ను ఓపెన్ ఏఐ ఏకంగా రూ. 53 వేల కోట్ల భారీ డీల్‌తో కొనుగోలు చేసింది. హార్డ్‌వేర్ రంగంలో ఓపెన్ ఏఐ వేసిన అతిపెద్ద అడుగు ఇదే.

ఈ ఏఐ ఏజెంట్లు మనుషుల తరహాలోనే స్క్రీన్‌పై ట్యాప్ చేయడం, స్వైప్ చేయడం వంటివి స్వంతంగా చేయగలవు. అంటే, మీరు ఒక మాట చెబితే చాలు.. కిరాణా సామాగ్రి ఆర్డర్ చేయడం, ఆన్‌లైన్ అప్లికేషన్లు నింపడం, డాక్టర్ అపాయింట్‌మెంట్‌లు బుక్ చేయడం వంటి పనులను మీ ఫోన్ స్క్రీన్‌ను తాకాల్సిన అవసరం లేకుండానే ఏఐ పూర్తి చేస్తుంది. ఒకే ఒక్క కమాండ్‌తో చాలా స్టెప్స్ ఉన్న పనులను కూడా ఏఐ చిటికెలో పూర్తి చేస్తుంది. మీరు ఎక్కడున్నారు, మీ అలవాట్లు ఏంటి, స్క్రీన్‌పై ఏం చూస్తున్నారు అనే విషయాలను బట్టి ఏఐ ముందే అలర్ట్ చేస్తుంది. భవిష్యత్తులో స్మార్ట్ వాచీలు, కార్లు, ల్యాప్‌టాప్‌లలోకి కూడా ఈ జెమినై ఇంటెలిజెన్స్ రానుంది.

ఇండియాపై ఏఐ విప్లవం

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్ అయిన  ఇండియాపై ఈ ఏఐ విప్లవం తీవ్ర ప్రభావం చూపనుంది. ఇండియాలో ఆండ్రాయిడ్ ఫోన్లు వాడేవారే ఎక్కువ. శామ్‌సంగ్, షావోమి, వన్‌ప్లస్ వంటి బ్రాండ్ల ద్వారా ఏఐ ఫోన్లకు భారత్ ఒక పెద్ద అడ్డాగా మారబోతోంది. వచ్చే వారం జరగబోయే ప్రతిష్టాత్మక గూగుల్ ఐ/ఓ 2026 (Google I/O 2026) సదస్సులో ఆండ్రాయిడ్ 17, జెమినై ఏఐకి సంబంధించిన మరిన్ని సంచలన అప్‌డేట్‌లను గూగుల్ ప్రకటించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు