Team India: టీమిండియా ఎందుకు ఓడిపోయింది? సౌతాఫ్రికాతో తోడుగా మనమూ ఉన్నామా? ప్రపంచకప్ ఫైనల్ లో ఓటమికి కారణాలు చాలా ఉండవచ్చు. కానీ నాకౌట్ లలో ఓడిపోవడంలో మనం సౌతాఫ్రికాకు ఏమాత్రం తీసిపోము. 2014 నుంచి ఇప్పటివరకూ ప్రతి సంవత్సరం ప్రతి టోర్నీలోనూ నాకౌట్ దశలో టీమిండియా ఓడిపోతూనే ఉంది. ఇప్పటికైనా నాకౌట్ టెన్షన్ నుంచి బయటపడకపోతే అంతే సంగతులు. By KVD Varma 20 Nov 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Team India: విజయాల మెట్ల మీద నుంచి పరాజయం అగాధంలో పడిపోయిన ఒక కథ ముగిసింది. వరుస విజయాలతో తిరుగులేని స్థితి నుంచి ఒకే ఒక్క ఓటమితో.. తలలు వేలాడేసుకోవాల్సిన పరిస్థితి టీమిండియా అభిమానులది. ఆ బాధను తట్టుకోవడం చాలా కష్టమైన పని. ఒక్క మ్యాచ్ తో నిరాశ.. ఒక్క ఓటమితో అసహనం.. ఒకే ఒక్క పరాజయం తీసుకువచ్చిన అవమాన భారం వీటిని మర్చిపోవడానికి మనకు చాలా కాలం పడుతుంది. ఇక ఇప్పుడు అందరూ పోస్ట్ మార్టం మొదలు పెట్టారు. ఓటమికి కారణాలు వెతుకుతూ రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. కొందరు ఫీల్డింగ్ పేలవంగా ఉందని చెబుతున్నారు. మరికొందరు ఆల్ రౌండర్ పాండ్యా లేకపోవడం ఓటమికి కారణం అంటున్నారు. ఇంకొందరు టీమిండియా చేజేతులా ఓటమిని తెచ్చుకుంది అని అంటున్నారు. అయితే, మన టీమ్ గురించి నిర్మొహమాటంగా చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అది ఒత్తిడిని తట్టుకోలేక చేతులెత్తేయడం.. అవును.. ఒకసారి కాదు రెండుసార్లు కాదు 2014నుంచి జరిగిన ఐసీసీ టోర్నీల్లో నాకౌట్ దశలోనే ఇంటిబాట పట్టింది టీమిండియా. ఫస్ట్ నుంచి చాలా బాగా ఆడతారు. పెద్ద పెద్ద టీమ్ లను లీగ్ దశలో మట్టి కరిస్తారు. నాకౌట్ కు చేరుకుంటారు. కానీ అక్కడ వాళ్ళకు ఏదో అయిపోతోంది. అప్పటి వరకూ చాలా బాగా ఆడినవారు కూడా చెత్త ప్రదర్శన చేస్తారు. ఇదీ సౌతాఫ్రికా పరిస్థితి. ఈ మాటను మనం చాలా సార్లు చెప్పుకుంటాం. ఆ జట్టుతో పాటు టీమిండియా కూడా అంతే. కాస్త ఇబ్బందిగా ఉన్నా ఇది చెప్పకతప్పదు. చోకర్స్ అంటూ మనం సౌతాఫ్రికాను అంటాం.. కానీ, మనం కూడా అందుకు అతీతులం కాదు. మన టీమిండియా(Team India) ప్రదర్శన గమనిస్తే ఇది నిజమే అని అందరూ ఒప్పుకు తీరతారు. ఒత్తిడిని గెలవడమే నాకౌట్ మ్యాచ్ లలో విజయానికి పునాది అని చెప్పవచ్చు.. ఇంకా చెప్పాలంటే ఒత్తిడి లేకుండా ఆడగలగడమే సగం విజయాన్ని తెచ్చి పెడుతుంది నాకౌట్ మ్యాచ్ లలో. ఇప్పుడు మనం భారత్ 2014 నుంచి ఎలా ఒత్తిడికి తలవంచిందో పరిశీలన చేద్దాం. మొదటిది.. 2014 లో టీ20 వరల్డ్ కప్ ఫైనల్.. శ్రీలంక-భారత్ మధ్య.. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 4 వికెట్లను 130 పరుగులు చేసింది. తరువాత శ్రీలంక 17.5 ఓవర్లలోనే టార్గెట్ రీచ్ అయింది. భారత్ నుంచి కొహ్లీ ఒక్కడే 77 పరుగులు చేశాడు. ఇక టీ20ల్లో 130 పరుగులు పెద్ద స్కోర్ కాదనే విషయం తెలిసిందే. కోహ్లీ తరువాత రోహిత్ మాత్రమే ఓమోస్తరు గా 29 పరుగులు చేశాడు. Also Read: ఇంత బ్యాడ్ లక్ ఉన్న జట్టు మరొకటి ఉండదేమో.. రెండోది.. 2015 లో వరల్డ్ కప్ సెమీఫైనల్స్.. ఆస్ట్రేలియా పై పోటీ.. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 7 వికెట్లను 328 పరుగులు చేసింది. ప్రతిగా భారత్ 46.5 ఓవరల్లోనే కుప్పకూలింది. కేవలం 233 పరుగులు చేసి భారీ పరాజయం మూటగట్టుకుంది. మూడోది.. 2016 వరల్డ్ కప్ టీ20 సెమీ ఫైనల్స్. వెస్టిండీస్ తో.. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 192 పరుగుల భారీ లక్ష్యాన్ని విండీస్ ముందుంచింది. కానీ, ఆ ఆనందం ఎంతో సేపు లేదు.. హార్దిక్ పాండ్య, జడేజా, బుమ్రా భారీగా పరుగులు సమర్పించుకోవడంతో ఓటమి తప్పలేదు. నాలుగోది.. ఇది నాకౌట్ పోటీల్లో భారత్ ఎప్పటికీ మర్చిపోలేని ఓటమి. 2017లో ICC ఛాంపియన్స్ ట్రోఫీ.. ప్రత్యర్థి పాకిస్తాన్. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 4 వికెట్లను 338 పరుగులు చేసింది. తరువాత ఛేజింగ్ లో భారత్ కుప్పకూలింది. కష్టంమ్మీద 30.3 ఓవర్లు బ్యాటింగ్ చేసిన భారత్ 158 పరుగులకు చేతులెత్తేసింది. హార్దిక్ పాండ్యా 76 (43 బాల్స్ లో ) తప్ప మిగిలిన బ్యాట్స్ మెన్ అందరూ ఫెయిల్ అయ్యారు. ఐదోది.. 2019 వరల్డ్ కప్ సెమీస్.. ప్రత్యర్థి న్యూజీలాండ్.. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ 8 వికెట్లకు 239 పరుగులు చేసింది. ఆ స్వల్ప స్కోర్ ను ఛేదించలేక చతికల పడింది టీమిండియా. 221 పరుగులకు ఆలౌట్ అయి పోటీ నుంచి తప్పుకుంది. ఆరోది.. గతేడాది టీ20 వరల్డ్ కప్ సెమీస్.. ఈసారి ఇంగ్లాండ్ చేతిలో ఓటమి. ఈ మ్యాచ్ లో కోహ్లీ, పాండ్య అర్థ సెంచరీలతో రాణించినా.. 168 పరుగులు మాత్రమే చేయగలిగింది. ప్రతిగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ సునాయాసంగా ఒక్క వికెట్ కోల్పోకుండా.. 16 ఓవర్లలోనే టార్గెట్ చేరుకుని టీమిండియా(Team India)ను ఇంటికి పంపించింది. చూశారుగా దాదాపుగా ప్రతి సంవత్సరం.. కీలకమైన మ్యాచ్ లలో భారత్ ఫెయిల్ అవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోచోకర్స్ అనే పదం కొద్దిగా కష్టంగా అయినా టీమిండియా గురించి కూడా చెప్పుకోవాల్సి వస్తోంది. గెలుపు ఓటములు ఆటల్లో సహజం. కానీ క్రికెట్ ని శ్వాసిస్తూ.. టీమిండియా అంటే పడి చచ్చిపోయే అభిమానులు ఉన్న మన దేశంలో ఒత్తిడికి టీమిండియా లొంగిపోతోంది అనే చేదు నిజం ఎక్కడో గుచ్చుకుంటోంది. ఇకనైనా టీమిండియా.. బోర్డు పెద్దలు ఈ విషయంపై కాస్త దృష్టి పెడితే.. రాబోయే రోజుల్లో వచ్చే కప్పులు సగర్వంగా తీసుకురాగలుగుతుంది టీమిండియా. ఇది సగటు క్రికెట్ అభిమాని కోరిక. Watch this interesting video: #cricket #team-india మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి