TDP and Janasena : ఇద్దరూ ఇద్దరే! అవమానాల నుంచి అందిపుచ్చుకున్న అవకాశం.. చంద్రబాబు నాయుడు.. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెప్పర్ సాల్ట్ కాంబినేషన్. అవమానాల కారాన్ని దిగమింగి.. వైసీపీ బలహీనతలపై పోరాడి.. తీయని అధికార ఫలాల్ని అందుకున్న అరుదైన అనుభవం-యువ ఆవేశాల కలయిక ఇది. ఇదెలా సాధ్యం అయింది? ఆర్టికల్ లో తెలుసుకుందాం. By KVD Varma 12 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి TDP and Janasena : ఒకరు రాజకీయాల్లో (Politics) తలపండిన వ్యక్తి. మరొకరు సినిమాల్లో తిరుగులేని శక్తి. ఆయన పేరు చెబితే దేశవ్యాప్తంగా రాజకీయ నాయకుల్లో విపరీతమైన క్రేజ్. ఈయన పేరు వినపడితే దద్దరిల్లిపోయే అభిమాన కేరింతలు. ఇద్దరూ.. ఇద్దరే..! అవును టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu).. జనసేనాని (Janasena) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇద్దరి జోడీ అలా.. ఇలా కుదిరింది కాదు. అవమానాలను అవకాశాల నిచ్చెనలుగా చేసుకుని.. ఎదురైన రాజకీయ సవాళ్ళను సందర్భోచితంగా ఎదుర్కొని.. సహనం.. సంయమనం ఆయుధాలుగా ఒకరు ముఖ్యమంత్రిగా.. మరొకరు డిప్యూటీగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించారు. గత పదేళ్లుగా వారిద్దరి రాజకీయ ప్రస్థానం గమనిస్తే.. పర్శనాలిటీ డెవలప్మెంట్ కోణంలో కొత్త పేజీలు పుట్టుకొస్తాయనడంలో సందేహం లేదు. TDP and Janasena: అది 2014.. టీడీపీ.. బీజేపీ కలిసి వైసీపీ పై పోటీకి దిగాయి. అప్పుడు జనసేనాని పవన్ కల్యాణ్ ఇద్దరినీ సమర్ధిస్తూ.. ఎన్నికల్లో పోటీచేయకుండా ఉండిపోయారు. ఆ ఎన్నికల్లో టీడీపీ.. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అయింది. తరువాత పరిణామాల్లో బీజేపీతో చంద్రబాబు విభేదించడం.. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల కంటే కొద్దిగా ముందుగా వచ్చిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు పలకడం.. ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ కూడా ఏపీ అసెంబ్లీయే ఎన్నికల్లో ఒంటరి పోటీకి దిగడం.. వరుసగా జరిగిపోయాయి. కట్ చేస్తే.. ఎన్నికల్లో జనసేన చిత్తుగా ఓడిపోయింది. రెండు చోట్ల పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మరోవైపు టీడీపీ కూడా 23 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితిఏర్పడింది. 151 సీట్లతో వైసీపీ చరిత్ర సృష్టించింది. వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అక్కడ నుంచి చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ లకు అవమానాల కథ మొదలైంది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఇద్దరు నేతలకు ఒకరకంగా మానసికమైన టార్చర్ మొదలైందని చెప్పవచ్చు. ఇద్దరినీ సాధ్యమైనంతగా.. మాటలతో వేధించారు. అవమానాల పాలు చేశారు. నిండు సభలో.. TDP and Janasena : వైసీపీ మంత్రులు, నాయకులు చంద్రబాబును తీవ్రంగా అవమానించారు. తినకూడని మాటలతో వేధించారు. అసెంబ్లీలో 2021 నవంబర్ 19న చంద్రబాబు కుటుంబాన్ని అవామానించే విధంగా మాట్లాడటంతో ఆయన అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి తీవ్రమైన బాధను వ్యక్తం చేశారు. ఒకదశలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అప్పుడే నేను మళ్ళీ అసెంబ్లీకి వస్తే ముఖ్యమంత్రిగానే వస్తాను అంటూ చెప్పి.. తరువాత అసెంబ్లీలో అడుగుపెట్టలేదు. ఈ వేధింపులు ఎన్నికలకు కొద్ది నెలల ముందు పీక్స్ కి చేరాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకు పంపించారు. అక్కడితో చంద్రబాబు అవమానాల కథ పీక్స్ కి చేరింది. దత్తపుత్రుడు అంటూ.. TDP and Janasena: రెండు చోట్లా ఓటమి పాలు కావడంతో పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు తీవ్ర విమర్శల దాడి మొదలు పెట్టారు. పవన్ కళ్యాణ్ అడుగు తీసి అడుగు వేస్తే చాలు.. ఇష్టానుసారంగా వ్యక్తిగతంగా విమర్శిస్తూ మీడియా సమావేశాల్లోనూ.. సోషల్ మీడియాలోనూ వైసీపీ నేతలు, మంత్రులు, క్యాడర్ రెచ్చిపోయి దూషణలు చేస్తూ వచ్చారు. పవన్ కళ్యాణ్ ను అవమాన పరచడంలో ఎంత వరకూ వెళ్లిపోయారంటే.. ఆయన పెళ్లిళ్ల నుంచి ఆఖరుకు తల్లిని కూడా దూషించే వరకూ చేరిపోయింది వ్యవహారం. ఇప్పటంలో జరిగిన సభలో మొదటిసారి పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ ప్రతిజ్ఞ చేశారు. ఇద్దరినీ దగ్గర చేసిన సందర్భం.. TDP and Janasena: చంద్రబాబును అరెస్ట్ చేయడం ఈ ఇద్దరి మధ్య అతి పెద్ద దగ్గరితనాన్ని తీసుకువచ్చే సందర్భంగా మారిపోయింది. అవమానాల భారంతో ఇద్దరూ ఉన్న పరిస్థితుల్లో.. చంద్రబాబు అరెస్ట్ జరిగింది. ఆయన అరెస్ట్ ను నిరసిస్తూ హైదరాబాద్ నుంచి విజయవాడ బయలుదేరిన పవన్ కళ్యాణ్ ను దారిలోనే నడిరోడ్డుపై నిలిపివేసింది వైసీపీ ప్రభుత్వం. దీంతో తీవ్ర అసహనానికి గురైన పవన్ కళ్యాణ్ అప్పుడే వైసీపీ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకు పడ్డారు. తరువాత చంద్రబాబు రాజమండ్రి జైలు రిమాండ్ ఖైదీగా ఉన్నపుడు అకస్మాత్తుగా జైలు వద్దకు వెళ్లి చంద్రబాబును పరామర్సించారు. తెలుగుదేశం క్యాడర్ చంద్రబాబు అరెస్ట్ తో నిస్తేజంగా ఉన్న సమయంలో తన మిత్రపక్షమైన బీజేపీని సంప్రదించకుండానే.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీచేస్తాయంటూ సంచలన ప్రకటన చేశారు. అక్కడి నుంచి బీజేపీ తో కలిసి కూటమి గా పోటీ చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. Also Read : చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. లైవ్ అప్డేట్స్ అవమానాలను భరించి.. భరించి.. TDP and Janasena: చంద్రబాబు-పవన్ కళ్యాణ్ కలయిక ఏపీ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించాయి. పదేళ్ల రాజకీయ అవమానాలతో రాటుదేలిన యువ నేత పవన్ కళ్యాణ్.. నలభైఏళ్ల రాజకీయ అనుభవంతో అవమానాల మధ్య సహనంతో వ్యవహరిస్తున్న చంద్రబాబు.. ఇద్దరి కాంబినేషన్ సరిగ్గా కుదిరింది. తమకు జరిగిన అవమానాలను అవసరమైన చోట ప్రస్తావిస్తూ.. రాష్ట్రంలో పాలనలో ఉన్న లోపాల్ని ఎత్తి చూపిస్తూ చంద్రబాబు ప్రసంగాలు చేస్తూ పోయారు. అవమానాలను ఎత్తి చూపుతూ అన్ని పార్టీలు కలిసి ఉండాల్సిన అవసరాన్ని అందరికీ నొక్కి చెబుతూ ఒకింత ఆవేశంగా పవన్ కళ్యాణ్ ప్రసంగాలు సాగిపోయాయి. ఇద్దరూ ఒక ప్రణాళిక ప్రకారం పొత్తులతో వచ్చే చికాకులను సమన్వయ పరుచుకుంటూ.. కేడర్ ను ఎన్నికలకు సిద్ధం చేశారు ఇద్దరూ. వైసీపీ లోపాలను ఎత్తి చూపడమే ప్రధానంగా వారి ప్రచార సరళి కొనసాగింది. పొత్తుల నేపథ్యంలో సీట్ల సర్దుబాటులో అక్కడక్కడా ఇబ్బందులు వచ్చినా ఇద్దరూ ఆచి, తూచి వ్యవహరించారు. అందలం ఎక్కించిన అవమానాలు.. మొత్తంగా చూసుకుంటే, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అఖండ విజయానికి కారణం అవమానాలే అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఒక అవమానం వారిలో పట్టుదలను రేకెత్తిస్తే.. మరొక అవమానం వారిద్దరినీ ఒకదగ్గరకు చేరేలా చేస్తే.. జోరుతగ్గని అవమానాలు, అవహేళనలు బీజేపీతో కలిసి పోవాలని వారిని ప్రేరేపిస్తే.. మూడు పార్టీల కలయిక కలిసి వైసీపీని నెలకు దించడంలో.. పవన్ మాటల్లో చెప్పాలంటే వైసీపీ రాజకీయాల్ని పాతాళంలోకి తోక్కేయడంలో ప్రజల ఏకపక్ష ఓటింగ్ నిలిచింది. ఇప్పుడు ఏపీలో ఏర్పడిన ప్రభుత్వానికి అవమానాలు.. అవహేళనలు.. నిచ్చెన మెట్లయ్యాయి అనడంలో సందేహం లేదు. #pawan-kalyan #tdp #chandrababu #janasena మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి