/rtv/media/media_files/2026/05/30/vaibhav-2026-05-30-12-42-47.jpg)
రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం, 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఐపీఎల్ 2026 ప్రయాణం అత్యంత విషాదకరంగా ముగిసింది. ముల్లాన్‌పూర్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓటమి పాలై టోర్నమెంట్ నుండి నిష్క్రమించింది. ఈ ఓటమితో రాజస్థాన్ ఫైనల్ రేసు నుండి తప్పుకోగా.. గుజరాత్ టైటాన్స్ జట్టు ఆదివారం డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఫైనల్ పోరుకు అర్హత సాధించింది.
మ్యాచ్ ముగిసిన తర్వాత టైటిల్ పోరుకు చేరువగా వచ్చి ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన వైభవ్ సూర్యవంశీ.. డగౌట్ లో కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. కన్నీటిపర్యంతమైన ఆ చిన్నారిని చూసి రాజస్థాన్ సపోర్ట్ స్టాఫ్ సభ్యుడు ఒకరు దగ్గరకు తీసుకుని ఓదారుస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
విరుచుకుపడి సంచలన ఇన్నింగ్స్
ఈ మరణహోరా మ్యాచ్‌లో కూడా 15 ఏళ్ల ఈ కుర్రాడు గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడి సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 4 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నప్పటికీ (96 పరుగులు).. తన జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ విధ్వంసకర సెంచరీతో చెలరేగడంతో వైభవ్ పోరాటం వృథా అయింది. గుజరాత్ జట్టు 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి ఫైనల్లోకి అడుగుపెట్టింది.
Vaibhav Sooryavanshi was crying after the match , he gave his everything but still couldn't get his team over the line , after all he's just a teenage kid and the team was relying on him. take a bow Vaibhav you did great 🥹❤️ pic.twitter.com/7pWXl5YKl3
— Green (@thecamgreen) May 30, 2026
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎందరో మేటి టీ20 ఆటగాళ్లు పాల్గొన్న ఈ ఐపీఎల్ 2026 సీజన్‌లో.. వైభవ్ సూర్యవంశీ అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రంగా అవతరించాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే ప్రపంచ స్థాయి బౌలింగ్ దాడులను భయం లేకుండా ఎదుర్కొని, తన మొదటి పూర్తి ఐపీఎల్ సీజన్ లోనే ఏకంగా 776 పరుగులు సాధించాడు. అతని దూకుడు, స్థిరత్వం, నిర్భయమైన బ్యాటింగ్ శైలికి ప్రపంచ క్రికెట్ దిగ్గజాల నుండి ప్రశంసలు దక్కాయి.
ఈ సీజన్‌లో వైభవ్ పరుగులు చేసిన తీరు క్రికెట్ ప్రపంచాన్ని ముక్కున వేలేసుకునేలా చేసింది. అతను ఏకంగా 237.31 అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో పరుగులు రాబట్టడమే కాకుండా.. ఒకే ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ సీజన్‌లో వైభవ్ ఏకంగా 72 సిక్సర్లు కొట్టి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న అభిషేక్ శర్మ (43 సిక్సర్లు), మూడో స్థానంలో ఉన్న ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ (41 సిక్సర్లు) ల కంటే వైభవ్ చాలా మైళ్ల దూరంలో ఉండటం విశేషం.
సూర్యవంశీ తన చిరస్మరణీయమైన తొలి సీజన్‌ను ఒక సెంచరీ, మూడు సార్లు 90 ప్లస్ స్కోర్లతో ముగించాడు. రాజస్థాన్ టోర్నీ నుండి నిష్క్రమించినా.. ఈ 15 ఏళ్ల బీహార్ సంచలనం రాబోయే కాలంలో భారత క్రికెట్‌ను శాసించబోయే స్టార్ అని ఐపీఎల్ 2026 ద్వారా నిరూపితమైంది.
Follow Us