/rtv/media/media_files/2026/03/12/rcb-2026-03-12-20-15-27.jpg)
మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026 సందడి మొదలుకానుంది. దీంతో క్రికెట్ అభిమానుల్లో అప్పుడే ఉత్సాహం ఉరకలేస్తోంది. ఈ సీజన్ తొలి మ్యాచ్ బెంగళూరు వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరగనుంది. ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తమ శిక్షణా శిబిరాన్ని ప్రారంభించేసింది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటగాళ్లంతా క్యాంప్‌లో చేరుతున్నారు. అయితే ఆర్సీబీ మాత్రం ఇంకా తమ ప్రాక్టీస్ సెషన్లను మొదలుపెట్టలేదు. రెండు జట్లలోనూ విదేశీ ఆటగాళ్ల సందడి ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆర్సీబీ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ అందుబాటుపై ప్రస్తుతం సందిగ్ధత నెలకొంది. అతనికి ఇంకా మెడికల్ క్లియరెన్స్ రాకపోవడంతో, అది అందే వరకు హేజిల్‌వుడ్ జట్టుతో కలిసే అవకాశం లేదని తెలుస్తోంది.
మరోవైపు బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం విషయంలో కూడా కొన్ని అడ్డంకులు కనిపిస్తున్నాయి. 2025లో జరిగిన విక్టరీ పరేడ్ సమయంలో చోటుచేసుకున్న కొన్ని చేదు సంఘటనల వల్ల ఈ స్టేడియం ప్రస్తుతం బీసీసీఐ నిఘాలో ఉంది. బోర్డు అధికారులు స్టేడియంను పూర్తిగా తనిఖీ చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే ఇక్కడ మ్యాచ్‌ల నిర్వహణపై స్పష్టత వస్తుంది. ఇటు సన్‌రైజర్స్ క్యాంప్‌లో కూడా ఆందోళన తగ్గలేదు. ఆ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ వెన్నునొప్పితో బాధపడుతుండటంతో అతను టోర్నీలో ఆడతాడా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. గత సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు తీసి పర్వాలేదనిపించినా, కెప్టెన్‌గా జట్టును అద్భుతంగా నడిపించిన రికార్డు కమిన్స్‌కు ఉంది.
జట్టుకు ప్లస్ పాయింట్
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో కమిన్స్‌తో పాటు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ వంటి స్టార్ ప్లేయర్లు ఫామ్‌లో ఉండటం జట్టుకు ప్లస్ పాయింట్‌గా మారింది. హర్షల్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, జయదేవ్ ఉనద్కత్ వంటి అనుభవజ్ఞులతో పాటు లియామ్ లివింగ్‌స్టోన్, జాక్ ఎడ్వర్డ్స్ లాంటి హిట్టర్లు కూడా జట్టులో ఉన్నారు. కెప్టెన్ అందుబాటులో లేకపోయినా మిగిలిన ఆటగాళ్లంతా మంచి ఊపుమీద ఉండటంతో తొలి మ్యాచ్‌లో ఆర్సీబీపై పైచేయి సాధించాలని ఆరెంజ్ ఆర్మీ పట్టుదలగా ఉంది. ప్యాట్ కమిన్స్ నాయకత్వంలో జట్టు గతంలో బాగా రాణించిన నేపథ్యంలో, ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Follow Us