/rtv/media/media_files/2026/06/03/surya-2026-06-03-21-24-56.jpg)
భారత టీ20 క్రికెట్ జట్టుకు కొత్త కెప్టెన్ రాబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి క్రికెట్ వర్గాలు. త్వరలోనే జరగబోయే ఐర్లాండ్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌ల నుంచి టీమిండియా కొత్త కెప్టెన్‌గా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ బాధ్యతలు చేపట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే, ఈ ఏడాది మార్చిలో భారత్‌కు టీ20 వరల్డ్ కప్ అందించిన సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ శకానికి ఎండ్ కార్డ్ పడినట్లే.
భారత సెలెక్టర్లు ప్రస్తుతం వచ్చే రెండు టీ20 వరల్డ్ కప్‌లను దృష్టిలో పెట్టుకుని దీర్ఘకాలిక కెప్టెన్ కోసం చూస్తున్నారు. సూర్యకుమార్ యాదవ్ మొన్నటి వరల్డ్ కప్‌లో జట్టును గెలిపించినప్పటికీ.. గత కొంతకాలంగా బ్యాటింగ్‌లో నిలకడలేమితో ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్‌లో కూడా ముంబై ఇండియన్స్ తరఫున సూర్య తీవ్రంగా నిరాశపరిచారు. 13 మ్యాచ్‌ల్లో కేవలం 270 రన్స్ మాత్రమే చేశారు. దీంతో ముంబై పాయింట్ల పట్టికలో 9వ స్థానానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో చర్చించిన తర్వాత సూర్య కెప్టెన్సీపై సెలెక్టర్లు తుది నిర్ణయం తీసుకోనున్నారు.
కెప్టెన్‌గా మంచి అనుభవం
ఐపీఎల్‌లో కెప్టెన్‌గా మంచి అనుభవం, రికార్డు ఉన్న శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం కెప్టెన్సీ రేసులో అందరికంటే ముందున్నారు. అయితే ఈ రేసులో తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ కూడా కనిపిస్తున్నారు. ఒకవేళ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ అయితే.. తిలక్ వర్మ లేదా ఇషాన్ కిషన్‌లలో ఒకరికి వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉంది. మరోవైపు ఆసియా గేమ్స్‌లో స్వర్ణ పతకాన్ని డిఫెండ్ చేసుకోవడానికి భారత్ తన మెయిన్ టీమ్‌ను పంపాలని బీసీసీఐ భావిస్తోంది.
ఐపీఎల్ 2026లో తన బ్యాటింగ్ విధ్వంసంతో దేశాన్ని ఊపేసిన 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీకి టీమిండియా టీ20 జట్టులో చోటు దక్కడం దాదాపు ఖాయమైంది. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఏకంగా 776 రన్స్ చేయడమే కాకుండా.. 237.20 స్ట్రైక్ రేట్‌తో ఆడి అవార్డులన్నీ కొల్లగొట్టాడు.
జూన్ 26 నుంచి ఐర్లాండ్, ఇంగ్లాండ్‌లతో భారత్ మొత్తం 7 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఇప్పటికే టాప్ ఆర్డర్‌లో అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ లాంటి వాళ్లు ఉన్నప్పటికీ.. ఈ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ వైభవ్‌కు ఒకటి రెండు మ్యాచ్‌ల్లో అవకాశం ఇచ్చి పరీక్షించాలని సెలెక్టర్లు ప్లాన్ చేస్తున్నారు.
Follow Us