/rtv/media/media_files/2026/04/20/aroniak-ghosh-2026-04-20-17-21-56.jpg)
భారతీయ చదరంగ క్రీడాకారుల జైత్రయాత్ర కొనసాగుతోంది. కోల్‌కతాకు చెందిన 22 ఏళ్ల యువకెరటం అరోణ్యక్ ఘోష్ దేశపు 95వ గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించి సరికొత్త చరిత్ర సృష్టించారు. ఆర్థిక ఇబ్బందులు, స్పాన్సర్ల లేమి వంటి అనేక సవాళ్లను అధిగమించి, కేవలం తన ప్రతిభనే పెట్టుబడిగా పెట్టి ఆయన ఈ విజయాన్ని సాధించారు. థాయ్‌లాండ్‌లో జరిగిన 23వ బీసీసీ ఓపెన్ 2026 టోర్నమెంట్‌లో అరోణ్యక్ విజయాన్ని నమోదు చేశారు. మొత్తం 9 రౌండ్లలో 7 పాయింట్లు సాధించి, 2584 పెర్ఫార్మెన్స్ రేటింగ్‌తో అజేయంగా నిలిచారు. ఈ టోర్నీ ద్వారా తన మూడవ, చివరి గ్రాండ్ మాస్టర్ (GM) నార్మ్‌ను పూర్తి చేసి, అధికారికంగా ఈ హోదాను దక్కించుకున్నారు. 2022లో మొదటి నార్మ్, 2024లో ఫ్రాన్స్‌లో రెండో నార్మ్ సాధించిన ఆయనకు, ఈ మూడో మెట్టు ఎక్కడానికి నాలుగేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తప్పలేదు.
BREAKING NEWS!
— ChessBase India (@ChessbaseIndia) April 19, 2026
Aronyak Ghosh becomes India's 95th Grandmaster. Born in 2003, Aronyak is 22 years old. He achieved his final GM norm at the Bangkok Chess Club Open 2026, where he scored 7.0/9 and tied for first place with several other players.
Aronyak scored his first GM norm… pic.twitter.com/xrBv0E7VzB
తండ్రి పాత బోర్డు నుంచి..
అరోణ్యక్ ప్రయాణం చాలా ఆసక్తికరంగా మొదలైంది. కేవలం నాలుగేళ్ల వయసులో తన తండ్రి మృణాల్ ఘోష్ వద్ద ఉన్న పాత చెస్ బోర్డును ఆయన చూశాడు. ఆ పగిలిపోయిన బోర్డుతో కొడుకు ఆడుతున్న తీరును గమనించిన తండ్రి, తన కొడుకులో ఉన్న ప్రతిభను గుర్తించి గొప్ప క్రీడాకారుడిగా తీర్చిదిద్దాలని అనుకున్నారు. విశేషం ఏమిటంటే, కొడుకు స్పూర్తితో తండ్రి కూడా ప్రొఫెషనల్ ప్లేయర్‌గా మారి ఫైడ్ (FIDE) రేటింగ్ సాధించడం గమనార్హం.
కష్టాల కడలిని దాటి.. గెలుపు తీరానికి
అరోణ్యక్ ఎదుగుదల వెనుక ఎన్నో కన్నీటి గాథలు ఉన్నాయి. మధ్యతరగతి కుటుంబం కావడంతో ఆర్థిక సమస్యలు వెంటాడాయి. కార్పొరేట్ స్పాన్సర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో, తండ్రి తన ఆస్తులను అమ్మి మరీ కొడుకును విదేశీ టోర్నమెంట్లకు పంపేవారు. "ఒక టోర్నమెంట్‌లో గెలిచిన ప్రైజ్ మనీతోనే తదుపరి టోర్నమెంట్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఓడిపోతే తదుపరి అవకాశం ఉండదు అనే తీవ్రమైన ఒత్తిడిలోనూ అరోణ్యక్ ఏకాగ్రత కోల్పోకుండా ఆడాడు." ప్రస్తుతం ఈస్టర్న్ రైల్వేలో ఉద్యోగం చేస్తున్న అరోణ్యక్, ఇటీవల నేషనల్ ర్యాపిడ్ టైటిల్‌ను కూడా గెలుచుకున్నారు. ఆయన విజయ ప్రస్థానంలో కోచ్ సౌమెన్ మజుందార్ పాత్ర ఎంతో ఉదాత్తమైనది. అరోణ్యక్ పరిస్థితిని గమనించి ఆయనకు ఉచితంగా శిక్షణ అందించారు.
Follow Us