రైతు రుణమాఫీపై రేవంత్‌ కీలక వ్యాఖ్యలు.. కేసీఆర్‌ వారిని పట్టించుకోరా..

New Update
రైతు రుణమాఫీపై రేవంత్‌ కీలక వ్యాఖ్యలు.. కేసీఆర్‌ వారిని పట్టించుకోరా..

కేసీఆర్‌ రైతు రుణమాఫీ ప్రకటన కాంగ్రెస్‌ విజయమని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి అన్నారు. గత నాలుగేళ్లుగా బీఆర్‌ఎస్‌ సర్కార్‌పై కాంగ్రెస్‌ పార్టీ పోరాటం చేస్తుందని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ చేసిన ఉద్యమాలు, పోరాటాలతో అధికార పార్టీపై ఒత్తిడి తెచ్చామని అందుకే నేడు కేసీఆర్‌ దిగివచ్చి రైతు రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించారన్నారు. తాము గతంలో సీఎస్‌ను కలిసి రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేశామని, లేకపోతే బ్యాంకుల ముందు ధర్నాలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హెచ్చరించినట్లు గుర్తు చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఒత్తిడికి తలొగ్గిన కేసీఆర్‌ తప్పనిసరి పరిస్థితుల్లో రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించారన్నారు.

కేసీఆర్‌ అసమర్థ పాలన వల్ల రాష్ట్రంలో అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వ్యవసాయం చేయడానికి డబ్బులు లేక, పంటలు పండించేందుకు అప్పులు ఇచ్చేవారు లేక రైతులు అనేక ఇబ్బందులకు గురయ్యారన్నారు. అప్పు ఇచ్చిన వారు వచ్చి ఇంటి ముందు కూర్చున్న రోజులు కూడా ఉన్నాయని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రైతుల సమస్యలు పట్టించుకోని కేసీఆర్‌.. ఫామ్‌హౌస్‌లో జాతీయ రాజకీయాలపై చర్చలు జరిపారన్నారు. కేసీఆర్‌కు అప్పుడు గుర్తురాని రైతులు ఇప్పుడు గుర్తుకొచ్చారా ? అని రేవంత్‌ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ మొదట రాజకీయాలు, తన కుటుంబ లబ్ధి చూసుకుంటాడని, తర్వాతే రాష్ట్ర ప్రజల గురించి ఆలోచిస్తారని విమర్శించారు.

ప్రస్తుతం కేసీఆర్‌ రైతు రుణమాపీ కూడా రాజకీయ లబ్ధిలో భాగంగానే చేస్తున్నారన్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటం, రైతులు కాంగ్రెస్‌తో కలిసి కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తోండటంతో రైతులను తన వైపు మళ్లించుకోవాలనే ఉద్దేశంతోనే రైతు రుణమాఫీ చేస్తోన్నట్లు ప్రకటించారని టీపీసీసీ చీఫ్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేసీఆర్‌ ప్రకటించిన రైతు రుణమాఫీ లక్ష రుపాయల వరకేనన్న రేవంత్.. రాష్ట్రంలో అనేక మంది రైతులు రెండు లక్షల వరకు బ్యాంకుల్లో రుణాలు తెచ్చుకున్నారన్నారు. మరి కేసీఆర్‌ వారిని పట్టించుకోరా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎంతో మంది రైతులు పెరిగిన ధరల వల్ల పెట్టుబడులు పెట్టలేక బయట తెచ్చిన అప్పులు కట్టలేక బ్యాంకులను ఆశ్రయించారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రెండు లక్షల రూపాయలు రైతుల రుణాలను ఒకే సమయంలో మాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. కేసీఆర్ ఎన్ని చేసినా ఇకపై అతని ఆటలు సాగవని, ప్రజలకు కేసీఆర్‌ ఎలాంటి వాడో తెలిసిపోయిందన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, బీఆర్‌ఎస్‌ను బగాళాఖాతంలో పడేయడం కూడా ఖాయమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు