Richest Politicians: ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ఆస్తుల చిట్టా.. అత్యంత ధనవంతులు వీరే!

రెండు తెలుగురాష్ట్రాల్లో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్న వారి ఆస్తుల వివరాలు చూస్తే కళ్లు చెదిరిపోతాయి. దేశంలోనే అత్యంత ధనవంతుల్లో ఇద్దరు ఎంపీ అభ్యర్థులు తెలుగు వారు కావడం విశేషం. టాప్ 20 అభ్యర్థుల ఆస్తుల చిట్టా కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి.

New Update
Richest Politicians: ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ఆస్తుల చిట్టా.. అత్యంత ధనవంతులు వీరే!

Richest Politicians in Telugu States : రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాలకు బరిలోకి దిగుతున్న అభ్యర్థుల ఆస్తులు వివరాల అంశం ఆసక్తికరంగా మారింది. దేశంలోనే అత్యంత ధనవంతులైన ఇద్దరు ఎంపీ అభ్యర్థులు తెలుగు వారు కావడం విశేషం. కాగా నామినేషన్‌ దాఖలు చేసిన అఫిడవిట్‌ల ఆధారంగా ఆస్తుల వివరాలు పరిశీలిస్తే.. తెలుగు రాష్ట్రాల్లోనే భారీ ఆస్తులు కలిగిన ఎంపీ అభ్యర్థిగా గుంటూరు నుంచి టీడీపీ(TDP) అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్‌ మొదటిస్థానంలో నిలిచారు. ఇక రంగారెడ్డి జిల్లా బీజేపీ(BJP) ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. తెలంగాణ(Telangana) లో మొత్తం 547 మంది ఎంపీగా, ఒక కంటోన్మెంట్ సీటుకు 13 మంది ఎమ్మెల్యేలుగా నామినేషన్ దాఖలు చేశారు. అందులో కొంతమంది ప్రముఖుల ఆస్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మొదటి స్థానం పెమ్మసాని..
గుంటూరు ఎంపీ అభ్యర్థి ఎన్‌ఆర్‌ఐ పెమ్మసాని చంద్రశేఖర్‌ రూ.5,785 కోట్ల ఆస్తులు కలిగివున్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు. అమెరికాలో వివిధ రూపాల్లో రూ.28.93 కోట్ల పెట్టుబడులుండగా.. ఆయన పేరు మీద రూ.519 కోట్లు, ఆయన సతీమణి కోనేరు శ్రీరత్న పేరుతో మరో రూ.519 కోట్లు అప్పులున్నాయి. కేవలం పెమ్మసాని పేరు మీద రూ.2,316 కోట్ల విలువైన చరాస్తులున్నాయి. పెమ్మసానికి 181 గ్రాముల బంగారు ఆభరణాలు, ఆయన సతీమణికి 2.5 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయి. కుటుంబం పేరుతో రూ.4.20 లక్షల విలువైన 5.5 కేజీల వెండి ఆభరణాలు ఉన్నాయి. సొంతంగా మెర్సిడెస్‌ బెంజ్‌ ఎస్‌ క్లాస్‌, సీ క్లాస్‌, టెస్లా మోడల్‌ ఎక్స్‌ క్లాస్‌, రోల్స్‌ రాయిస్‌ ఘోస్ట్‌, టొయోటా ఫార్చునర్‌ కార్లు ఉన్నాయి. ఇదే స్థానం నుంచి ఎమ్మసాని చంద్రశేఖర్‌ సోదరుడు రవిశంకర్‌ కూడా నామినేషన్‌ దాఖలు చేయగా.. ఆయన సమర్పించిన ఆస్తులు విలువ రూ.1,555 కోట్లు ఉండటం విశేషం.

కొండా విశ్వేశ్వరరెడ్డి రెండో స్థానం..
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంట్‌ స్థానంలో పోటీ చేస్తున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డికి కూడా భారీ ఆస్తులున్నాయి. నామినేషన్ అఫిడవిట్ పేర్కొన్న ప్రకారం.. తన కుటుంబం పేరిట రూ.4,490 కోట్ల ఆస్తులున్నాయి. విశ్వేశ్వరరెడ్డి పేరు మీద రూ.1,178.72 కోట్లు ఆస్తులుండగా, ఆయన భార్య సంగీత రెడ్డి పేరుతో రూ.3,203.90 కోట్లున్నాయి. ఆయన పేరు మీద వివిధ బ్యాంకుల్లో రూ.17.69 కోట్ల అప్పులున్నట్టు వెల్లడించారు. విశ్వేశ్వరరెడ్డి వద్ద రూ.60 లక్షలు, ఆయన భార్య వద్ద రూ.10.44 లక్షలు విలువైన ఆభరణాలు, వజ్రాలున్నాయి.

ఏపీ సీఎం జగన్..
ఏపీ సీఎం జగన్‌(AP CM Jagan) పేరిట రూ. 529 కోట్ల 87 లక్షల విలువైన స్థిర, చరాస్తులున్నాయి. ఆయన భార్య భారతిరెడ్డి, కుమార్తెలు హర్షిణిరెడ్డి, వర్షారెడ్డిల పేరిట 757 కోట్ల 65 లక్షలున్నాయి. 2019లో జగన్‌ ఒక్కరి ఆస్తుల విలువ 375కోట్ల 20 లక్షలుండగా.. అయిదేళ్లలో 41.22 శాతం పెరిగింది. సొంత కారు లేదు. జగన్‌ పేరిట ఏడు కంపెనీల్లో 263 కోట్ల 64 లక్షల విలువైన ఈక్విటీ షేర్లు ఉన్నాయి.

చంద్రబాబు నాయుడు..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) పేరు మీద మొత్తం రూ.36.36 కోట్లు ఆస్తులున్నాయి. వీటిలో చరాస్తులు రూ.4.80 లక్షలు, వీటిలో ఏపీ9జీ393 నంబరు అంబాసిడర్‌ కారు విలువ రూ.2,22,500. బంగారం లేదు. స్థిరాస్తులు రూ.36.31 కోట్లున్నాయి. కుమారుడు లోకేశ్‌తో కలిసి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుంచి రూ.3.48 కోట్లు ఇంటి రుణం తీసుకున్నారు. బంగారం, ఇతర ఆభరణాలు కలిపి రూ.1.40 కోట్లు. అప్పులు రూ.6.83 కోట్లు. ఇందులో కుమారుడు లోకేశ్‌ నుంచి రూ.1.27 కోట్లు తీసుకోవడం విశేషం. 2019కు ముందు ఆయనపై రెండు కేసులుండగా ఇప్పుడు 22 కేసులున్నాయి.

పవన్ కల్యాణ్..
పిఠాపురం నుంచి అసెంబ్లీ ఎన్నిక(Assembly Elections) ల బరిలో దిగుతున్న పవన్ కల్యాణ్ ఆస్తలు విలువ.. బ్యాంకు నిల్వలు, బాండ్లు, వాహనాలు, బంగారం వంటివి కలిపి రూ. 41 కోట్ల 65 లక్షలు. రూ. 2 కోట్ల విలువ చేసే 1,680 గ్రాముల బంగారం, డైమండ్లు ఉన్నాయి. భార్య కొణిదెల అన్నా పేరిట 215 గ్రాముల బంగారం సహా మొత్తం రూ. కోటి 22 వేల విలువైన ఆస్తులున్నాయి. తన నలుగురు పిల్లల్లో అకీరా నందన్ మేజర్ కాగా, మరో ముగ్గురు మైనర్ల పేరిట కూడా ఆస్తులున్నాయి. మైనర్లు అయిన కొణిదెల పోలిన, మార్క్ శంకర్ల పేరిట ఒక్కొక్కరికీ రూ.11 కోట్ల ఖరీదైన భూములున్నట్టు పేర్కొన్నారు.

తెలంగాణ అభ్యర్థులు: 

రంజిత్‌రెడ్డి..
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి రంజిత్‌రెడ్డికి రూ.300 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు వెల్లడించారు. సొంత కారు లేదు. రంజిత్‌రెడ్డి పేరిట రూ.37.83లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, సతీమణి పేరున రూ.1.59కోట్ల విలువ చేసే బంగారు, వజ్రాభరణాలున్నాయి. రంజిత్‌రెడ్డిపై ఓ క్రిమినల్‌ కేసు ఉంది.

కొంపెల్ల మాధవీలత..
హైదరాబాద్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన కొంపెల్ల మాధవీలత కుటుంబ ఆస్తుల విలువ రూ.221.40 కోట్లుగా పేర్కొన్నారు. వాటిలో స్థిరాస్తుల విలువ రూ.55.92కోట్లు కాగా చరాస్తుల విలువ రూ.165.47కోట్లున్నాయి.

నామ నాగేశ్వరరావు..
ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామ నాగేశ్వరరావు కుటుంబానికి రూ.155.90కోట్ల విలువైన స్థిర, చరాస్తులున్నాయి. ఇందులో 95.47 ఎకరాల వ్యవసాయ భూములు, రెండున్నర కిలోల బంగారం, రూ.కోటి విలువైన కారు, భవనాలు, షేర్లు ఉన్నాయి.నామ నాగేశ్వరరావుపై రెండు కేసులు ఉన్నాయి.

బీబీ పాటిల్‌..
జహీరాబాద్‌ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్‌ కుటుంబానికి రూ.151.69 కోట్ల ఆస్తులున్నాయి. చరాస్తుల విలువ రూ.8.84 కోట్లు. స్థిరాస్తుల విలువ రూ.142.85 కోట్లు. 18 వాహనాలున్నాయి. పాటిల్‌ వద్ద 63.4 తులాలు, ఆయన సతీమణి వద్ద 66 తులాల బంగారు ఆభరణాలు, 1.93 కిలోల వెండి వస్తువులున్నాయి. ఆయనపై 19 క్రిమినల్‌ కేసులున్నాయి.

క్యామ మల్లేశ్‌..
భువనగిరి బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేశ్‌ కుటుంబ ఆస్తుల విలువ రూ.145.34 కోట్లు. మూడు కార్లు, 1.1 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయి. మొత్తం రూ.63.46 లక్షల అప్పులున్నాయి.

కంచర్ల కృష్ణారెడ్డి..
బీఆర్‌ఎస్‌ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి పేరిట రూ.82.60 కోట్ల విలువైన స్థిర, చరాస్తులున్నాయి. ఆయన భార్య పేరిట సుమారు రూ.1.06 కోట్లు ఆస్తులు ఉన్నాయి. కృష్ణారెడ్డికి ఎలాంటి అప్పులు లేవు. ఆయన సతీమణి పేరిట రూ.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలున్నాయి.

పట్నం సునీత..
మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పట్నం సునీత కుటుంబానికి రూ.60.93 కోట్ల ఆస్తులున్నాయి. సొంతంగా 60 తులాల బంగారు ఆభరణాలు, 3 కిలోల వెండి వస్తువులున్నాయి. అప్పులు లేవు.

రామసహాయం రఘురాం రెడ్డి..
ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన రామసహాయం రఘురాంరెడ్డికి రూ.58.27కోట్ల విలువైన ఆస్తులు, రూ.9.54 కోట్ల అప్పులు ఉన్నాయి. రఘురాంరెడ్డికి ఉన్న రూ.58.27కోట్ల ఆస్తుల్లో రూ.13.78 కోట్లు హిందు అవిభాజ్య కుటుంబ ఆస్తులున్నాయి. రూ.9.54కోట్లు అప్పుల్లో రఘురాంరెడ్డి పేరిట 9.23కోట్లు, అవిభాజ్య కుటుంబ అప్పు 31లక్షలున్నాయి.

కుందూరు రఘువీర్‌రెడ్డి..
నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డికి రూ.44.63 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. రూ.17.41 కోట్లకు పైగా అప్పులున్నట్ఉల పేర్కొన్నాడు. పోలీసు శాఖ అనుమతితో ఆత్మరక్షణ కోసం రూ.2.50 లక్షల విలువైన మూడు లైసెన్స్‌డ్‌ తుపాకులు కొనుగోలు చేశారు.

సైదిరెడ్డి శానంపూడి..
నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి సైదిరెడ్డి శానంపూడి కుటుంబానికి రూ.31.35 కోట్ల ఆస్తులున్నాయి. రెండు కార్లు, ఒక ద్విచక్ర వాహనం ఉన్నాయి. వ్యక్తిగతంగా 27 తులాల బంగారం, ఆయన సతీమణి పేరిట 1.5 కిలోల బంగారు ఆభరణాలున్నాయి. రూ.6.10 కోట్ల అప్పులున్నాయి. ఆయనపై 6 క్రిమినల్‌ కేసులున్నాయి.

ఆరూరి రమేశ్..
వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేశ్‌ కుటుంబానికి రూ.28 కోట్లకు పైగా విలువైన స్థిర, చరాస్తులు ఉన్నాయి. సొంత వాహనం లేదు. రమేశ్‌పై ఆరు కేసులున్నాయి.

శ్రీనివాస్‌ గొమాసే..
పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్‌ గొమాసేకు రూ.22.65 కోట్ల విలువైన ఆస్తులుండగా.. రూ.64.49 లక్షల అప్పులున్నట్లు పేర్కొన్నారు. శ్రీనివాస్‌ పేరిట రూ.7.50 లక్షల విలువైన పది తులాల బంగారు ఆభరణాలు, ఆయన భార్య పేరిట రూ.26.25 లక్షల విలువైన 35 తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయి.

గడ్డం శ్రీనివాస్‌యాదవ్‌..
హైదరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్‌యాదవ్‌ కుటుంబానికి రూ.23.71 కోట్ల ఆస్తులున్నాయి. రెండు కార్లు, ఒక ద్విచక్రవాహనం, 53 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి వస్తువులు కలిపి మొత్తం చరాస్తుల విలువ రూ.1.69 కోట్లు. శ్రీనివాస్‌యాదవ్‌ కుటుంబానికి ఎలాంటి అప్పుల్లేవు. ఆయనపై 3 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి.

చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి..
భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌ రెడ్డికి రూ.19 కోట్లకు పైగా విలువైన స్థిర, చరాస్తులు ఉన్నాయి. ఆయన భార్య డింపుల్‌ పేరిట రూ.7,17,45,500 స్థిరాస్తులు, రూ.1,60,50,808 చరాస్తులు ఉన్నాయి. చామలకు రూ.35,53,937 అప్పులు ఉండగా, ఆయన భార్యపేరిట రూ.37,94,436 అప్పు ఉంది. చామల కిరణ్‌కుమార్‌రెడ్డిపై మూడు కేసులున్నాయి.

కాసాని జ్ఞానేశ్వర్‌..
చేవెళ్ల పార్లమెంట్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ కుటుంబానికి రూ.15.12కోట్లు విలువైన ఆస్తులున్నాయి. రూ.30 లక్షల అప్పు ఉన్నట్టు తెలిపారు. జ్ఞానేశ్వర్‌ దంపతుల వద్ద 120తులాల బంగారు ఆభరణాలున్నాయి. కాసాని పేరిట సొంతంగా వాహనాలు లేవు. ఆయన సతీమణి పేరిట నాలుగు కార్లు ఉన్నాయి.

సురేశ్‌ షెట్కార్‌..
జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీగా ఆయన పోటీ చేయనున్న సురేశ్‌ షెట్కార్‌ కుటుంబానికి రూ.10.77 కోట్ల ఆస్తులున్నాయి. ఆయన సతీమణి పేరిట 3.5 కిలోల బంగారు ఆభరణాలున్నాయి. సురేశ్ పై ఒక క్రిమినల్‌ కేసు ఉంది.

వెంకట్రామిరెడ్డి..
మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి కుటుంబానికి రూ.6 కోట్లకుపైగా విలువైన స్థిర, చరాస్తులున్నాయి. ఆయన భార్య వద్ద 3.49 కోట్ల విలువైన 3.332 గ్రాముల బంగారు, 2 కిలోల వెండి ఆభరణాలు ఉన్నాయి.

మాలోతు కవిత..
మహబూబాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, సిటింగ్‌ ఎంపీ మాలోతు కవిత కుటుంబానికి రూ.4.97 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. నగదు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లు, వాహనాలు, బంగారం, ఇళ్లు అన్నీ కలిపి కవిత పేరిట రూ.4.15కోట్లు ఆస్తులున్నాయి. రూ.10.05 లక్షలు అప్పులున్నాయి.

అజ్మీరా సీతారాంనాయక్‌..
మహబూబాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అజ్మీరా సీతారాంనాయక్‌ కుటుంబ ఆస్తుల విలువ రూ.3.06 కోట్లు. 87 తులాల బంగారు ఆభరణాలు, మూడు కార్లు, 6.17 ఎకరాల వ్యవసాయ భూములున్నాయి. రూ.1.37 కోట్ల అప్పులున్నాయి.

మరపల్లి సుధీర్‌కుమార్‌
వరంగల్‌ బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్‌కుమార్‌ కుటుంబానికి రూ.2.04 కోట్ల ఆస్తులున్నాయి. టాటా జెస్ట్‌ కారు, 8 తులాల బంగారు ఆభరణాలున్నాయి. అప్పులు, క్రిమినల్‌ కేసులు లేవు.

కడియం కావ్య..
వరంగల్ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి కడియం కావ్యకు రూ.1.55 కోట్ల ఆస్తులున్నాయి. సొంతంగా ఇల్లు, వ్యవసాయ భూమి లేవు. ఇన్నోవా క్రిస్టా, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, హోండాతోపాటు ఆమె దగ్గర 27 తులాలు, పిల్లల పేరిట 8 తులాల బంగారం ఉంది.

Also Read : రాహుల్‌ గాంధీ భవితవ్యం తేలేది నేడే…లోక్​ సభ రెండో దశ పోలింగ్ ఈరోజే!

ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు:

నందమూరి బాలకృష్ణ..
హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాలకృష్ణ ఆస్తుల విలువ రూ.81.63 కోట్లు. రూ.9 కోట్ల అప్పు ఉన్నట్లు బాలకృష్ణ ప్రకటించారు. బాలకృష్ణ భార్య వసుంధర ఆస్తుల విలువ అక్షరాలా రూ.140 కోట్లు కాగా.. రూ.3 కోట్ల అప్పులు ఉన్నట్లు అఫిడవిట్‌లో తెలిపారు. ఇక ఏపీలో ఆస్తుల్లో టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి టాప్‌లో ఉండగా ఆ తర్వాత వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుకా, శిల్పా చక్రపాణిరెడ్డి, నందమూరి బాలకృష్ణ ఉన్నారు.

వైఎస్ షర్మిల..
కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న వైఎస్ షర్మిల ఆస్తుల విలువ రూ.132.56 కోట్లు. అప్పులు రూ .82.77 కోట్లు ఉన్నట్లు తెలిపారు. ఇందులో తన సోదరుడు సీఎం జగన్ నుంచి రూ.82.58 కోట్లు, జగన్ భార్య వైఎస్ భారతి నుంచి రూ.19.56 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఆమె వద్ద రూ.3.69 కోట్ల విలువైన బంగారం, రూ. 4.61 కోట్ల విలువైన రత్నాలతో సహా రూ. 8.3 కోట్ల విలువైన ఆభరణాలున్నాయి.

బుట్టా రేణుక..
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బుట్టా రేణుక రూ.161.21 కోట్ల ఆస్తులతో అత్యధిక ధనవంతుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. రూ.7.82కోట్ల అప్పులున్నాయి. చరాస్తులు రూ.142.46 కోట్లు. స్థిరాస్తులు రూ.18.75 కోట్లు ఉన్నట్టు వెల్లడించారు. అత్యధిక ఆస్తులు ఉన్న వారి జాబితాలో మూడో స్థానంలో ఉన్నారు. శ్రీశైలం వైసీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి పేరిట రూ.131.71 కోట్లు ఆస్తి ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. రూ.28.24 కోట్ల అప్పులు ఉన్నాయని తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు