Pick Pocketing: జేబుదొంగల పొట్టకొట్టిన పేటీఎం.. ఆ రూటు పట్టిన బ్లేడ్ బాబ్జీలు 

పేటీఎం, ఫోన్ పే, జీపే వంటి యూపీఐ యాప్స్ వచ్చిన తరువాత బ్లేడు బాబ్జీలు రూటు మార్చారు. ప్రజలు జేబుల్లో డబ్బు పెట్టడం మానేశారు. దీంతో జేబుదొంగలు రూటు మార్చారు. సైబర్ దొంగతనాల వైపు.. కొత్త మోసాల వైపు మళ్ళారు. ఎప్పటికప్పుడు కొత్త తరహాలో ప్రజలను దోచేస్తున్నారు.

New Update
Pick Pocketing: జేబుదొంగల పొట్టకొట్టిన పేటీఎం.. ఆ రూటు పట్టిన బ్లేడ్ బాబ్జీలు 

Pick Pocketing: ఎవరైనా బయటకు వెళుతున్నప్పుడు.. ఇంటిలో పెద్దవాళ్ళు జాగ్రత్తగా వెళ్ళిరా.. జేబులో డబ్బు జాగ్రత్త.. అనేవాళ్ళు ఒకప్పుడు. అలాగే, బస్సులు.. ట్రైనులు.. సినిమాహాళ్లు.. ఎగ్జిబిషన్స్.. ఇలా జనం ఎక్కువగా చేరే చోట జేబుదొంగలున్నారు జాగ్రత్త అనే హెచ్చరికల బోర్డులు కనిపించేవి. ఇక సినిమాల్లో హీరోలు.. ఒక్కో సినిమాలో హీరోయిన్లు కూడా జేబు దొంగతనాలు చేస్తూ.. ఆ డబ్బుతో జల్సాలు చేయడమో.. వాళ్ళ పేదరికంతో తప్పనిసరి అయి చేస్తున్నారన్న జస్టిఫికేషన్ తోనూ సీన్లు కోకొల్లలుగా కనిపించేవి.  జేబుదొంగతనాల కోసం చిన్న పిల్లలను కూడా ఆ మార్గంలో పెట్టె పని చేశేవారు. కానీ ఇప్పుడు ఇవన్నీ మాయం అయిపోయాయి. ఎందుకు? పెటీఎం లేదా ఫోన్ పే లాంటివి జేబు దొంగలకు పని లేకుండా చేశాయి. జేబు దొంగతనం చేసి కడుపు నింపుకునే నేరగాళ్ల పొట్ట గొట్టాయి ఈ యూపీఐ యాప్స్ అని ఒక పెద్దాయన జోకేడు. అది నిజమే. ఇప్పుడు మనలో ఎవరూ జేబులో డబ్బులు పెట్టుకోవడం లేదు. ఒకవేళ అత్యవసరం కోసం జేబులో డబ్బు పెట్టుకున్నా అది వందా, రెండు వందలకు మించి ఎవరూ ఉంచుకోవడం లేదు. దీంతో కష్టపడి తెలివితేటలూ ఉపయోగించి జేబు జాగ్రత్తగా కత్తిరించేంత కష్టం ఎవరు పడతారు చెప్పండి. అందుకే గణనీయంగా జేబు దొంగతనాల కేసులు దేశవ్యాప్తంగా తగ్గినట్టు పోలీసులు చెబుతున్నారు. 

జేబుదొంగలే.. సైబర్ దొంగలుగా..
Pick Pocketing: కాలం పరుగులు తీస్తూనే ఉంటుంది. ఆ పరుగులో టెక్నాలజీ మారిపోతూ వస్తుంది. ఇప్పుడు మరింత వేగంగా టెక్నాలజీ మారిపోయింది. అక్షరం ముక్క రాకపోయినా టెక్నాలజీని ఉపయోగించుకునే విధానాలు నేర్పించేసే మాస్టర్లు యూ ట్యూబ్ లో కోకొల్లలు. అదలా ఉంచితే, జేబుదొంగతనాలు తగ్గడం ఒక్కసారిగా జరగలేదు. పర్సుల్లో డబ్బులు దొరకడం లేదు అనే విషయం అర్ధం అయ్యాకా.. పర్సు స్థానాన్ని మొబైల్ ఫోన్ ఆక్రమించాకా.. కొన్నాళ్ళు సెల్ ఫోన్ దొంగతనాలు పెరిగాయి. ఇప్పుడూ జరుగుతున్నా అవి పెద్ద చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు లెండి. టెక్నాలజీ సెల్ ఫోన్ దొంగల్ని పట్టించే స్థాయికి వెళ్ళిపోయింది. దీంతో అదీ చేయలేని పరిస్థితి దొంగతనమే వృత్తి అనుకునే ప్రబుద్ధులకు వచ్చింది. ఇప్పుడు అదే టెక్నాలజీని మెల్లగా ఈ దొంగలు నేర్చారు. సైబర్ దొంగలుగా అవతారం ఎత్తారు. జేబు దొంగతనం అంటే కస్టమర్ దగ్గరకు వెళ్ళాలి.. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.. కానీ, సైబర్ దొంగకు ఆ అవసరమే లేదు. ఎక్కడో కూచుని ఎవరిదో డబ్బును మన ఎకౌంట్ లోకి ఎత్తుకుని వచ్చేయవచ్చు. జేబు దొంగతనం చేసి దొరికి తన్నులు తినే బదులు సైబర్ నేరం అయితే.. రిస్క్ తక్కువ కదా అనే అభిప్రాయానికి దొంగలు వచ్చేసినట్టు కనిపిస్తోంది. 

Also Read:  మద్యపాన నిషేధం.. ఈ హామీ వెనుక ఉన్న అసలు కథ ఇదే.!

తగ్గినవి జేబు దొంగతనాలు.. నేరాలు కాదు..
కానీ, జేబు దొంగతనాలే బెటర్ జేబులో పెట్టుకున్న వెయ్యో.. రెండు వేలతోనో వదిలిపోయేది. కానీ, ఈ సైబర్ దొంగతనంతో బ్యాంకులో సొమ్ములన్నీ ఖాళీ అయిపోతున్నాయి. మంచీ, చెడూ.. కష్టం, సుఖం.. లాభం, నష్టం.. ఉన్నట్టే కష్టపడే వారు, కష్టాన్ని కొల్లగొట్టేవారు రెండు రకాల వ్యక్తులు ఉంటారు. కష్టపడే వారి సొమ్ము ఎలా కొట్టేయాలా అనేది వారి వృత్తి. అది ఆగదు. కాకపోతే, దొంగతనం చేసే పధ్ధతి మారుతుంది. జేబు దొంగతనంలో మోసం ఉండేది కాదు. నేరుగా జేబు వెతుక్కోవడం జాగ్రత్తగా కత్తిరించేయడం.. పరారైపోవడం.. దొరికితే తన్నులు తినడం అంతే. కానీ, ఇప్పటి దొంగలు మాత్రం మంచితనం ముసుగుతో మోసం చేసే టెక్నీక్స్ నేర్చారు. జేబును అంటే అస్తమాను జాగ్రత్తగా తడుముకుంటూ ఉండగలం కానీ.. ఈ మోసగాళ్ల ముసుగును గుర్తించలేం. అందుకే, జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రతి అడుగూ ఆచి, తూచి వేయాలి. సైబర్ నేరగాళ్లున్నారు జాగ్రత్త అనే విషయాన్ని మనం ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నపుడు.. బ్యాంకు లావాదేవీలు చేస్తునపుడూ.. ఏటీఎంలో డబ్బులు తీస్తున్నప్పుడు.. ఇలా ఎక్కడ మన బ్యాంకు కార్డు లేదా వివరాలు ఉపయోగిస్తున్న దగ్గర అయినా అప్రమత్తతతో ఉండాలి. జేబు దొంగతనాలని పేటీఎం, ఫోన్ పే, జీ పే వంటి యూపీఐ విధానాలు ఆపాయి కానీ, ఆన్ లైన్ మోసాలను ఆపగలిగే టెక్నాలజీ రాలేదు. ఏమండీ.. అర్ధం అవుతోందా!

Advertisment
Advertisment
తాజా కథనాలు