Telangana: ఫార్మా-డీ డాక్టర్ పట్టాతో నడి చౌరస్తాలో యువత! తెలంగాణలో ఆరేండ్ల ఫార్మా-డి కోర్సు పూర్తి చేసిన ఉద్యోగాలే లేవు. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో క్లినిక్ ఫార్మాసిస్ట్ క్యాడర్ ను ప్రారంభించాలి. రెగ్యులేషన్- 2015 యాక్ట్ ను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మన్నారం నాగరాజు. By srinivas 11 Apr 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Pharma-D: భారతదేశంలో ఆరోగ్య ప్రణాళిక 1938లో ప్రారంభమైంది. బ్రిటిష్ ప్రభుత్వం సర్ జోసఫ్ భోరె అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేసింది. భోరే కమిటీ గా దాన్ని పిలిచారు. దేశంలో ఆరోగ్య పరిస్థితులు, ఆరోగ్య సంస్థల గురించి వాస్తవ పరిస్థితి సర్వే చేయటానికి ఆ కమిటీ ఏర్పాటైంది. 1946లో కమిటీ నివేదిక సమర్పించింది. డబ్బు చెల్లించే శక్తిలేదన్న కారణంతో ఏ వ్యక్తికీ వైద్య సంరక్షణ అవకాశాన్ని నిరాకరించరాదన్న సూత్రం దీనికి ప్రాతిపదిక. ఆరోగ్య సేవలను ప్రజలకు చేరువలో ఉంచాలనీ, వైద్య సర్వీసులు ఎటువంటి వివక్ష లేకుండా అందరికీ ఉచితంగా అందాలనీ, డాక్టర్ సామాజిక ఫిజిషియన్ గా ఉండాలనీ, ఆరోగ్యం, అభివృద్ధి పరస్పర ఆధారితాలని కూడా ఈ కమిటీ పేర్కొంది. ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యతే.. భారత రాజ్యాంగం ప్రకారం కూడా తన ప్రజల ఆరోగ్యస్థాయిలను మెరుగుపరిచే బాధ్యతను ప్రభుత్వమే స్వీకరించాలి. మద్యపానం, మాదక ద్రవ్యాలకు దూరంగా ప్రజలుండేలా తగు చర్యలు ప్రభుత్వాలే చేపట్టాలి. 'జీవించే హక్కు ప్రతి వారి 'ప్రాథమిక హక్కు' అనీ, తద్వారా ఆరోగ్యం కూడా ప్రజల ప్రాథమిక హక్కుగా పరిగణింపబడుతుందని సుప్రీంకోర్టుతో సహా వివిధ న్యాయస్థానాలు పలు సందర్భాలలో స్పష్టం చేశాయి. ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 21 ప్రకారం కూడా ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యతగా ఉంది. ఆర్టికల్ 39 ప్రకారం పిల్లలకు, కార్మికులకు ఆరోగ్య రక్షణ కల్పించాలి. పని ప్రదేశంలో న్యాయమైన మానవత్వంతో కూడిన పని పరిస్థితులు కల్పించాలని ఆర్టికల్ 42 సూచించగా, పౌష్టికాహారాన్ని అందించడం, నివాసయోగిత ప్రాంతాల్లో ప్రజలు నివసించేలా చూడటం ద్వారా ప్రజారోగ్యాన్ని మెరుగుపర్చేలా కృషి చేయాలని ఆర్టికల్ 47 నిర్దేశించింది. పర్యావరణాన్ని కాపాడటం, తద్వారా కాలుష్యం వల్ల వచ్చే వ్యాధులను అరికట్టాలని ఆర్టికల్ 48-ఎ స్పష్టం చేస్తోంది. అంటే ఈ అన్ని అంశాల ఆధారంగా ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యతే అని స్పష్టమవుతోంది. కానీ, నేటికి స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా మారుమూల గ్రామీణులకు ఇంకా ఆధునిక వైద్యం గురించి తెలియదంటే ఏ స్థితిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలున్నాయో మనకు అర్ధం చేసుకోవచ్చు. వైద్యాన్ని ప్రజలకు చేరువ చేయడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నామని పాలకులు గొప్ప ప్రచారం చేసుకుంటున్నా వాస్తవం మాత్రం వెక్కిరిస్తూనేవుంది. పుట్టిన రోజే మరణిస్తున్న పసికందులు.. వైద్య సేవలు అందించడంలో ప్రపంచంలోని 191 దేశాల్లో మన స్థానం 112గా ఉంది. ఏ దేశం అభివృద్ధికైనా పునాదులు విద్య, వైద్య రంగాలే. కానీ మన దేశంలో మూడు లక్షల మంది పసికందులు పుట్టిన రోజునే మరణిస్తున్నారు. 12లక్షల మంది మొదటి పుట్టిన రోజు జరుపుకో కుండానే మరణిస్తున్నారు. ఐదు సంవత్సరాలలోపు మరణించే పసివారు ప్రతి వెయ్యి మందికి 94మంది ఉన్నారు. ప్రతి పది వేల జనాభాకు కేవలం ఐదు మంది డాక్టర్లు మాత్రమే ఉన్నారు. అదే మన పొరుగున్న ఉన్న చైనాలో ప్రతి పది వేల జనాభాకు 30మంది డాక్టర్లు ఉన్నారు. ఎస్కార్ట్ హార్ట్ ఇన్సిట్యూట్ సర్వే ప్రకారం...భారతదేశంలో 2024 సంవత్సరంలోగా 10లక్షల డాక్టర్లు 50లక్షలు నర్సింగ్ సిబ్బంది కావాలి. కానీ అందుకు చర్యలేవీ..? ఇది కూడా చదవండి: TS: అడ్డగోలు అప్పులు.. దొంగ ఏడుపులు.. కేసీఆర్‌కు బుద్ధి చెప్పాల్సిందే: ఇందిరాశోభన్ ఏకైక ఫార్మసీ సేవ.. 2008లో భారత ప్రభుత్వం నేతృత్వంలోని ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫామ్-డీ కోర్సు ప్రవేశపెట్టింది. ఆరు సంవత్సరాల ఈ ఫామ్డ్ ప్రోగ్రామ్ను ప్రీ-పిహెచ్ఎ, పోస్ట్-గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ డాక్టరేట్ అంటారు. భారతదేశంలో క్లినికల్ ఫార్మసీ సేవలను మెరుగుపరచడానికి ఇది ప్రవేశపెట్టబడింది. రోగి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థతో ప్రత్యక్ష సంబంధంలో ఉన్న ఏకైక ఫార్మసీ సేవ ఇది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోటానుప్రకటిస్తామని ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా విద్యార్థులు ఈ కోర్సు చేయడానికి పెద్ద ఎత్తున క్యూకట్టారు. 2008 సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఫార్మా-డీ కోర్సు ప్రారంభమైంది. చదువు తగ్గట్టు ఉద్యోగాలే లేవు.. మన రాష్ట్రంలో కోర్సు ప్రారంభ దశలో ప్రభుత్వం 284 కళా శాలలకు అనుమతి మంజూరు చేసింది. వీటిలో ఒక్క తెలంగాణ స్టేట్లోనే 69 ఫార్మా-డికాలేజ్లకు పర్మిషన్ ఇచ్చింది. ఒక్కో కళాశాల నుంచి ప్రతీ ఏటా 40 మంది విద్యార్థులు పాసవుట్ అవుతున్నారు. ఇలా 2014 లో మొదటి బ్యాచ్ను పూర్తి చేసుకోగా.. ఇప్పటి వరకూ 9 బ్యాచ్లు ఫార్మా-డీ కోర్స్ను పాస్ అవుట్ చేసుకున్నాయి. దాదాపు 20 వేల మంది విద్యార్థులు ఇప్పటి వరకు ఫార్మా-డీ విద్యనభ్యసించారు. కానీ, ఆరేండ్ల ఫార్మా-డి కోర్సు పూర్తి చేసిన వారికి వారి చదువు తగ్గట్టు ఉద్యోగాలే లేవు. నాలుగేండ్ల బీఫార్మసీ చేసిన వారికి ఉన్న గుర్తింపు కూడా ఫార్మా డీ ఆరు సంవత్సరాలు చేసిన వారికి లేకపోవడం విచారించదగ్గ విషయం. సర్కార్ నౌకరి రాకున్నా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ప్రతి ఆస్పత్రిలో సాధారణ విభాగాల్లో కచ్చితంగా క్లినిక్ ఫార్మసిస్ట్ ఉండాలి. దీనిని దృష్టిలో పెట్టుకునే కేంద్రం డాక్టర్ ఆఫ్ఫార్మసీ(ఫార్మా-డి) కోర్సును 2008లో ప్రవేశపెట్టింది. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పర్యవేక్షించే ఆరేండ్ల వ్యవధి ఉన్న ఫార్మాడీ కోర్సుకు ఎంబిబిఎస్. కి సమాన హెూదా ఉంటుందనే భావనతో వందలాదిమంది కోర్సులో చేరారు. ప్రవేశాల సమయంలో ఒక్కో విద్యార్థి నుంచి 6లక్షల నుంచి 18లక్షల వరకు డొనేషన్ రూపంలో, ఏటా 1.5 నుంచి 3లక్షల వరకు ఫీజు రూపంలో ఈ ఫార్మాడి కళాశాలలు వసూలు చేస్తున్నాయి. ఇక ఫార్మా-డి కోర్సు పూర్తి చేసిన పిబి విద్యార్థులు 2014లో బయటకు వచ్చారు. అయితే ఫార్మా డీ అర్హతతో ఏ ఒక్క సంస్థ కూడా ఇంతవరకు ఉద్యోగ నియామకాలు చేపట్టడం లేదు. కోర్స్ పూర్తి చేస్తే ప్రభుత్వ ఉద్యోగం తప్పక వస్తుందని భావించారు. ఒకవేళ సర్కార్ నౌకరి రాకున్నా.. రిజిస్టర్డ్ ప్రైవేట్ అసుపత్రిల్లో క్లినికల్ ఫార్మాసిస్టులుగా చేరి ప్రజలకు సేవ చేయడంతో పాటు.. తమకు ఉపాధి లభిస్తోందని భావించారు. పట్టాలు చేతపట్టి నడి రోడ్డున పడ్డారు.. ప్రభుత్వం నియమించే డ్రగ్స్ ఇన్స్పెక్టర్ గా, ఆసుపత్రుల్లో క్లినిక్ ఫార్మసిస్ట్ గా, వైద్య పరిశోధన ఔషధ ప్రమాణాల పర్యవేక్షణలో, వైద్య కళాశాలలో పార్మాకో విజిలెన్స్ విభాగంలో, రోగుల కౌన్సిలింగ్ కేంద్రాలు, టెలి ఔషధ కేంద్రాలలో, డి ఆడిక్షన్ కేంద్రాలలో, డ్రగ్ పాయిజన్ సమాచార కేంద్రాల్లో, ఫార్మాడి కళాశాలల్లో బోధనలకు ఈ కోర్సు పూర్తి చేసిన వారు అర్హులు. కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రమాణాల అమలుకు ప్రభుత్వం ఎలాంటి నియామకాలు చేపట్టకపోవడంతో వడంతో ఈ విద్యార్థులకు ఎక్కడా ఖాళీ కనిపించలేదు. నియామకాలు జరగడం లేదు. దీంతో ఈ కోర్సు పూర్తి చేసిన వారు ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. నూతన కోర్సులను ప్రారంభించే సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం తప్పనిసరి. లేకుంటే పట్టాలు చేతపట్టిన విద్యార్థులు రోడ్డున పడడం ఖాయం. సరిగ్గా ఫార్మా డి విద్యార్థుల విషయంలో ప్రస్తుతం ఇదే జరుగుతోంది. లక్షలు పోసి చదివిస్తున్నారు.. కొత్త కోర్సులు అమల్లోకి వస్తే లాభాలు దండుకోవడమే కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాల లక్ష్యం. ఆ మేరకు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో పలువురు ఇలాంటి కోర్సులు ప్రారంభించడంలో ప్రభావితం చేస్తారనీ, ప్రభుత్వాలు అందుకు వంత పాడతాయనీ ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలల్లో అంతర్భాగంగానే ఈ కోర్సుల నిర్వాహణ అమలులోకి వచ్చింది. ఈ కోర్సులు పూర్తిచేసిన వారికి దేశంలోనే కాదు, విదేశాల్లో సైతం మంచి ఉన్నత అవకాశాలు ఉన్నాయని కళాశాలల యాజమాన్యాలు ఊదరగొడుతున్నాయి. ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా సీట్ల భర్తీ జరగడం, విశ్వవిద్యాలయాల అనుబంధ కళాశాలలలో తరగతులు, పరీక్షలు జరుగుతుండటంతో తల్లిదండ్రులు కూడా విద్యార్థులను లక్షలు పోసి చదివిస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ కూడా వెలువడింది లేదు. ఫార్మా- డి కోర్సు గురించి వైద్య విద్య సంచాలక కార్యాలయంలో సంప్రదిస్తే బోధన ఆస్పత్రిలో వీరి సేవలు అవసరం లేదని పేర్కొన్నాయి. ప్రభుత్వన్ని తప్పుదోవ పట్టించి.. 2014 నుంచే ఫార్మా-డి పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం క్యాడర్ను క్రియేట్ చేయాలని అభ్యర్థులు సర్కార్ పెద్దలకు వినతి పత్రాలు అందిస్తూ వచ్చారు. మంత్రులు, ఇతర అధికార పార్టీ నేతలపై ఒత్తిళ్లు పెంచారు. అయితే ఫార్మా- డి అభ్యర్థుల ఒత్తిళ్లకు సానుకూలంగా స్పందించిన గత తెలంగాణ సర్కార్.. 2015లో ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని నియమించింది. ఫార్మా-డి చదివిన విద్యార్థులకు ఏం ఉద్యోగాలు ఇవ్వొచ్చా రిపోర్టు ఇవ్వాలని కమిటీకి సూచించింది. అయితే కమిటీలో సభ్యులుగా ఉన్న డీఎంఈ రమేష్ రెడ్డి ఒక విధంగా ప్రభుత్వవాన్ని తప్పుదోవ పట్టించి.. క్యాడర్ క్రియేషన్, ఆసుపత్రుల్లో క్లినికల్ పోస్టుల ఏర్పాటుపై స్పష్టత రాకుండా ఫార్మా-డీ అభ్యర్థుల పొట్టకొట్టే పని చేశారు. ఇక గత సర్కార్ నిర్వాహకంతో విసిగిపో యిన ఫార్మా-డీ అభ్యర్థులు ప్రభుత్వంపై మరింత ఒత్తిడిని పెంచడం ప్రారంభించారు. 2018లో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ఆందోళన నిర్వహించారు. కేంద్ర మార్గదర్శకాలను అమలుచేయని గత రాష్ట్ర సర్కార్.. మరోవైపు ఫార్మా-డి అభ్యర్థుల సాదక బాధకాలను పరిశీలించిన కేంద్ర సర్కార్.. గతే డాది ఓ కొత్త గెజిట్ ను విడుదల చేసింది. 2015లో ఇచ్చిన సెంట్రల్ గెజిట్కు 2021లో సవరణ చేసింది. 2015లో సీనియర్ పార్మాసిస్ట్, చీఫ్ పార్మాసిస్ట్, డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టుల గురించి మాత్రమే ప్రస్తావించింది. అయితే 2021లో ఇచ్చిన గెజిట్లో దానికి సవరణ చేస్తూ.. క్లినికల్ పార్మాసిస్ట్ పదాన్ని పొందుపర్చింది. తాము ఇచ్చిన ఆదేశాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆడాఫ్ట్ చేసుకోవాల్సిందిగా వెల్లడించింది. అయితే ఇంత వరకు బాగానే ఉన్నా కేంద్ర సర్కార్ చేసిన సూచనను తెలంగాణ ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు వైద్య శాఖలో క్లినికల్ పార్మాసిస్ట్ పోస్టులకు సంబంధించి క్యాడర్ను క్రియేట్ చేయాల్సి ఉన్నప్పటికీ పెడచెవిన పెట్టింది. దీంతో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో క్లినికల్ పార్మాసిస్టులు ఉండాలనే నిబంధనలకు సంబంధించిన ఆదేశాలు కూడా జారీ చేయలేదు. అయితే ఇదే విషయాన్ని గత ప్రభుత్వం కేసీఆర్ తనయుడు, మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకుపోగా..ఆయన డీఎంఈ రమేష్ రెడ్డితో చర్చించి డిప్లొమా చేసిన విద్యార్థులు పోటీ పడే గ్రేడ్-2, గ్రేడ్-1 పార్మాసిస్ట్ పోస్టులకు అర్హత కల్పించే విషయంలో ఆలోచిస్తామని చెప్పి గతంలో చేతులు దులుపుకు న్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఫార్మసీ ఇండస్ట్రీ వస్తున్న తరుణంలో వీరిని మాత్రం తీసుకోకపోవడం కారణమేంటంటే ఆ ఫార్మసీ మాఫియా ఫామ్ డి డాక్టర్లను తీసుకుంటే మా మందులు తక్కువ రాస్తారని వారి వ్యాపారానికి అడ్డుకట్టు వేస్తారని రోగికి సరైన మందులు ఇవ్వడంలో ఫామ్ డి డాక్టర్లు సరైన సూచనలు చేస్తారని మా మందులు అమ్ముడుపోవని అలాగే మెడికల్ కాలేజ్ ఎంబిబిఎస్ డాక్టర్లకు వన్నె తగ్గుతుందని వీరిని ముందుకు తీసుకు రాకపోవడం ఫార్మసీ మాఫియా ఉందని మేధావులు అనుకుంటున్నారు. చదువుకోడానికి అప్పులు చేసిన విద్యార్థులు ఆవేదనతో రోడ్డెక్కారు. అయినా విషయమై ప్రభుత్వాలు స్పందించక పోవడంతో విద్యార్థులు ఆత్మహత్యలే శరణ్యమని భావించే పరిస్థితి నెలకొంది. తమ పట్టాలకు గుర్తింపునిచ్చి ఉద్యోగాలు కల్పించాలని కోరుతున్నారు. కానీ ప్రభుత్వానికి కోర్సులు ప్రవేశపెట్టడంలో ఉన్న ఉత్సాహం వీరికి ఉద్యోగాలు కల్పిండంలో లేకపోవడం విచారకరం.ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మా డీ( డాక్టర్లు) ను వారి సేవలను ఆసుపత్రుల్లో కానీ బస్తీ దవాఖాన లో కానీ లేదా వారికి ప్రాక్టీస్ చేసుకునేందుకు కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మ్- డి వైద్యులకు అవకాశం కల్పించాలని ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరుకుందాం. ఫార్మా-డి డాక్టర్స్ డిమాండ్స్ ఇవే.. 1. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రినందు క్లినిక్ ఫార్మాసిస్ట్ క్యాడర్ ను ప్రారంభించాలి. 2. ప్రతి 30 పడకల ఆసుపత్రినందు ఫార్మాసిస్ట్ ను నియమించాలి. 3. ప్రతి జిల్లాలో ఫాయిజన్ ఇన్ ఫర్మేషన్ సెంటర్ ను ఏర్పాటు చేయాలి. 4. రెగ్యులేషన్- 2015 యాక్ట్ ను వెంటనే అమలు చేయాలి. 5. తెలంగాణ రాష్ట్రంలో ఫార్మసీ ప్రాక్టీస్ 5. నాకో, ఎన్సీడీసీ, ఆర్ఎన్టీపీసీ, అన్ని జాతీయ ఆరోగ్య పథకాల్లో ఫార్మసీ డాక్టర్లను నియమించాలి. 6. ఆరోగ్య శ్రీ. ఈహెచ్ఎస్, సీజిహెచ్ఎస్ లకు అనుసంధానంగా ఉన్న ఆసుపత్రులకు క్లినికల్ ఫార్మాసిస్టులను నియమించేలా ఉత్తర్వులు ఇవ్వాలి. 7. డిహడిక్సిన్, రిహబిటేషన్ సెంటర్లలో ఫార్మ్- డి వైద్యులను నియమించాలి. 8. ఫార్మ్-డి కోర్స్ ను వెంటనే టెక్నికల్ వర్శిటీ పరిధి నుంచి హెల్త్ యూనివర్శిటీ పరిధిలోకి తీసుకురావాలి. 9. ప్రతి టీచింగ్ హాస్పిటల్ నందు క్లినికల్ సెంటర్ ను ఏర్పాటు చేయాలి. 10. బస్తీ ధవఖానాలలో ఫామ్ డి డాక్టర్లను నియమించాలి. మన్నారం నాగరాజు - తెలంగాణ లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు 95508 44433 #pharma-d-course-jobs #mannaram-nagaraju మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి