పాకిస్థాన్ కు పాస్‌పోర్ట్‌ కష్టాలు.. లక్షలాది మందికి తప్పని తిప్పలు

ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ ప్రజలను ఇప్పుడు మరో పెద్ద సమస్య వేధిస్తోంది. విదేశాలకు వెళ్లాలనుకునేవాళ్లకు పాస్ పోర్ట్ కష్టాలు ఎదురవుతున్నాయి. లామినేషన్‌ పేపర్‌ కు తీవ్ర కొరత ఏర్పడటంతో వాటి ముద్రణకు ఆటంకం కలుగుతోంది.

New Update
పాకిస్థాన్ కు పాస్‌పోర్ట్‌ కష్టాలు.. లక్షలాది మందికి తప్పని తిప్పలు

Pakistan Passport Shortage: పాకిస్థాన్ కొంతకాలంగా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు అక్కడి ప్రజలను మరో పెద్ద సమస్య వేధిస్తోంది. విదేశాలకు వెళ్లాలనుకునేవాళ్లకు పాస్ పోర్ట్ కష్టాలు ఎదురవుతున్నాయి. లామినేషన్‌ పేపర్‌ కు తీవ్ర కొరత ఏర్పడటంతో ముద్రణకు ఆటంకం కలుగుతోంది. దీంతో లక్షలాది మంది పాస్‌పోర్ట్‌ల కోసం నిరీక్షిస్తున్నట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

ఈ మేరకు పాక్‌ డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇమ్మిగ్రేషన్ అండ్‌ పాస్‌పోర్ట్స్‌ (DGI&P) వివరాల ప్రకారం.. ఫ్రాన్స్‌ నుంచి ఈ పేపర్ ను దిగుమతి చేసుకుంటున్నారు. అయితే ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతన్న దేశం.. ఈ దిగుమతులను సరిపడా చేసుకోలేకపోతోంది. రెండు నెలల కిందే లామినేషన్ పేపర్ కోసం ఆర్డర్‌ చేసినా.. డబ్బులు చెల్లించకపోవడంతో పేపర్ అందలేదు. దీంతో దేశవ్యాప్తంగా లామినేషన్‌ పేపర్‌కు (Lamination Paper) తీవ్ర కొరత ఏర్పడింది. ఫలితంగా కొత్త పాస్‌పోర్ట్‌ల ముద్రణ దాదాపు ఆగిపోయే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ముద్రణ తగ్గిపోవడంతో కొత్త పాస్‌పోర్ట్‌ల జారీ కూడా గణనీయంగా తగ్గిందని ప్రాంతీయ కార్యాలయాలు చెబుతున్నాయి. గతంలో రోజుకు 3-4వేల పాస్‌పోర్టులను ప్రాసెస్‌ చేసేవాళ్లమని.. ఇప్పుడు ఆ సంఖ్య 12-13కు తగ్గిందని ప్రాంతీయ కార్యాలయ అధికారులు తెలిపారు. మరో రెండు, మూడు నెలల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశమున్నట్లు చెబుతున్నారు.

Also read :ఐదేళ్లలో నక్సలిజాన్ని ఖతం చేస్తాం.. అమిత్ షా

ఇక దీనిపై పాక్‌ హోంశాఖ మీడియా విభాగం డైరెక్టర్‌ జనరల్‌ ఖాదిర్‌ యార్‌ తివానా (Qadir Yar Tiwana) మాట్లాడుతూ.. 'ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. త్వరలోనే పరిస్థితులు చక్కబడుతాయి' అని చెప్పినట్లు ఓ కథనం వెల్లడించింది. ఈ పరిణామాలతో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల పరిస్థితి గందరగోళంలో పడింది. విద్య, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లాలనుకునేవారు పాస్‌పోర్ట్‌లు రాక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే యూకే, ఇటలీ వంటి దేశాల యూనివర్సిటీల్లో అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులు.. సమయానికి ఆ దేశాలకు వెళ్లగలమో.. లేదోనని ఆందోళన చెందుతున్నారు. పాస్‌పోర్ట్‌లు రాకపోతే తాము అవకాశాలను కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు