మళ్లీ కరోనా కలవరం.. వేగంగా వ్యాపిస్తోన్న కొత్త వేరియంట్

కొద్దికాలంగా కరోనా వైరస్ కేసులు అంతగా రాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకుంటున్నారు. ఈ తరుణంలో కరోనా కొత్త వేరియంట్ మళ్లీ ఆందోళన కల్గిస్తోంది. అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాలని.. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని WHO హెచ్చరించింది.

New Update
మళ్లీ కరోనా కలవరం.. వేగంగా వ్యాపిస్తోన్న కొత్త వేరియంట్

కరోనా వైరస్ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. తాజాగా కరోనాకు చెందిన కొత్త వేరియంట్ బ్రిటన్‌లో వేగంగా వ్యాపిస్తోంది. ఒమిక్రాన్ వైరస్‌లో జన్యుమార్పుల వల్ల ఏర్పడిన EG.5.1 అనే కొత్త వేరియంట్ బ్రిటన్ వాసులను వణికిస్తోంది. ఈ వేరియంట్‌ను అంకెల్లో పలకడం ఇబ్బందిగా ఉండటంతో ఎరిస్ అని పేరు పెట్టారు. యూకేలో నిర్ధారణ అవుతున్న ప్రతి ఏడు కరోనా కేసుల్లో ఒకటి ఎరిస్ అని ఆ దేశ ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) రెండు వారాల క్రితమే ఎరిస్ వేరియంట్‌ను ట్రాక్ చేసింది. యూకేలోనే కాదు అంతర్జాతీయంగా కూడా ఈ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు.

ఒమిక్రాన్ వేరియంట్‌ నుంచి పుట్టుకొచ్చిన ఎరిస్ వేరియంట్ ప్రస్తుతం వేగంగా వ్యాప్తి చెందుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. బ్రిటన్‌లో కొత్తగా నమోదవుతున్న కొవిడ్ కేసుల్లో 14.6 శాతం ఎరిక్ కేసులు ఉన్నట్టు బ్రిటన్ వైద్యులు చెబుతున్నారు. ఈ వేరియంట్‌ను మొదటిసారిగా 2023 జూలై నెలలో గుర్తించారు. కేవలం బ్రిటన్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగానూ ఈ కేసులు పెరుగుతున్నట్టు చెబుతున్నారు. వ్యాక్సిన్‌ తీసుకున్నా, అంతకుముందు కరోనా వచ్చి, తగ్గిన వారు కూడా ఈ కొత్త వేరియంట్‌తో జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. అయితే ఈ వేరియంట్‌తో తీవ్ర ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం కరోనాకు సంబంధించి ఇప్పటివరకు 4,722 సీక్వెన్సులు వెలుగు చూశాయి. ఇందులో చాలావరకూ తీవ్రత లేనివే అని పేర్కొంది. హెల్త్ ఎమర్జెన్సీ జాబితా నుంచి కోవిడ్ 19ను మే 5న WHOతొలగించింది. అయితే ప్రస్తుతం ఎరిస్ వేరియంట్ ఆందోళనకరంగా మారుతోంది. దీని పూర్తి లక్షణాలు తెలియనప్పటికీ ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ కంటే అత్యంత వేగంగా వ్యాపిస్తోందని తెలుస్తోంది. అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాలని.. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని WHO హెచ్చరించింది.

యూకేలో కేసుల పెరుగుదలకి కారణం ఏంటి?

కరోనా కొత్త వేరియంట్ ఎరిస్ వ్యాప్తి చెందటానికి బార్బీ, ఓపెన్ హైమర్ సినిమాల విడుదల అని అక్కడి మీడియా చెబుతోంది. ఈ సినిమాల విడుదల కారణంగా ప్రజలు అధిక సంఖ్యలో ఒకచోట చేరడంతో కేసుల సంఖ్య పెరగడానికి దోహదడిందని పేర్కొంది. చెడు వాతావరణం, రోగనిరోధక శక్తి క్షీణించడం కూడ కేసు పెరుగుదలకి ఇతర కారణాలుగా తెలిపింది.

గత వేరియంట్లలో కనిపించే కోవిడ్ లక్షణాలే ఇప్పుడు కూడా కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. తలనొప్పి, జ్వరం, ముక్కు కారడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు. కరోనా వ్యాప్తి జరగకుండా ఉండటం కోసం చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, బయటకి వెళ్లేటప్పుడు మాస్క్ ధరించాలని హెచ్చరించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు