మన్మోహన్ సింగ్ మౌన ముని కాదు.. దేశం గతిని మార్చిన ముని. పల్లెలను నుంచి కరువును, పేదరికాన్ని తరిమికొట్టి.. పేదలు ఆత్మగౌరవంతో బతికేలా చేసిన ఉపాధి హామీ పథకం ఆయన తెచ్చిందే.. ప్రభుత్వం వద్ద ఉండే సమాచారం, నిర్ణయాలు బ్రహ్మ రహస్యం కాదు.. సామాన్యులు కూడా తెలుసుకోవాల్సిందే.. అంటూ ఆయన తీసుకువచ్చిన రైట్ టూ ఇన్ఫర్మేషన్ యాక్ట్ దేశంలో ప్రజాస్వామ్యానికి మరింత బలాన్ని చేకూర్చింది. విద్యాహక్కు చట్టంతో పేదలు కూడా బడికి వెళ్లేలా ఓ విప్లవాత్మక చట్టాన్ని తీసుకువచ్చారు. దేశంలో డిజిటల్ విప్లవంలో కీలకంగా మారిన ఆధార్ తీసుకువచ్చింది కూడా మన్మోహనుడే. ఇలా అందరి ప్రధానులకు భిన్నంగా దేశంపై తనదైన చెరగని ముద్ర వేశారు మన్మోహన్. మొత్తం వందకు పైగా (114) మీడియా సమావేశాల్లో మాట్లాడిన ఘనత ఆయన సొంతం. దేశంలో అత్యధిక సార్లు మీడియాతో మాట్లాడిన ప్రధాని కూడా ఆయనే. ఉపాధి హామీ హక్కు చట్టం.. మన్మోహన్ సింగ్ హయాంలో కాంగ్రెస్ తీసుకువచ్చిన అత్యంత ప్రతిష్టాత్మక చట్టాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఒకటి. గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఉపాధి కల్పించిన ఘనత ఈ చట్టానిది. ఈ చట్టం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో భారీ మార్పులు వచ్చాయన్న విశ్లేషణలు ఉన్నాయి. సమాచార హక్కు (RTI) (2005) మన్మోహన్ సింగ్ ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని రూపొందించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత, జవాబుదారీతనానికి ఈ చట్టం హామీ ఇచ్చింది. ఈ చట్టం ద్వారా అనేక సంచలన విషయాలు నిత్యం వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. విద్యా హక్కు (2009) మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉచిత, నిర్బంధ విద్య కోసం బాలల హక్కు చట్టాన్ని తీసుకువచ్చింది రుణమాఫీ.. ఇప్పుడు అన్ని పార్టీలకు ఎన్నికల అస్త్రంగా మారిన రుణమాఫీని తొలిసారి చేసిన ఘటన మన్మోహన్ సింగ్ ది. 2008లో యూపీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 3 కోట్ల మంది రైతులకు రూ.72,000 కోట్ల రుణమాఫీ చేసింది. ఈ నిర్ణయంతోనే రెండో సారి యూపీఏ అధికారంలోకి వచ్చిందన్న విశ్లేషణలు ఉన్నాయి. ఆధార్ మన దేశంలో ఇప్పుడు ఆధార్.. అన్నింటికీ ఒకటే గుర్తింపు కార్డు. పాన్ కార్డ్, సిమ్ కార్డ్, బ్యాంకు అకౌంట్, చివరికి ఉచిత బస్సు ప్రయాణం, ఆసరా పింఛన్.. ఇలా అన్నింటికి ఒకటే ప్రూఫ్ ఆధార్. మన దేశం డిజిటలైజేషన్ లో ముందుకు దూసుకెళ్లడానికి ప్రధాన పాత్ర పోషించిన ఆధార్ ను తీసుకువచ్చింది మన్మోహన్ సింగ్ ప్రభుత్వమే.